kottapalli subbaraydu
-
బతిమాలి టీడీపీలోకి తీసుకెళ్లారు
సాక్షి, నరసాపురం: తన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన మోసం దారుణమైనదని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని కలిసిన అనంతరం సోమవారం స్థానిక రుస్తుంబాదలోని ఆయన నివాసం వద్ద తన వర్గీయులతో సమావేశం నిర్వహించారు. తనకు టీడీపీ టికెట్ ఇవ్వనందుకు బాధ లేదన్నారు. కానీ చివరి వరకూ చెప్పకుండా, తనకు వేరే పార్టీల్లో అవకాశాలు లేకుండా చేయడమే బాధ కలిగిస్తుందన్నారు. తనను బతిమాలి టీడీపీలోకి తీసుకెళ్లారన్నారు. తన రాజకీయ జీవితంలో దాదాపుగా మొత్తం సమయాన్ని టీడీపీకి ముఖ్యంగానారా చంద్రబాబునాయుడుకు కేటాయించానని చెప్పారు. ఎన్ని పదవులు చేసినా అవినీతి మచ్చ లేకుండా జీవించానని అన్నారు. జిల్లాలో టీడీపీని నామరూపాలు లేకుండా చేయడమే తన లక్ష్యమని కొత్తపల్లి చెప్పారు. ముదునూరిని గెలిపిద్దాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే వెనక్కితీసుకోరని కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. చంద్రబాబునాయుడు మాదిరిగా మోసాలు ఆయనకు తెలియవన్నారు. పాలకొల్లు పర్యటనకు రానున్న జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు చెప్పారు. టీడీపీ ప్రాథమిక సభ్వత్వంతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. నరసాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ముదునూరి ప్రసాదరాజు విజయానికి తన కోసం కంటే రెట్టింపుగా కష్టపడాలని తన వర్గీయులకు సూచించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కొత్తపల్లి అభిమానులు హాజరయ్యారు. సోమవారం ఉదయం ముదునూరి ప్రసాదరాజు కొత్తపల్లిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రచార వ్యూహాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు పీడీ రాజు, రాష్ట్ర నేత కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ షేక్ బులిమస్తాన్ తదితరులు ఉన్నారు. -
బాలయ్య చిన్నల్లుడికి బాబు ఝలక్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బాలయ్య చిన్నల్లుడికి చంద్రబాబు ఝలక్ ఇచ్చాడు. బాలకృష్ణ పెద్దల్లుడు, సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు మంగళగిరి టికెట్ కేటాయించినా చిన్నల్లుడు శ్రీ భరత్ మాత్రం తన టికెట్ తెచ్చుకోలేకపోయాడు. ఆయన ఆశిస్తున్న విశాఖ లోక్‌సభ టికెట్ ఇవ్వలేమని చంద్రబాబు శనివారం తేల్చి చెప్పడంతో భరత్ అమరావతి నుంచి విశాఖకు తిరుగుముఖం పట్టారు. దీంతో ఆయన అభిమానులు విశాఖలో ఆందోళన చేపట్టారు. చివరి నిమిషం వరకు టికెట్ కోసం ప్రయత్నిస్తామని, రాని పక్షంలో ఏం చేయాలో ఆలోచిస్తామమని అంటున్నారు. విశాఖ లోక్‌సభ సీటుకు గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీను పేరును తెరపైకి తెచ్చి భరత్‌కు మొండిచేయి చూపించారు. మామ బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులతో ఒత్తిడి చేయించినా... చివరాఖరుకు లోకేష్ మంత్రాంగమే ఫలించి తనను పక్కనపెట్టేశారని భరత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భరత్ మాత్రం టికెట్‌పై ఇంకా ఆశలతోనే ఉన్నట్లున్నారు. ‘ఏమో, ఇంకా నాకే రావొచ్చని అనుకుంటున్నా’నని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో నాలుగు పార్టీలు.. పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో కొత్తపల్లి సుబ్బారాయుడు సీనియర్ నేత. 2009 –2014 మధ్యకాలంలో ఆయన నాలుగు పార్టీలు మారారు. 2009 వరకూ తెదేపాలో ఉన్న కొత్తపల్లి మంత్రిగాను, ఎంపీగాను, కొన్నాళ్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రజారాజ్యం ఏర్పాటుతో 2009లో ఆ పార్టీ తరఫున నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో పీఆర్పీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో వైఎస్సార్సీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. టీడీపీ, కాంగ్రెస్, పీఆర్పీ పార్టీల జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఆయనదే. ఎంపీ, ఎమ్మెల్యేగా భార్యాభర్తలు టి. అంజయ్య టి. మణెమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన టి.అంజయ్య, ఆయన సతీమణి మణెమ్మలు ఎమ్మెల్యే, ఎంపీలుగా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు. టి.అంజయ్య 1962, 67, 72లో ముషీరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందగా, 1978లో అదే స్థానం నుంచి జనతా పార్టీ అభ్యర్థి నాయిని నర్సింహరెడ్డి చేతిలో ఓడిపోయారు. 1984లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచి కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి అయ్యారు. ఎంపీగా పనిచేస్తుండగా ఆయన చనిపోవడంతో 1987లో సికింద్రాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు మణెమ్మ పోటీచేసి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయపై ఆమె విజయం సాధించారు. 2008లో జరిగిన ముషిరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నాయిని నర్సింహరెడ్డిపై గెలిచారు. తన భర్తను ఓడించిన నాయినిని ఆమె ఓడించడం విశేషం. చిరంజీవికి 754 ఓట్లు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి స్థానంలో చిరంజీవికి 754 ఓట్లు వచ్చాయి. అదేంటి అక్కడి నుంచి ఆయన గెలుపొందితే అంత తక్కువ ఓట్లు రావడమేంటని అంటారా.. అయితే ఆయన పీఆర్పీ అధినేత చిరంజీవి కాదు. ఆ ఎన్నికల్లో చిరంజీవి పేరును పోలిన టి.చిరంజీవి అనే వ్యక్తిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. అతనికి 754 ఓట్లు వచ్చాయి. పీఆర్పీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి పి.కరుణాకర రెడ్డికి పేరున్న వ్యక్తిని పోటీలో నిలబెట్టగా ఆయనకు 197 ఓట్లు పోలయ్యాయి. ఓటర్లను తికమకపెట్టేందుకు ఇరు పార్టీలు అదే పేరున్న వ్యక్తుల్ని బరిలో దింపడంతో వారికి కూడా ఓట్లు పడ్డాయి. -
గెలుపు వీరులు...రికార్డుల రారాజులు
సాక్షి, ఏలూరు : పార్టీలతో సంబంధం లేకుండా జిల్లా రాజకీయాలను శాసించిన వీరులు ఎందరో ఉన్నారు. వ్యక్తిగత ప్రతిష్టతో అత్యధికసార్లు నెగ్గి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పి భళా అనిపించుకున్నారు. వీరిలో ఆరుసార్లు గెలుపుబావుటా ఎగురేశారు సీహెచ్‌వీపీ మూర్తిరాజు. కనుమూరి బాపిరాజు, కోటగిరి విద్యాధరరావు, కలిదిండి రామచంద్రరాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు ఐదుసార్లు ఓటర్ల మనసు గెలిచారు. అల్లు వెంకట సత్యనారాయణ, పెన్మెత్స వెంకటనరసింహరాజు, గారపాటి సాంబశివరావు, పెండ్యాల వెంకట కృష్ణారావు, చేగొండి హరిరామజోగయ్య నాలుగుసార్లు ప్రజామోదం పొందారు. దండు శివరామరాజు, ముళ్లపూడి వెంకట కృష్ణారావు, వంకా సత్యనారాయణ, కారుపాటి వివేకానంద, కలిదిండి విజయ నరసింహరాజు, పరకాల శేషావతారం, ఎం.రామ్మోహనరావు, టి.వీరరాఘవులు, పితాని సత్యనారాయణ, తెల్లంబాలరాజు మూడుసార్లు విజయకేతనం ఎగురవేశారు. -
'మత్స్యకారుల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళిక'
నర్సాపురం: తీర ప్రాంతంలోని మత్స్యకారుల అభ్యున్నతికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తారని నర్సాపురం లోక్‌సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంకా రవీంద్రనాథ్, అసెంబ్లీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. నర్సాపురంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వైఎస్ఆర్ సీపీ ద్వారానే సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని ఓటర్లను వారు అభ్యర్థించారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, పేదల కష్టాలు తీరాలన్నా జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల వారు భావిస్తున్నారన్నారు.