సాక్షి, అమరావతి: తుపాను వస్తే తనను సమీక్ష చేయొద్దంటున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం అన్నీ చేస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అత్యవసరాలపై సమీక్షలు చేస్తామంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ పట్ల ఒకరకంగా, మిగిలిన పార్టీల పట్ల మరోరకంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమం త్రులకు ఒక నిబంధన, ప్రధానమంత్రికి ఇంకో నిబంధనా? అని నిలదీశారు. చంద్రబాబు బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీ కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని, తాగునీటి ఎద్దడి, విత్తనాల పంపిణీ, పోలవరం ప్రాజెక్టు పనులపై తాము సమీక్ష చేస్తామంటే వద్దంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇంకా ఏం చెప్పారంటే.‘‘అన్ని చోట్లా ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఏపీలో తలెత్తిన ఇబ్బందులే అన్ని చోట్లా ఉన్నాయి. పోలింగ్ శాతాన్ని తగ్గించే కుట్రలు చేశారు. బీజేపీ ప్రభుత్వాలు లేని పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లోనే ఇలాంటి ఇబ్బందులు సృష్టిస్తున్నారు. దీనిపై 23 పార్టీల నేతలందరం కలిసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. నా పోరాటం కేవలం ఏపీ గురించే కాదు, దేశం గురించి. నా పోరాటం వల్లే వీవీ ప్యాట్‌లు వచ్చాయి. వాటిపైనా నమ్మకం పోయింది. అందుకే పేపర్ బ్యాలెట్‌కు వెళ్లాలని కోరుతున్నాం.
మోదీ యావంతా దుస్తులపైనే...
ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి చౌకబారు విమర్శలు చేస్తున్నారు. ప్రధాని పదవి కోసం ప్రతిపక్ష నేతలు దుస్తులు కుట్టించుకున్నారనడం దారుణం. ఆయన యావంతా దుస్తులపైనే తప్ప దేశంపై లేదు. రూ.10 లక్షల విలువైన దుస్తులు ఆయనే వేసుకుంటున్నారు. మోదీ గంటకో డ్రెస్ మార్చి ఆర్భాటం చేస్తున్నారు. డ్రెస్సులు మార్చడంలోనే ఆయన మార్పు చూపించారు. మే 23 తరువాత ఎవరు కనుమరుగు అవుతారో చూద్దాం. అది కొత్త సినిమా కాదు ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసాలు సృష్టించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై అనుమానం లేదు. రోడ్డు మీద ప్రెస్‌మీట్ పెట్టనివ్వలేదని సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నన్ను ప్రశ్నిస్తున్నాడు. అది ఎన్నికల సంఘం వాళ్లను అడగాలి. అయినా (లక్ష్మీస్ ఎన్టీఆర్) కొత్త సినిమా కాదు, తెలంగాణలో ఎప్పుడో విడుదలైందే.
సీఎస్ ఓవరాక్షన్ చేశారు
టీటీడీ నగల తరలింపు వివాదంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఓవరాక్షన్ చేశారు. ఈ అంశంపై నాకు చెప్పకుండానే కమిటీ వేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులే సొంతంగా కమిటీలు ఎలా వేస్తారు? కమిటీని రాటిఫికేషన్ కోసం నాకు పంపారు. నేను రాటిఫికేషన్ చేయడానికే ఉన్నానా? ఈ వ్యవహారంలో టీటీడీ ఈవో తప్పు చేయలేదు. ఆయనను ఎలా తప్పుపడతారు?’’ అని సీఎం ప్రశ్నించారు.
నాలుగు జిల్లాల్లో ‘కోడ్’ సడలించండి
సీఈసీకి సీఎం చంద్రబాబు లేఖ
తుపాను అత్యవసర పరిస్థితుల దృష్ట్యా తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సడలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఫొని తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీర ప్రాంతాల ప్రజలకు చేరవేసేందుకు, మానవ వనరుల సమీకరణ, ఇతర నష్ట నివారణ చర్యలను చేపట్టడానికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పూర్తయిన దృష్ట్యా నాలుగు జిల్లాల్లో కోడ్‌ను సడలించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment