ఉండవల్లి సీఎం నివాసంలో స్మార్ట్ విలేజెస్‌పై ప్రసంగిస్తున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమే కాంగ్రెస్‌తో కలసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. దేశానికే తెలుగుదేశం దిక్సూచిగా మారిందని, జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక వహిస్తోందని అన్నారు. దేశానికి కష్టం వచ్చిందని, దాన్ని తన బాధ్యతగా తీసుకుని అన్ని రాష్ట్రాలకు వెళ్తున్నానని, అన్ని పార్టీల నేతలను కలుస్తున్నానని చెప్పారు. తన విశ్వసనీయత వల్లే అందరూ ఆదరిస్తున్నారని, కలసి నడిచేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జిలు, పార్టీ బాధ్యులతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కాలరాస్తోందని, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధిస్తోందనే విషయాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలని సూచించారు. ప్రస్తుతం రోజుకు 74 వేల సభ్యత్వ నమోదు జరుగుతోందని, ఇకపై దీన్ని రెట్టింపు చేయాలని కోరారు.
కోటి సభ్యత్వాల లక్ష్యానికి చేరుకోవాలన్నారు. ప్రభుత్వంపై 78 శాతం సంతృప్తి ఉందంటూ.. పార్టీ పట్ల 100 శాతం సంతృప్తి ప్రజల్లో రావాలన్నారు. సమర్థులైన అభ్యర్థుల ఎంపికతోనే ఎన్నిక సులభం అవుతుందని, సరైన కసరత్తు లేకుండా అభ్యర్థుల ఎంపిక చేయకూడదని ఆయన అన్నారు. కసరత్తు లేకుండా ఎంపిక చేస్తే టీఆర్‌ఎస్ మాదిరిగానే అవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొద్దినెలల్లోనే సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయన్నారు. ఈ ఐదేళ్లలో పార్టీ నేతలకు పెద్దఎత్తున పదవులిచ్చామని, రాబోయే రోజుల్లోనూ నాయకుల కష్టానికి తగిన గుర్తింపును పార్టీ ఇస్తుందని చెప్పారు. ఎన్నికల నాటికల్లా పార్టీ యంత్రాంగం బలోపేతం కావాలని సూచించారు. అన్ని రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని, జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక అవార్డులు సాధించామని ఆయన చెప్పారు. కేంద్రం పోలవరానికి ఇంకా రూ.3,200 కోట్లు ఇవ్వాలని తెలిపారు.
పారిశ్రామికవేత్తలూ.. స్మార్ట్ విలేజ్‌కు సీఎస్‌ఆర్ నిధులివ్వండి
కంపెనీల సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్)లో భాగంగా ‘స్మార్ట్ విలేజ్–స్మార్ట్ వార్డు’ను ఎంచుకోవాలని పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపునిచ్చారు. బుధవారం అమరావతి ప్రజావేదికలో చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిల్‌గేట్స్, వార్న్ బఫెట్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని పారిశ్రామికవేత్తలు సామాజిక కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొనాలన్నారు. ఇప్పటివరకు స్మార్ట్ విలేజ్ కార్యక్రమం కింద 2,455 ఒప్పందాలు చేసుకోవడం ద్వారా రూ.730 కోట్ల సీఎస్‌ఆర్ నిధులను వ్యయం చేసినట్లు తెలిపారు. కాగా, ఇండోనేసియా వ్యవసాయ, ప్రణాళిక శాఖ మంత్రి సోఫియాం ఎ జలిల్ సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో బుధవారం కలిశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం’పై చర్చించారు.
రాజధానిలో ఆక్సిజన్ స్థాయి పెంచుతాం: సీఎం
అమరావతిలో ఆక్సిజన్ స్థాయి పెంచడంతోపాటు కర్బన ఉద్ఘారాలను పూర్తిగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తులో రాజధాని రోడ్లపై వందశాతం ఎలక్ట్రికల్ వాహనాలు నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో సీఎం బుధవారం పర్యటించి.. అక్కడ గవర్నమెంట్ కాంప్లెక్స్, ట్రంకు రోడ్లు, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్లు, తాత్కాలిక హైకోర్టు.. తదితర నిర్మాణాలను పరిశీలించారు. నేలపాడు వద్ద విలేకరులతో మాట్లాడుతూ రూ.48,116 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, 320 కి.మీ. పొడవునా రహదారుల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. తాజ్‌మహల్, చార్మినార్ లాగా అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందుతాయన్నారు. గ్రీన్, ఎడ్యుకేషనల్, హెల్త్ కేర్ హబ్‌గా అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పారు.
కేసీఆర్‌కు చేతకాలేదు: బంగారుబాతు లాంటి హైదరాబాద్‌ను తెలంగాణకు అప్పగిస్తే.. నగరం నుంచి వస్తున్న ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చేతకాలేదని చంద్రబాబు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment