వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
సాక్షి, విజయవాడ : ‘చంద్రబాబు అనే వ్యక్తి ఒక సామాజిక నేరగాడు.. ఒక వెన్నుపోటు దారుడని ఏపీ ప్రజలు గుర్తించారని’ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయి.. నేటికీ ‘మనవాళ్లు బ్రీఫ్డ్‌మీ’ వాయిస్ తనది కాదని చెప్పలేకపోయిన వ్యక్తి చంద్రబాబు అని ఆర్కే ధ్వజమెత్తారు. విజయవాడలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆర్కే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి విషయంలోనూ ఏదో రకంగా దోచుకుని చంద్రబాబు ఈ నాలుగేళ్లలో సుమారు రూ. 5 లక్షల కోట్లు సంపాదించారని ఆర్కే ఆరోపించారు.
నాలుగేళ్లుగా ఏపీని దోచేశారు..
వైఎస్‌ఆర్‌సీపీ నేతలను ఆర్థిక నేరగాళ్లు అని చంద్రబాబు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు చుట్టూ ఉండే వారే అసలైన ఆర్థిక నేరగాళ్లన్నారు. సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావు, రాయపాటి బ్యాంక్‌లకు డబ్బులు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాళ్లు కాదా అని ఆర్కే ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మొత్తం దోచేసిన చంద్రబాబు అతిపెద్ద ఆర్థిక నేరగాడంటూ ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం, మట్టి, ఇసుక ఇలా ప్రతి విషయంలో దోచుకుని చంద్రబాబు సుమారు రూ. 5 లక్షల కోట్లు సంపాదించారని ఆర్కే ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పరవాలేదని, తాను, తన కుమారుడు నారా లోకేష్ బాగుంటే చాలని భావించే వ్యక్తి చంద్రబాబు అని ఆర్కే ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్తే తన భవిష్యత్తుగా వైఎస్ జగన్..
ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు దీక్షలు, ధర్నాలు చేసిన ఏకైక వ్యక్తి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజలకు సంజీవని అని పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా ఉన్నారని చెప్పారు. నవ్యాంధ్రకు 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన వారు మాట నిలబెట్టుకోవాలని వైఎస్ జగన్
పోరాటం చేస్తున్నారన్నారు. ‘మేము అవిశ్వాసం పెడితే.. మీరు మద్దతు ఇవ్వండి.. ఒకవేళ మీరు నోటీసులిస్తే మేము మద్దతు ఇస్తామని’ వైఎస్ జగన్ మాటల్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కానీ టీడీపీ ఆ మాట మర్చిపోయిందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తే తన భవిష్యత్తు అని నమ్మిన వైఎస్ జగన్.. సీఎం చంద్రబాబు దొంగ అని తెలిసినా అసెంబ్లీలో టీడీపీ పెట్టిన తీర్మానానికి రెండు సార్లు సభ్యులందరితో సంతకాలు చేయించి మద్దతు ఇచ్చారని చెప్పారు. తీర్మానాలు చేయించిన కాగితాలు కేంద్రానికి పంపించి ఉంటే ఏపీ ప్రజల బాధ వారికి తెలిసేదని, ఆ కాగితాలు ఉన్నాయా? లేక స్పీకర్‌తో చింపించి పడేశావా? అని సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నించారు.
అక్రమ కేసులని కోర్టులు తేల్చుతున్నాయి..
వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై పెట్టినవన్నీ అక్రమ కేసులని న్యాయస్థానాలు, ట్రిబ్యునల్స్ ఒక్కొక్కటిగా కొట్టేస్తున్నాయని ఆర్కే తెలిపారు. ఆర్థిక నేరగాళ్లు చంద్రబాబు చుట్టూ ఉన్నారు. బాబు పక్కనే ఉండే సుజనా చౌదరి మారిషస్ దేశ బ్యాంక్ నుంచి వేల కోట్లు అప్పు తీసుకొని ఎగనామం పెట్టాడన్నారు. అదే విధంగా రాయపాటి సాంబశివరావు, గంటా శ్రీనివాసరావులు ప్రజలు బ్యాంక్‌లలో దాచుకున్న సొత్తును అప్పుగా తీసుకొని
తిరిగి చెల్లించలేదన్నారు. ఇలాంటి వారందరినీ పక్కన పెట్టుకున్న చంద్రబాబే అతిపెద్ద ఆర్థిక నేరగాడని ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment