
సాక్షి, హైదరాబాద్: అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా ఏం చేయాలో అన్నీ చేశామని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఆర్‌డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఏకపక్షంగా ఆమోదించరనే నమ్మకం ఉందన్నారు. దీనిపై పోరాటాలను ఇంకా ఉధృతం చేయాల్సి ఉందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఏపీలోని పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో చంద్రబాబు ఆన్‌లైన్ సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలివీ..
► కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఎక్కడైనా ఎన్టీఆర్ విగ్రహాలను ముట్టుకోవాలంటే వణుకు పుట్టేలా మన చర్యలు ఉండాలి. త్వరలో చలో కావలి కార్యక్రమాన్ని నిర్వహిద్దాం.
► రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడం ఆందోళనకరం. మరణాల రేటు దేశంలోనే అత్యధికంగా ఉంది, రికవరీ రేటులో అట్టడుగున ఉన్నాం. సీఎం జగన్ ఇంతవరకు మాస్క్ పెట్టుకోలేదు. ముఖ్యమంత్రే మాస్క్ పెట్టుకోకుండా, మాస్కు ధరించని వారికి జరిమానా విధిస్తామనడం ఎంతవరకు సమంజసం?
► రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదు. చేర్చుకున్న వారికి సరైన ఆహారం లేదు, ఆక్సిజన్ సరఫరా లేదు, అంబులెన్స్‌ల నిర్వహణ అధ్వాన్నం. ఒక్కో అంబులెన్స్‌లో డజన్ల సంఖ్యలో రోగులను కుక్కుతున్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ప్రభుత్వం ఇచ్చే రూ.500 ఆహారం కంపు కొడుతోంది. డిశ్చార్జ్ అయిన రోగులకు
రూ.రెండు వేలు ఇస్తామని చెప్పి వందా యాభై చేతిలో పెడుతున్నారు.
► దళితులపై ఏడాదిగా దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇన్ని అత్యాచారాలు, అరాచకాలు జరుగుతుంటే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంతవరకు నోరు విప్పలేదు.
► కరోనా కష్టాల్లో ప్రజలుంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశారు. ఏడాదిలో మూడుసార్లు పెంచారు. కరెంటు బిల్లులు నాలుగు రెట్లు అధికం చేశారు.
► ఒక్క ఏడాదిలోనే అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రూ.లక్ష కోట్లు అప్పులు చేశారు. రాబోయే నాలుగేళ్లలో ఎన్ని అప్పులు చేస్తారో అనే ఆందోళన కలుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment