
వరంగల్ ప్రజల రక్తం మీద ఉన్న విశ్వాసంతో చెబుతున్నా.. వందకు వందశాతం అద్భుతమైన టెక్స్‌టైల్ పార్కు రూపుదిద్దుకుంటది. పెట్టుకున్న పేరు కాకతీయ రాజులది. కాబట్టి బర్కత్ ఉంటది. సూరత్‌లో చీరలు, సోలాపూర్‌లో దుప్పట్లు, తిర్పూరులో బనీన్లు దొరుకుతాయి. కానీ.. వరంగల్‌లో ఒకే చోట అన్ని దొరికేలా టెక్స్‌టైల్ పార్కుకు రూపకల్పన చేసినం.
– సీఎం కేసీఆర్
సాక్షి, వరంగల్ రూరల్:
‘కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాబోతున్నాయి.. ఇక చాలు సార్ అనే వరకు వస్తాయి.. దమ్మున్న రైతులు మూడు పంటలు పండించే జిల్లా వరంగల్. ఈ నీటితో బంగారు వరంగల్ అవుతుంది. ఆ తర్వాతనే బంగారు తెలంగాణ అవుతది.. మొట్టమొదటి అవకాశం మీ జిల్లాకే రాబోతున్నది’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల్లోని చింతలపల్లి ప్రాంతంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు,కాజీపేట ఆర్‌ఓబీ, ఐటీ ఇంక్యుబేష¯Œన్ సెంటర్, ఔటర్ రింగ్‌రోడ్డులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. వ్యవసాయ, పారిశ్రమిక, విద్యా రంగాల్లో రాబోయే రోజుల్లో అద్భుతమైన జిల్లాగా వరంగల్ రూపుదిద్దుకోబుతున్నదని చెప్పారు. టెక్స్‌టైల్ పార్కులో లక్ష మందికి ఉపాధి కల్పించి, లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు అందిస్తాం.. బంగారం పండించి, విద్యారంగంలో అభివృద్ధి సాధించి దేశంలోనే గొప్ప జిల్లాగా మారుతుంది.. ఇది నా అకాంక్ష.. నేరవేరుతది అని స్పష్టం చేశారు.
దేశంలోనే పెద్ద నగరం..
రాష్ట్రంలోనే అతి పెద్ద రెండో నగరం వరంగల్ కాబట్టి రాబోయే రోజుల్లో గిరిజన యూనివర్సిటీ, ఇతర విద్యా సంస్థలు ఏవి వచ్చినా వరంగల్‌కే తీసుకొస్తానని హామీ ఇచ్చారు. హైదారాబాద్‌లో ఇప్పటికే అన్ని ఉన్నాయి.. వరంగల్‌కే తరలిస్తామన్నారు. ఉద్యమ గురువు జయశంకర్ సార్, వరంగల్‌కు ఎప్పుడు వచ్చినా ఊపిరిని ఇచ్చింది మీరే.. అని గుర్తు చేశారు. సభకు ఏ పదివేల మంది వస్తారనుకున్నా.. కానీ లక్షలాదిగా ప్రజలు తరలిరావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
వరంగల్ ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే
‘వరంగల్ ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోయిన.. తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడుతానని చెప్పిన.. భగవంతుడు మన్నించిండు.. మీరు దయకల్పించిండ్లు.. అదే తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టిన’ అని కేసీఆర్ అన్నారు. వరంగల్ ప్రజలు ఇచ్చిన స్ఫూర్తి, నమ్మకంతోనే రాష్ట్రం సాధించామని చెప్పారు. ఈ సభ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులకు ధన్యవదాలు తెలిపారు.
సభలో తప్పిపోయిన మహిళ
గీసుకొండ(పరకాల): మండల కేంద్రానికి చెందిన వద్దిరాజు లక్ష్మి అనే మూగ మహిళ సీఎం సభలో పాల్గొని వస్తుండగా ఆదివారం రాత్రి తప్పిపోయిందని ఆమె బంధువు గుడిమెట్ల రాధాకృష్ణ తెలిపారు. బస్సులో గ్రామ మహిళలతో కలిసి వెళ్లిన ఆమె తిరిగి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ అధికంగా ఉండడంతో తప్పిపోయిందని బంధువులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు గీసుకొండ పోలీస్‌స్టేష న్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment