
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ శుక్రవారం తలపెట్టిన 'ఛలో అసెంబ్లీ'కి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ పార్టీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్ని నిర్బంధాలు విధించినా 'ఛలో అసెంబ్లీ' కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు.
'ఛలో అసెంబ్లీ'కి వ్యతిరేకంగా మంత్రి హరీశ్‌రావు కుట్రపన్నారని, అందుకే 'ఛలో అసెంబ్లీ' సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా 'ఛలో అసెంబ్లీ' నిర్వహించి తీరుతామని, ఈ సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరడం తప్పా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ బయటకు వస్తే.. ఆయనకు రైతుల కష్టాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు.
'ఛలో అసెంబ్లీ' విషయంలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు జానారెడ్డి మండిపడ్డారు. 'ఛలో అసెంబ్లీ'కి వచ్చేవారిని పోలీసులు ఎక్కడ ఆపితే.. అక్కడే నిరసన తెలుపాలని ఆయన పిలుపునిచ్చారు. రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజల సమస్యలను ఆందోళనల రూపంలో చెప్పడం తమ బాధ్యత అని, అందుకే 'ఛలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చామని ఆయన అన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment