బాలయ్య చిన్నల్లుడికి బాబు ఝలక్‌!  | Chandra Babu gave Jalak to Balayya Little son-in-law | Sakshi
Sakshi News home page

బాలయ్య చిన్నల్లుడికి బాబు ఝలక్‌! 

Published Sun, Mar 17 2019 8:59 AM | Last Updated on Sun, Mar 17 2019 3:35 PM

Chandra Babu gave Jalak to Balayya Little son-in-law - Sakshi

నిరసన వ్యక్తం చేస్తున్న భరత్‌ అనుచరులు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బాలయ్య చిన్నల్లుడికి చంద్రబాబు ఝలక్‌ ఇచ్చాడు. బాలకృష్ణ పెద్దల్లుడు, సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు మంగళగిరి టికెట్‌ కేటాయించినా చిన్నల్లుడు శ్రీ భరత్‌ మాత్రం తన టికెట్‌ తెచ్చుకోలేకపోయాడు. ఆయన ఆశిస్తున్న విశాఖ లోక్‌సభ టికెట్‌ ఇవ్వలేమని చంద్రబాబు శనివారం తేల్చి చెప్పడంతో భరత్‌ అమరావతి నుంచి విశాఖకు తిరుగుముఖం పట్టారు. దీంతో ఆయన అభిమానులు విశాఖలో ఆందోళన చేపట్టారు. చివరి నిమిషం వరకు టికెట్‌ కోసం ప్రయత్నిస్తామని, రాని పక్షంలో ఏం చేయాలో ఆలోచిస్తామమని అంటున్నారు. విశాఖ లోక్‌సభ సీటుకు గాజువాక సిట్టింగ్‌ ఎమ్మెల్యే పల్లా శ్రీను పేరును తెరపైకి తెచ్చి భరత్‌కు మొండిచేయి చూపించారు. మామ బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులతో ఒత్తిడి చేయించినా... చివరాఖరుకు లోకేష్‌ మంత్రాంగమే ఫలించి తనను పక్కనపెట్టేశారని భరత్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భరత్‌ మాత్రం టికెట్‌పై ఇంకా ఆశలతోనే ఉన్నట్లున్నారు. ‘ఏమో, ఇంకా నాకే రావొచ్చని అనుకుంటున్నా’నని వ్యాఖ్యానించారు.        

ఐదేళ్లలో నాలుగు పార్టీలు.


పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో కొత్తపల్లి సుబ్బారాయుడు సీనియర్‌ నేత. 2009 –2014 మధ్యకాలంలో ఆయన నాలుగు పార్టీలు మారారు. 2009 వరకూ తెదేపాలో ఉన్న కొత్తపల్లి మంత్రిగాను, ఎంపీగాను, కొన్నాళ్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రజారాజ్యం ఏర్పాటుతో 2009లో ఆ పార్టీ తరఫున నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో పీఆర్పీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. టీడీపీ, కాంగ్రెస్, పీఆర్పీ పార్టీల జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఆయనదే.  

ఎంపీ, ఎమ్మెల్యేగా భార్యాభర్తలు


టి. అంజయ్య టి. మణెమ్మ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన టి.అంజయ్య, ఆయన సతీమణి మణెమ్మలు ఎమ్మెల్యే, ఎంపీలుగా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు. టి.అంజయ్య 1962, 67, 72లో ముషీరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందగా, 1978లో అదే స్థానం నుంచి జనతా పార్టీ అభ్యర్థి నాయిని నర్సింహరెడ్డి చేతిలో ఓడిపోయారు. 1984లో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలిచి కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి అయ్యారు. ఎంపీగా పనిచేస్తుండగా ఆయన చనిపోవడంతో 1987లో సికింద్రాబాద్‌ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు మణెమ్మ పోటీచేసి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయపై ఆమె విజయం సాధించారు. 2008లో జరిగిన ముషిరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాయిని నర్సింహరెడ్డిపై గెలిచారు. తన భర్తను ఓడించిన నాయినిని ఆమె ఓడించడం విశేషం.  

చిరంజీవికి  754 ఓట్లు
2009 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి స్థానంలో చిరంజీవికి 754 ఓట్లు వచ్చాయి. అదేంటి అక్కడి నుంచి ఆయన గెలుపొందితే అంత తక్కువ ఓట్లు రావడమేంటని అంటారా.. అయితే ఆయన పీఆర్పీ అధినేత చిరంజీవి కాదు. ఆ ఎన్నికల్లో చిరంజీవి పేరును పోలిన టి.చిరంజీవి అనే వ్యక్తిని కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. అతనికి 754 ఓట్లు వచ్చాయి. పీఆర్పీ కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి పి.కరుణాకర రెడ్డికి పేరున్న వ్యక్తిని పోటీలో నిలబెట్టగా ఆయనకు 197 ఓట్లు పోలయ్యాయి. ఓటర్లను తికమకపెట్టేందుకు ఇరు పార్టీలు అదే పేరున్న వ్యక్తుల్ని బరిలో దింపడంతో వారికి కూడా ఓట్లు పడ్డాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement