మదనపల్లి/చంద్రగిరి/పుత్తూరు/ముత్తుకూరు: ‘నేను ఓడిపోతే నాకు కుటుంబం ఉంది. భార్య, కుమారుడు, మనవడు ఉన్నారు.’.. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు. దీంతో తన ఓటమిని ఆయన ముందే అంగీకరించినట్లు స్పష్టమయ్యింది. మంగళవారం చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, చంద్రగిరి, పుత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా బాబుకు ఎన్నికల భయం పట్టుకుని నోటికొచ్చినట్లు పొంతన లేకుండా మాట్లాడుతుండడంతో ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
నరేంద్రమోదీకి సిగ్గు లేదు
‘నరేంద్రమోదీ నమ్మక ద్రోహి. కరుడుగట్టిన తీవ్రవాది, సిగ్గు, లజ్జ, స్థానం లేని వ్యక్తి. ఈయన కన్నా గ్రామస్థాయిలో ఉండే కార్యకర్త బెటర్. భార్య, తల్లికి అన్నం పెట్టలేని వ్యక్తి దేశాన్ని ఉద్ధరిస్తాడంట. ఆయనదంతా తుగ్లక్ పాలన. పెద్ద నోట్ల రద్దు తుగ్లక్ నిర్ణయం. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ప్రధాని నరేంద్రమోదీ అడ్డుపడుతున్నారు. 70 శాతం పనులు నేనే పూర్తి చేశా.’ అంటూ చంద్రబాబు మోదీపై విరుచుకుపడ్డారు. అలాగే ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసు వెళ్లగక్కారు. చంద్రగిరి సభలో విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత, సినీనటుడు మంచు మోహన్‌బాబుపై మండిపడ్డారు. ‘ఖబడ్తార్ హైదరాబాద్ నుంచి ఉచ్చ పోసుకుంటూ ఇక్కడికి వచ్చావు. మాతో పెట్టుకుంటే ఏ నాయకుడినైనా ఫినిష్ చేస్తా అంటూ’ హెచ్చరించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాపై ఆధారరహిత విమర్శలు చేశారు. పనిలో పనిగా పోలీసులపైనా మాట పారేసుకున్నారు. మీ వైఫల్యం వల్లే వైఎస్సార్‌సీపీ ఇంకా ఉందని గదమాయించారు.
140 నదుల అనుసంధానం
పుత్తూరు సభలో తనను తాను కాటర్ దొర, అపర భగీరధుడితో చంద్రబాబు పోల్చుకున్నారు. త్వరలోనే గోదావరి జలాలు నగరి నియోజకవర్గానికి వస్తాయని హామీ ఇచ్చేశారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా తదితర చిన్నాపెద్దా మొత్తం 140 నదులను అనుసంధానం చేస్తానని మరో హామీ ఇచ్చేశారు. తనకు మరోసారి అధికారం కట్టబెడితే హంద్రీనీవా, గాలేరు–నగరి పూర్తి చేస్తానని బాబు చెప్పుకొచ్చారు.
డబ్బుల పండగ
రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు తనను సొంత అన్నగా ముఖ్యమంత్రి ప్రకటించేసుకున్నారు. ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు రూ. రెండు వేల పింఛన్, ఐదో తేదీన పసుపు–కుంకుమ చెక్కులు ఇస్తామన్నారు. 4, 5వ విడత రైతు రుణమాఫీ, అన్నదాతా సుఖీభవ పథకం నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా చంద్రబాబు రానున్న సందర్భంగా సమీకరించిన జనాలు సభావేదిక వద్ద కన్నా.. చంద్రగిరిలోని మద్యం దుకాణాల వద్దే అధికంగా కనిపించారు. ఎక్కడ చూసినా పసుపు కండువాలు, టోపీలతో మద్యం దుకాణాలు కళకళలాడాయి.
ఇందిర, రాజీవ్‌తో పోరాడా
‘ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీతో పోరాడిన నేను మోదీతో పోరాటం చేయడం ఒక లెక్క కాదు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో ఆయన ప్రసంగించారు. త్వరలో కోటి మంది మహిళలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తామన్నారు. కృష్ణపట్నంపోర్టు తన వల్లే వచ్చిందని చెప్పారు. వైఎస్ జగన్‌కి ఓట్లు వేస్తే మోదీకి వేసినట్టేనన్నారు. ఓట్లు వేసిన వారు జైలుకు పోతారని బెదిరించారు.సైకిల్ గుర్తుకు ఓటు వేస్తారా తమ్ముళ్లూ అంటూ బాబు ఇచ్చిన పిలుపునకు సభలో పెద్దగా స్పందన రాలేదు. ఆయన ప్రసంగం పూర్తయ్యేలోపు సగం మంది జనం వెళ్లిపోయారు.
నేను ఓడిపోతే నాకు కుటుంబం ఉంది!
Published Wed, Apr 3 2019 4:31 AM | Last Updated on Wed, Apr 3 2019 11:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment