సాక్షి, అమరావతి : అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మిస్తానని నమ్మించారు.. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో ముందే నిర్ణయించుకున్నారు.. కాని అదిగో అక్కడ రాజధాని.. ఇదిగో ఇక్కడ రాజధాని అంటూ ప్రజలను ఏమార్చారు.. తన బినామీలు, అస్మదీయులు, తన పార్టీ నాయకులకుమాత్రం వాస్తవ ప్రాంతం లీక్ చేశారు.. అంతే.. అప్పటివరకు ఆకలితో ఆవురావురంటున్న క్రూర గద్దకు కోడిపిల్ల కంటబడినట్లు.. పచ్చ దండు కళ్లు... అమాయక రైతుల పచ్చటి పొలాలపై పడ్డాయి.
దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు... తన బినామీలు, తన సామాజిక వర్గం, తన కోటరీ కలిసి.. అత్తెసరు ధరలకే వేలకు వేల ఎకరాల భూములు కొనేశారు.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని... జేబులోంచి పైసా తీయకుండానే... ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి.. అధికారిక రహస్యాల ప్రమాణాన్ని(ఓత్ ఆఫ్ సీక్రసీ) ఉల్లంఘించి... పేద రైతులకు చెందిన లక్షల కోట్లరూపాయల భూములను చెరబట్టారు.
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇంతకుమించిన బరితెగింపు,నయవంచనకు నిదర్శనం మరొకటి లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు! ఇంటర్నేషనల్ రాజధానిని నిర్మిస్తానని నమ్మబలికి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రూ.లక్ష కోట్లకుపైగా చంద్రబాబు అండ్ కోకాజేసిన ఇంటర్నేషనల్ భూ స్కామ్ ఇదీ!!
అదెలాగంటారా...!
- ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. రాజధానిని నూజివీడు సమీపంలో ఏర్పాటుచేస్తున్నట్లుఒకసారి.. బాపులపాడు, వీరులపాడు పరిసర ప్రాంతాల్లో తేనున్నట్లు మరోసారి.. ముసునూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని నిర్మిస్తామని ఇంకోసారి.. గన్నవరం పరిసర ప్రాంతాల్లో వస్తోందంటూ.. మరోసారి లీకులు ఇచ్చారు.
- అలా లీకులు ఇవ్వడానికి ముందే ఆయా ప్రాంతాల్లో తక్కువ ధరలకే మంత్రులు, సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, బినామీలు భారీగా భూములు కొనుగోలు చేసి పెట్టుకునేలా చేశారు.
- రాజధాని ఫలానా ప్రాంతంలో వస్తోందంటూ.. తన సొంత మీడియాలో లీకులు ఇవ్వడం ద్వారా నూజివీడు, బాపులపాడు, వీరులపాడు, ముసునూరు, గన్నవరం పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగేలా చేశారు.
- ఇక్కడ ధరలు పెరగ్గానే.. తన కోటరీ ఆయా ప్రాంతాల్లో అంతకుముందే కొనుగోలు చేసి పెట్టుకున్న భూములను అగ్రిమెంట్ దశలోనే.. ఎన్‌ఆర్‌ఐలు, చిన్నపాటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అమాయక మధ్యతరగతి ప్రజలకు అధిక ధరలకు అమ్మేసి వేలాది కోట్ల రూపాయలు దోచేశారు.
- ఇలా దోచేసిన సొమ్ముతోనే రాజధాని ప్రాంతంలో భారీఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఇదంతా చూస్తే.. మీకు ఏమనిపిస్తుంది..? రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు, మంత్రులు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడటం ద్వారా తక్కువ ధరలకే అమాయక రైతుల భూములు కాజేసి.. భారీఎత్తున లబ్ధి పొందారన్నది స్పష్టమవుతోంది కదా...?
పచ్చని పొలాలను తన్నుకుపోయిన పచ్చ గద్దలు
సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని ఇంద్రుని రాజధాని అమరాతిని తలదన్నే రీతిలో ఆంధ్రులకు అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నగరాన్ని నిర్మిస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా రూ.లక్ష కోట్లకు పైగా దోచేసి ఇంటర్నేషనల్ స్కాంకు పాల్పడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కన్నా..సీఈవో(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా చెప్పుకోవడానికే ఇష్టపడే చంద్రబాబు.. రాజధాని పేరుతో అడ్డగోలుగా భూదోపిడీకి తెగబడ్డారు.
- ఉమ్మడి రాష్ట్రాన్ని విభజిస్తూ మార్చి1, 2014న ఏపీ పునర్విభజన చట్టంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అపాయింటెడ్ డేను జూన్ 2గా నిర్ణయించారు. మే 16, 2014న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం సాధించగానే... సింగపూర్‌ను తలదన్నేలా రాజధాని నిర్మిస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు.
- రాజధానిని గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయా గ్రామాల్లో భూసమీకరణ చేయాలని.. ఆ గ్రామాల సరిహద్దుల్లో భూములు కొనుగోలు చేస్తే భారీగా లబ్ధి పొందవచ్చునని ముందే స్కెచ్ వేసుకున్నారు. ఆ విషయాన్ని తన కోటరీ, తన సామాజిక వర్గం,తన బినామీలు, తన అస్మదీయులు, తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సంకేతాలు ఇచ్చారు. ప్రజలకు మాత్రం వేరే చోట రాజధాని వస్తోందంటూ మీడియా ద్వారా లీకులు ఇచ్చారు.
- ఆ తర్వాత జూన్ 8, 2014న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే.. రాజధాని భూ‘మాయ’పైనే దృష్టిసారించారు. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా.. ‘రాజధాని’ ఏర్పాటుపై ముందే నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. అందుకు సంబంధించి వ్యూహం ప్రకారం పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ గందరగోళానికి తెరతీశారు.
- ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే అంటే జూన్ 9, 2014న కృష్ణా జిల్లా నూజివీడు పరిసర ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తామని తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించారు.
- జూన్ 12, 2014న విశాఖపట్నంలో తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. రాజధాని ప్రాంతంపై నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఆ విషయం ప్రజలకు వెల్లడించకుండా.. కేవలం చినబాబు, తన కోటరీలోని ప్రధానమైన నేతలకు మాత్రమే లీకులు ఇచ్చారు. ఆ తర్వాత రహస్య అజెండాలో భాగంగా కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, బాపులపాడు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు కొందరు మంత్రులు ప్రకటించారు.
- మరికొద్ది రోజులు గడిచాక జూలై 5, 2014న కృష్ణా జిల్లా ముసునూరు పరిసర ప్రాంతాల్లో.. రాజధాని వచ్చే అవకాశముందంటూ.. ఇంకొందరు మంత్రులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు.
- సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే ఆగస్టు 5, 2014న కృష్ణా జిల్లా గన్నవరం పరిసర ప్రాంతాలు రాజధాని ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతమంటూ మరికొందరు మంత్రులు చెప్పుకొచ్చారు.
- చంద్రబాబు అండ్ కో రహస్య అజెండా తెలిసిన కృష్ణా జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రి ఈ ప్రాంతాల్లో భారీఎత్తున భూములు కొనుగోలు చేసి.. పది రోజుల్లోనే ఎన్నారైలకు అమ్మేసి రూ.400 కోట్లకుపైగా లబ్ధి పొందారని టీడీపీ ఎంపీ ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. కొందరు మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇదే రీతిలో బేరం... మారుబేరాలు చేసి కనిష్టంగా రూ.15వేల కోట్లు కొల్లగొట్టారని రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల అంచనా.
- ఇలా దోచేసిన డబ్బులతోనే మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు ప్రాంతాల్లో చంద్రబాబు అండ్ కో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసింది. కానీ.. చంద్రబాబు అండ్ కో అజెండా తెలియని స్థిరాస్తి వ్యాపారులు, ఎన్నారైలు, చిన్న చిన్న వ్యాపారులు నూజివీడు, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ముసునూరు పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి భారీగా నష్టపోయారు.
- సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు ఆగస్టు 9, 2014న వేర్వేరు సమావేశాల్లో మాట్లాడుతూ... గుంటూరు–విజయవాడల మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో.. నూజివీడు, గన్నవరం, ముసునూరు ప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆ ప్రాంతాల్లో భూములు కొన్న ఎన్నారైలు, చిన్నచిన్న వ్యాపారులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. దిక్కుతోచని దుస్థితిలో వందలాది మంది రియల్ వ్యాపారులు నష్టపోయారు. అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
భూ సమీకరణ పెద్ద బూటకం.. మహా నాటకం
మట్టిని నమ్ముకుని బ్రతికే రైతులు ముక్కారు పంటలు పండే భూములను రాజధాని భూ సమీకరణకు ఇచ్చేందుకు ససేమిరా అంగీకరించరని గుర్తించిన సీఎం చంద్రబాబు.. రైతులను ఏమార్చేందుకు ముందుగానే పక్కా పథకం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా ముందుగానే మంత్రులు, తన సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ద్వారా.. ఆయా గ్రామాల్లో పలు చోట్ల భూములు కొనుగోలు చేయించి.. ఆ భూములను సమీకరణ కింద ప్రభుత్వానికి అప్పగించేలా చక్రం తిప్పారు.
ఇలా 29 గ్రామాల్లో కొనుగోలు చేసిన భూములను సమీకరణ కింద తొలుత సర్కార్‌కు అప్పగించేలా చక్రం తిప్పారు. తద్వారా మిగతా రైతులను ప్రభావితం చేసి సమీకరణ కింద భూములు ఇచ్చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల్లో రాజధాని నిర్మాణానికి 53,743.49 ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వ భూములు 15,010.03 ఎకరాలు కాగా..38,737.46 ఎకరాలు ప్రయివేటు భూమి. భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతులపై అక్రమ కేసులు బనాయించి.. పొలాలను దగ్ధం చేయించి.. పోలీసులను ఉసిగొల్పి భయోత్పాతం సృష్టించారు.
సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించి 24 వేల మంది రైతులకు చెందిన 32,400 ఎకరాలను భూసమీకరణ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో 29,450 ఎకరాలకు చెందిన 21,300 మంది రైతులు మాత్రమే అగ్రిమెంట్లు చేసుకుని కౌలు చెక్‌లు తీసుకున్నారు. తక్కిన రైతులు కౌలు చెక్‌లు తీసుకోవడానికి ససేమిరా అనడాన్ని బట్టి చూస్తే భూసమీకరణపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సమీకరించిన భూమి పప్పులూబెల్లాల్లా..
రాజధాని కోసం రైతుల ముక్కుపిండి సమీకరణ పేరుతో లాక్కున్న భూములను అత్తెసరు ధరలకే అస్మదీయులకు కట్టబెట్టిన సీఎం చంద్రబాబు.. భారీఎత్తున ప్రయోజనం పొందారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రాజధాని గ్రామాల్లో సీఆర్‌డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ఎకరానికి రూ.నాలుగు కోట్లను ప్రాథమిక ధరగా నిర్ణయించింది.
కానీ.. ప్రైవేటు సంస్థలకు తక్కువ ధరలకే భూములు కేటాయించి, భారీఎత్తున కమీషన్‌లు వసూలు చేసుకున్నారు. ఇప్పటివరకూ 1592.77ఎకరాల భూమిని ఇలా అస్మదీయులకు కట్టబెట్టేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ బ్యాంకులకు ఎకరం రూ.నాలుగు కోట్ల చొప్పున కేటాయిస్తే.. అస్మదీయులకు మాత్రం ఎకరం కనిష్టంగా రూ.40 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల చొప్పున అమ్మేశారు.
తన సన్నిహితుల భాగస్వామ్యం ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటికీ ఎకరం రూ.50 లక్షల చొప్పున 200 ఎకరాలు.. అమృత యూనివర్శిటికీ ఎకరం రూ.50 లక్షల చొప్పున 200 ఎకరాలు.. వీఐటీ యూనివర్శిటికీ ఎకరం రూ.50లక్షల చొప్పున 200 ఎకరాలు.. గ్జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిబ్యూట్‌కైతే ఎకరం రూ.పది లక్షల చొప్పున 50 ఎకరాలను అమ్మేశారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుపాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు పేరుతో బినామీకి చెందిన సాక్‌ట్రానిక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు రాజధానిలో ఎకరం రూ.50 లక్షల చొప్పున 40 ఎకరాల భూమిని కట్టబెట్టేశారు.
చంద్రబాబు అండ్ కో భూ సేకరణ..
సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకుని నేలపాడు నుంచి రహస్య అజెండా అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు నేలపాడులో భూ సమీకరణ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రియల్ వ్యాపారి, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీఆర్ ఆంజనేయులు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులకు అప్పగించారు. వారు తమ అనుచరులతో నేలపాడులో మకాం వేసి.. తమ కుటుంబ సభ్యుల పేర్లతో భూములు కొనుగోలు చేయడంతోపాటు సన్నిహితులనూ పురమాయించారు.
నేలపాడు నుంచి రహస్య అజెండా
- నిమ్మకాయల చినరాజప్ప తన కుమారుడు నిమ్మకాయల రంగనాధ్ పేరుతో సర్వే నెంబరు 59లో ఎకరం, తన అనుచరుడు జగతా వెంకట గంగాధర్ పేరుతో ఒక ఎకరం.. ఎకరం రూ.మూడు లక్షల చొప్పున జూన్ 10, 2014న కొనుగోలు చేశారు. ఆ భూమిని అక్టోబరు 31న రిజిష్టర్ చేసుకున్నారు.
మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు సన్నిహితుడైన గొరిజాల పెద్దయ్య సర్వే నెంబరు 46లో 5.16 ఎకరాలు, నన్నపనేని శ్రీనివాసప్రసాద్ 1.5ఎకరాలు కొనుగోలు చేశారు. మంత్రులు చినరాజప్ప, పుల్లారావు, ఎమ్మెల్యేలు జీవీఆర్ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర సన్నిహితులు, బంధువులు, రియల్టర్లు సుమారు 221 ఎకరాలకు పైగా భూమిని రాజధాని ప్రకటనకు ముందే కొనుగోలు చేశారు.
అయితే ఈ విషయం ప్రజలకు తెలియకుండా దాచిపెట్టి... భూమి సొంతదారులతోనే భూసమీకరణ కింద ప్రభుత్వానికి అప్పగించేలా చక్రం తిప్పారు. నిజంగా రైతులే భూములు సమీకరణకు ఇస్తున్నారని భావించిన మిగతా రైతులు కూడా తమ భూములను భూసమీకరణ కింద ప్రభుత్వానికి ఇచ్చేశారు. అలా భూసమీకరణ కింద ప్రభుత్వానికి భూములు అప్పగించిన తొలి గ్రామంగా నేలపాడు రికార్డుల్లోకి ఎక్కింది. ఇది మిగతా రాజధాని గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపింది.
తుళ్లూరులో చినబాబు
- ప్రధాన రాజధాని(కోర్ కేపిటల్)కి కూతవేటు దూరంలో ఉండే తుళ్లూరులో భూముల కొనుగోళ్లలో నారా లోకేష్ తన బినామీ వేమూరు రవికుమార్ ప్రసాద్‌ను బరిలోకి దించారు. సెవెన్ హిల్స్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున సర్వే నెంబరు 261లో ఎకరం, 263లో 1.98 మొత్తం 2.98 ఎకరాలను కొనుగోలు చేశారు.
- రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సర్వే నెంబరు 256–ఏలో 1.41 ఎకరాలు, ఆయన భార్య గోరంట్ల ఝాన్సీ లక్ష్మి పేరుతో సర్వే నెంబరు 256–బీ1ఏలో 0.54, 256–ఏలో 1.00 మొత్తం 1.54 ఎకరాలను కొన్నారు.
మందడంలో నారాయణ తంత్రం
రాజధాని గ్రామాల్లో ప్రధానమైన మందడంలో భూముల కొనుగోళ్ల బాధ్యతలను చినబాబుతోపాటూ మంత్రి నారాయణకు చంద్రబాబు అప్పగించారు. నాలెడ్జ్ హబ్‌గా మందడంను చేస్తారన్న సమాచారంతో నారాయణ ముందుచూపుతో వ్యవహరించారు.
- మంత్రి నారాయణ తన సంస్థల్లో ఉద్యోగులు, బంధువుల పేర్లతో మందడంలో 40 ఎకరాలపైగా కొనుగోలు చేశారు. ఆవుల మునిశంకర్, రాపూరు సాంబశివరావు, పొత్తూరు ప్రమీల తదితరుల పేర్లతో భూములు కొనుగోలు చేశారు.
- వినుకొండ ఎమ్మెల్యే జీవీఆర్ ఆంజనేయులు కుమార్తె గోనుగుంట్ల లక్ష్మీ సౌజన్య పేరుతో సర్వే నెంబరు 106–1లో 1.37, 10602లో 0.85 మొత్తం 2.22 ఎకరాలు, ఆయన సమీప బంధువు గోనుగుంట్ల వెంకట రామాంజనేయులు సర్వే నెంబరు 440–బీలో ఎకరా, 440–ఈలో ఎకరా మొత్తం రెండెకరాలను కొనుగోలు చేశారు. మందడంలో చంద్రబాబు అండ్ కో 129 ఎకరాలపైగా భూమిని కొనుగోలు చేసి.. సంబంధిత రైతులతోనే ల్యాండ్ పూలింగ్ కింద ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించేలా చక్రం తిప్పింది.
కొండమరాజుపాలెంలోనూ అదే వ్యూహం
ధరలు తక్కువగా ఉన్న కొండమరాజుపాలెంలో భూములు కొనుగోలు చేసే బాధ్యతను ఎమ్మెల్యేలు జీవీఆర్ ఆంజనేయులు, ధూలిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు
శివరామకృష్ణ తీసుకున్నారు.
- వినుకొండ ఎమ్మెల్యే జీవీఆర్ ఆంజనేయులు కుమార్తె గోనుగుంట్ల లక్ష్మీ సౌజన్య పేరుతో సర్వే నెంబరు 29–బీ1లో ఎకరం, 51–బీలో 1.04 ఎకరాలు మొత్తం 2.04 ఎకరాలు కొన్నారు.
- ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తన సోదరుడి కుమార్తె పయ్యావుల హారిక పేరుతో 51–బీలో 1.18 ఎకరాలు, ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర తన కుమార్తె వీరవైష్ణవి పేరుతో సర్వే నెంబరు 58–ఏలో 1.21ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తమ్మీద కొండమరాజుపాలెంలో చంద్రబాబు అండ్ కో సుమారు 174 ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేసి... ఆ రైతులతోనే ల్యాండ్ పూలింగ్ కింద వాటిని ప్రభుత్వానికి అప్పగించారు.
వెలగపూడిలోనూ పాగా
ప్రస్తుతం తాత్కాలిక సచివాలయం నిర్మిస్తోన్న వెలగపూడిలోనూ చంద్రబాబూ అండ్ కో భూదందా కొనసాగించింది. నారా లోకేష్ బినామీ వేమూరు రవికుమార్ ప్రసాద్ సర్వే నెంబరు 226–జీలో 1.64 ఎకరాలను కొనుగోలు చేశారు.
వినుకొండ ఎమ్మెల్యే జీవీఆర్ ఆంజనేయులు కుమార్తె గోనుగుంట్ల లక్ష్మీ సౌజన్య పేరుతో సర్వే నెంబరు 103–1లో 1.32, 3–2బీలో 1.51, 214–బిలో 1.33, 51–బి1లో 0.55 మొత్తం 4.71 ఎకరాలు కొనుగోలు చేశారు.మంత్రి నారాయణతో సాన్నిహిత్యం ఉన్న గాయత్రీ రియల్టర్స్ తరఫున తల్లం మణికంఠ అనంతసాయి సర్వే నెంబరు 267–2ఏలో 2.20 ఎకరాలను కొన్నారు.
అనంతవరంలోనూ బినామీల దూకుడు..
- మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బినామీ గుమ్మడి సురేష్ అనంతవరంలో సర్వే నెంబరు 238–బీ1లో 1.08 ఎకరాల భూమిని ఎకరం రూ.రెండు లక్షల చొప్పున రాజధాని ప్రకటనకు ముందే కొనుగోలు చేసి.. నవంబర్ 19, 2014న రిజిష్టర్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆ భూమిని ముదునూరి వెంకట శివ రామ సోమ వరప్రసాద రాజుకు ఎకరం రూ.కోటికిపైగా విక్రయించి.. డిసెంబర్ 7, 2015న రిజిష్టర్ చేయించారు.
- జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమీప బంధువు దేవినేని శోభారాణి అనంతవరంలో సర్వే నెంబరు 183–6లో 1.30 ఎకరాల భూమిని కొనుగోలు చేసి డిసెంబర్ 28, 2015న రిజిష్టర్ చేయించుకున్నారు.
లింగాయపాలెంలో పచ్చ గద్దల వీరంగం
- ప్రధాన రాజధాని కేంద్రమై(కోర్ కేపిటల్)న లింగాయపాలెంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీఆర్ ఆంజనేయులు తన తండ్రి గోనుగుంట్ల సత్యనారాయణ పేరుతో సర్వే నెంబరు 149లో 1.25 ఎకరాలను జూన్ 29, 2014న కొనుగోలు చేసి.. నవంబర్ 27, 2014న రిజిష్టర్ చేయించుకున్నారు.
- నారా లోకేష్ బినామీ వేమూరు రవికుమార్ ప్రసాద్ సమీప బంధువు వేమూరు గోవర్ధన నాయుడు తన కుమార్తెలు నవరత్న, స్వప్నల పేర్లతో లింగాయపాలెంలో సర్వే నెంబర్లు 33/1బీ, 33/2బీ, 34/2, 34/1బీలో 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి.. డిసెంబర్, 2015న రిజిష్టర్ చేయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment