మెగా హిట్‌ చేయాలి | Challa Dharma Reddy MLA of PARKAL success to cm tour | Sakshi
Sakshi News home page

మెగా హిట్‌ చేయాలి

Published Sat, Oct 14 2017 12:33 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

Challa Dharma Reddy MLA of PARKAL success to cm tour

వరంగల్‌ , గీసుకొండ(పరకాల): సీఎం కేసీఆర్‌ ఈనెల 20న కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్‌ పాల్గొనే బహిరంగ సభను కనీవిని ఎరగని రీతిలో నిర్వహించడానికి ఏర్పాట్లను చేస్తున్నామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఈ ‘మెగా’ కార్యక్రమాన్ని హిట్‌ చేయాలని అన్నారు. శుక్రవారం శాయంపేటహవేలి శివారులోని టెక్స్‌టైల్‌ పార్కు స్థలంలో బహిరంగ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పోలీసు, టీఎస్‌ఐఐసీ, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే సభావేదిక, హెలీప్యాడ్, పార్కింగ్‌ స్థలాలను గుర్తించామన్నారు. శాయంపేటహవేలి శివారు ఊకల్‌–స్టేషన్‌చింతలపెల్లి దారి పక్కనే ఉన్న మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేసే సభాస్థలికి అరకిలోమీటరు దూరంలోనే వాహనలు పార్కింగ్‌ చేసేలా పోలీస్‌ అధికారుల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పార్కింగ్‌ స్థలాలను గుర్తించాం
పరకాల, నర్సంపేట, ములుగు నియోజవర్గాల ప్రజలు మచ్చాపూర్, పర్వతగిరి, సంగెం మండలం చింతలపల్లి మీదుగా రావాల్సి ఉంటుం దని, ఈ మేరకు ప్రాథమికంగా రూట్‌ మ్యాప్‌ తయారు చేశామన్నారు. పర్వతగిరి, రాయపర్తి మండలాల నుంచి సంగెం మీదుగా వచ్చే వారికి చింతలపెల్లి గేట్‌ సమీపంలో, పాలకుర్తి, ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాలు, హన్మకొండ, మామునూరు, రంగశాయిపేట, వంచనగిరి, శాయంపేట మీదుగా వచ్చే వారికి శాయంపేట రైల్వే గేటు సమీపంలో పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ట్రాఫిక్‌ జామ్‌ సమస్య తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. టీఎస్‌ ఐఐసీ జోనల్‌ మేనేజర్‌ రతన్‌రాథోడ్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వి.రాజగోపాల్, వరంగల్‌ ఆర్డీఓ మహేందర్‌జీ, ఈస్ట్‌ జోన్‌ డీసీపీ ఇస్మాయిల్, పరకాల ఏసీపీ సుధీంద్ర, ఎనుమాముల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొంపెల్లి ధర్మరాజు, శాయంపేట సర్పంచ్‌ కొంగర చంద్రమౌళి, తహసీల్దార్‌ గుర్రం శ్రీనివాస్, గీసుకొండ, పర్వతగిరి, మామునూరు సీఐలు సంజీవరావు, సత్యనారా యణ, శివరామయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు పోలీస్‌ ధర్మారావు, వెంకన్న, గోలి రాజయ్య, జయపాల్‌రెడ్డి, రవీందర్‌ పాల్గొన్నారు.

‘పార్కు’ స్థలాన్ని పరిశీలించిన టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు
టెక్స్‌టైల్‌ పార్క్‌ వద్ద బహిరంగ సభ స్థలాన్ని టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు శుక్రవా రం రాత్రి పరిశీలించారు. పొద్దుపోయిన తర్వా త ఆయన ఇక్కడికి రావడం, చీకటిగా ఉండటంతో ఏమీ కనిపించక శనివారం వస్తానని చెప్పి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. బాలమల్లుతో పాటు టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి హన్మకొండలో బసచేసి శనివారం మంత్రి కేటీఆర్‌ పర్యటనలో పాల్గొననున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement