
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 1 నుంచి ప్రజా సమస్యలపై పోరుబాట నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. నవంబర్ 1 నుంచి 4 వరకు రైతు భరోసా యాత్ర, నవంబర్ 10 నుంచి 20 వరకు పత్తి కొనుగోలు కేంద్రాల సందర్శన, నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు పోరు సభల నిర్వహణ, నవంబర్ 7న నిరుద్యోగ సమస్యలపై చలో అసెంబ్లీ, 26న నిరుద్యోగులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.
హైదరాబాద్‌లో జరిగే ఈ సభకు బీజేవైయం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా మంచిర్యాలలో ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రెండు తీర్మానాలు చేశామని, పలు కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు.
అవినీతిపై పోరాడేందుకు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దళితులు, గిరిజనుల సమస్యలపై పోరాటానికి ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, ముస్లిం అనుకూల, హిందూ వ్యతిరేక విధానాలపై ఉద్యమానికి ఎమ్మెల్యే చింతల, మద్యపాన నియంత్రణ కమిటీకి రాజేశ్వరరావులు నాయకత్వం వహిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment