కొండేపి నియోజకవర్గ పార్టీ సమీక్షలో ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీఎం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘నువ్వేం పుడింగివా.. ఎమ్మెల్యేవని విర్రవీగుతున్నావా? ఒక్కసారి ఎమ్మెల్యే అయినందుకే కళ్లు నెత్తికెక్కాయా? మహా నాయకుడివని విర్రవీగుతూ ఫోజులు కొడుతున్నావ్.. నువ్వేమైనా డిక్టేటర్‌ని అనుకుంటున్నావా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండెపి టీడీపీ దళిత ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిపై రెచ్చిపోయారు. ప్రకాశం జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు రెండోరోజు శనివారం ఒంగోలు సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో కొండపి నియోజకవర్గ సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే స్వామిపై చిందులు తొక్కారు. ‘‘నీకు గర్వం పెరిగింది.. గర్వం వచ్చాక మోదీ ఇమేజ్ ఎలా పతనమైందో నీ పరిస్థితి అలాగే అవుతుంది. అలా అవకుండా చూసుకో. నేను కళ్లు తెరిస్తే నిన్నెవరూ పట్టించుకోరు. నేను ఒక్క పిలుపిస్తే నీ పరిస్థితి కార్యకర్తకంటే దిగజారుతుంది. పార్టీ అధ్యక్షుడు, ఎంపీపీల మాట కూడా వినవా..?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబు మాటలకు బిత్తరపోయిన స్వామికి నోట మాటరాక నిశ్చేష్టుడయ్యారు. సీఎం విరుచుకుపడిన తీరు చూసి ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు సైతం పాపం.. స్వామి.. అంటూ జాలిపడ్డారు. దళితులైన ఎమ్మెల్యే డేవిడ్‌రాజు (యర్రగొండపాలెం), సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీఎన్ విజయకుమార్‌లపై సీఎం విరుచుకుపడ్డారు. తన పర్యటనలో తొలిరోజైన శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత ఇదే హాలులో నిర్వహించిన సంతనూతలపాడు, యర్రగొండపాలెం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఎమ్మెల్యే డేవిడ్‌రాజు, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతనూతలపాడులో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నేతలే మాజీ ఎమ్మెల్యే బీఎన్‌ను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు.
బీఎన్‌ను మార్చాల్సిందేనంటూ కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. సీఎంకు, లోకేష్‌కు ఫిర్యాదులు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం.. ఎంపీపీలు, మండల స్థాయి నేతలు చెప్పినట్లు ఎందుకు వినడం లేదంటూ బీఎన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు పనితీరు బాగాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 3 నియోజకవర్గాలకు చెందిన దళిత ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలపై సీఎం తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం ఆ పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమైంది. సీఎం తన సామాజిక వర్గం నేతల కోసమే దళిత ఎమ్మెల్యేలను చివాట్లు పెట్టారని వారి అనుచర వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన సామాజికవర్గానికి చెందిన మండల స్థాయి నేతలు ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నా పట్టించుకోని చంద్రబాబు.. దళిత ఎమ్మెల్యేలను తిట్టడంపై స్వపక్ష నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.
మీ తాత నాకు విధేయుడు..
కొండపిలో వర్గ విభేదాలకు ఆజ్యం పోశావంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ‘‘నిన్ను జిల్లా నాయకుడిని, ఎమ్మెల్యేని చేశాను. మీ తాతను ఎమ్మెల్యే, మంత్రిని చేశాను. వయసులో పెద్దవాడైనా ఆయన విధేయతగా ఉండేవారు. నీ దగ్గర ఆ అలవాటు లేదు. మీ తాత పనితీరు నీకు రాలేదు. పనిమెరుగు పరుచుకో’’ అంటూ సలహాఇచ్చారు. జిల్లా నాయకత్వం వహిస్తే.. అందరిని కలుపుకుపోవాలని చెప్పారు. తననెవరూ ఏ మార్చలేరంటూ సీఎం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment