BN Vijay Kumar
-
కొందరివాడు బీఎన్.. అందరివాడు టీజేఆర్
సాక్షి, చీమకుర్తి (ప్రకాశం): సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైఎస్సార్కాంగ్రెస్పార్టీ తరపున టీజేఆర్ సుధాకర్‌బాబు, టీడీపీ తరపున బీఎన్.విజయ్‌కుమార్ ప్రధానంగా పోటీపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇరుపార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీకి గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి గణాంకాలను పరిశీలించినట్లయితే సంతనూతలపాడు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నట్లు విధితమవుతుంది. నామినేషన్లను వేసినప్పటి నుంచి నియోజకవర్గంలోని చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం అనంతరం వైఎస్సార్సీపీ వైపే గాలివాటం ఉన్నట్లు విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇరుపార్టీలు, అభ్యర్థుల బలాబలాలను అంచాని వేసినట్లయితే ఈవిధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సమస్యల మీద అలుపెరుగని పోరాటం .. ♦ కొత్తగా పోటీచేస్తుండటం వలన నియోజకవర్గంలో ఎలాంటి వ్యతిరేక ఓటు ప్రభావం లేకపోవడం కలిసొచ్చే అంశం. ♦ 9 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే జనాభిప్రాయం అభ్యర్థికి బలాన్నిస్తుంది. ♦ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో అన్ని రకాల ప్రజల మనోభావాలకు దగ్గరగా ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ♦ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ఎలాంటి అసమ్మతి వర్గాలు లేకపోవడం శుభపరిణామం ♦ టిక్కెట్టు ఖరారు కాకుముందే సమన్వయకర్తగా ఏడాదికి పైగా నియోజకవర్గంలో తిరుగుతూ గ్రామాల్లో పట్టు సాధించటం అనుకూలం. ♦ సుధాకర్‌బాబు వాగ్దాటి కలిగిన ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షించటం. ♦ నియోజకవర్గంలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న బూచేపల్లి కుటుంబం అండదండలు సుధాకర్‌బాబుకు పుష్కలంగా లభించటం మరో ప్రధాన బలంగా చెప్పవచ్చు ♦ నాలుగు మండలాల కన్వీనర్లు, ప్రధాన నాయకులతో పాటు గ్రామస్థాయి నాయకులతో చొరవగా కలుపుగోలుగా కలిసిపోవడం మరింత బలం. ♦ స్థానిక సమస్యలను ఎక్కువుగా ప్రజలలోకి తీసుకుపోయేందుకు తగిన సమయం లేకపోవడం ప్రతికూలతలుగా చెప్పుకోవచ్చు. వ్యతిరేక వర్గంతో ఉక్కిరిబిక్కిరి.. ♦ నియోజకవర్గంలో పదేళ్ల నుంచి పనిచేస్తున్నందున దానికి సంబంధించిన అనుభవం ఉపయోగపడే అవకాశం ఉంది ♦ ఎస్సీ, బీసీలను ఆకట్టుకున్నా ఓసీ సామాజికవర్గంలో వ్యతిరేకత ఉంది. ♦ ఐదేళ్ల పాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ప్రభావం అభ్యర్థిపై చూపడం ప్రతికూలాంశం. ♦ ఆది నుంచి అసమ్మతి నాయకుల తారస్థాయి వ్యతిరేక ప్రచారం అభ్యర్థికి ఇబ్బందికరంగా మారటం. ♦ కలిసిపోయినట్లు నటిస్తున్న అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉండి వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం. ♦ పదేళ్ల క్రితం ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉపయోగపడినా ఐదేళ్ల క్రితం నుంచి ఇన్చార్జిగా పనిచేసినా అధికార పార్టీలోనే వ్యతిరేక పవనాలు ఆందోళన కలిగించే అంశం. -
నువ్వేమైనా పుడింగివా.. కళ్లు నెత్తికెక్కాయా?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘నువ్వేం పుడింగివా.. ఎమ్మెల్యేవని విర్రవీగుతున్నావా? ఒక్కసారి ఎమ్మెల్యే అయినందుకే కళ్లు నెత్తికెక్కాయా? మహా నాయకుడివని విర్రవీగుతూ ఫోజులు కొడుతున్నావ్.. నువ్వేమైనా డిక్టేటర్‌ని అనుకుంటున్నావా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండెపి టీడీపీ దళిత ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిపై రెచ్చిపోయారు. ప్రకాశం జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు రెండోరోజు శనివారం ఒంగోలు సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో కొండపి నియోజకవర్గ సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే స్వామిపై చిందులు తొక్కారు. ‘‘నీకు గర్వం పెరిగింది.. గర్వం వచ్చాక మోదీ ఇమేజ్ ఎలా పతనమైందో నీ పరిస్థితి అలాగే అవుతుంది. అలా అవకుండా చూసుకో. నేను కళ్లు తెరిస్తే నిన్నెవరూ పట్టించుకోరు. నేను ఒక్క పిలుపిస్తే నీ పరిస్థితి కార్యకర్తకంటే దిగజారుతుంది. పార్టీ అధ్యక్షుడు, ఎంపీపీల మాట కూడా వినవా..?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు మాటలకు బిత్తరపోయిన స్వామికి నోట మాటరాక నిశ్చేష్టుడయ్యారు. సీఎం విరుచుకుపడిన తీరు చూసి ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు సైతం పాపం.. స్వామి.. అంటూ జాలిపడ్డారు. దళితులైన ఎమ్మెల్యే డేవిడ్‌రాజు (యర్రగొండపాలెం), సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ బీఎన్ విజయకుమార్‌లపై సీఎం విరుచుకుపడ్డారు. తన పర్యటనలో తొలిరోజైన శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత ఇదే హాలులో నిర్వహించిన సంతనూతలపాడు, యర్రగొండపాలెం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఎమ్మెల్యే డేవిడ్‌రాజు, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతనూతలపాడులో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నేతలే మాజీ ఎమ్మెల్యే బీఎన్‌ను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. బీఎన్‌ను మార్చాల్సిందేనంటూ కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. సీఎంకు, లోకేష్‌కు ఫిర్యాదులు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం.. ఎంపీపీలు, మండల స్థాయి నేతలు చెప్పినట్లు ఎందుకు వినడం లేదంటూ బీఎన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు పనితీరు బాగాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 3 నియోజకవర్గాలకు చెందిన దళిత ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలపై సీఎం తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం ఆ పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమైంది. సీఎం తన సామాజిక వర్గం నేతల కోసమే దళిత ఎమ్మెల్యేలను చివాట్లు పెట్టారని వారి అనుచర వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన సామాజికవర్గానికి చెందిన మండల స్థాయి నేతలు ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నా పట్టించుకోని చంద్రబాబు.. దళిత ఎమ్మెల్యేలను తిట్టడంపై స్వపక్ష నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. మీ తాత నాకు విధేయుడు.. కొండపిలో వర్గ విభేదాలకు ఆజ్యం పోశావంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ‘‘నిన్ను జిల్లా నాయకుడిని, ఎమ్మెల్యేని చేశాను. మీ తాతను ఎమ్మెల్యే, మంత్రిని చేశాను. వయసులో పెద్దవాడైనా ఆయన విధేయతగా ఉండేవారు. నీ దగ్గర ఆ అలవాటు లేదు. మీ తాత పనితీరు నీకు రాలేదు. పనిమెరుగు పరుచుకో’’ అంటూ సలహాఇచ్చారు. జిల్లా నాయకత్వం వహిస్తే.. అందరిని కలుపుకుపోవాలని చెప్పారు. తననెవరూ ఏ మార్చలేరంటూ సీఎం చెప్పారు. -
ఆయనంతే..!
♦ ఎక్కడున్నా చుట్టుముట్టుతున్న వివాదాలు ♦ గతంలో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా మారని తీరు ♦ పెన్షనర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ♦ గుమస్తాల పాస్ ఆర్డర్ లేకుండానే ఎస్టిఓ సంతకాలు సాక్షి, కడప : సిద్దవటం సబ్ ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్న బీఎన్ విజయ్‌కుమార్ పనితీరుపై తరుచూ విమర్శలు వస్తున్నాయి. కొత్త పెన్షన్ల విషయంలో మామూళ్లు ముట్టజెప్పందే పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చేయి తడిపితే ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కకు నెట్టి ఫైళ్లు చకాచకా సిద్ధం చేస్తారనే పేరుంది. గతంలో ఆయన పనిచేసిన చాలాచోట్ల వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ చర్యలు సైతం ఎదుర్కోవాల్సి వచ్చినా నేటికీ ఆయన తీరు మారలేదని తెలుస్తోంది. ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తులకు ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది. మంజూరైనవి అకౌంటెంట్ జనరల్, ఎల్ఎఫ్ల నుంచి జిల్లా ఖజానా కార్యాలయాలకు వస్తే వాటిని సంబంధిత సబ్ ట్రెజరీలకు పంపుతారు. అక్కడ పేమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త పెన్షన్ దారులు తన వద్దకు వచ్చారంటే ఎస్టీఓకు చాలా ఆనందం. తొలుత పలు సాకులతో వారిని తిప్పుకుంటారని తెలుస్తోంది. తర్వాత బేరసారాలు జరుపుతారని, తాను అడిగింది ముట్టజెబితేగానీ ఫైలు ముందుకు కదలనీయడని విమర్శలు ఉన్నాయి. బిల్లులపై నేరుగా సంతకాలు పెన్షనర్ల బిల్లులపై జూనియర్ అసిస్టెంట్ లేదా సీనియర్ అసిస్టెంట్ పాస్ ఆర్డర్ వేయాల్సి ఉంటుంది. తర్వాతే ఎస్టీఓ దానిని పరిశీలించి సక్రమంగా ఉంటే సంతకం చేయాలి. అయితే కొత్త పెన్షన్ల విషయంలో గుమాస్తాలతో సంబంధం లేకుండా ఆయనే సైడ్ ఇన్సిల్, సంతకం చేసేస్తున్నారు. అంటే కొత్త పెన్షన్‌దారు నుంచి రాబట్టే మామూళ్లు తనకు మాత్రమే దక్కాలన్న దురాశతో ఇలా నిబంధనలను కూడా పాటించడం లేదని ఆ శాఖ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. గతంలో బద్వేలు ఇన్చార్జి ఎస్టీఓగా పనిచేసిన ఓ వ్యక్తి గుమాస్తా పాస్ ఆర్డర్ లేకుండానే బిల్లులు చేసినందుకు ఉన్నతాధికారులు ఆయనకు రెండు ఇంక్రిమెంట్లు కట్ చేశారు. కాగా, సిద్దవటం ఎస్టీఓ విషయంలో మాత్రం పై అధికారులు ఎందుకు చూసీచూడనట్లు వ్యవహారిస్తున్నారనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి సక్రమంగా రాకపోవడం, వచ్చినా జిల్లా ఆపీసులో పని పేరుతో మధ్యాహ్నం వరకే ఉండి వెళ్లిపోతుంటారని అంటున్నారు. ఇందువల్ల సబ్ ట్రెజరీకి వచ్చే వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. వివాదాలకు కేంద్ర బిందువు ఆయన ఎక్కడ పనిచేసినా వివాదాస్పదమైన వ్యక్తిగానే గుర్తింపు పొందారు. కడప సబ్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో రిటైర్డ్ ఉద్యోగులకు సంబం«ధించిన పెన్షన్, గ్రాట్యూటీ, కమ్యూటేషన్ బిల్లుల విషయంలో మామూళ్లు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై అప్పటి ఎస్పీ వై.నాగిరెడ్డి 2007 డిసెంబరు 8వ తేదీన కలెక్టర్ కృష్ణబాబుకు నివేదిక కూడా పంపారు. దీనిపై స్పందించిన కృష్ణబాబు విచారణ నిర్వహించాలంటూ అదేనెల 29వ తేదీన ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా కారుణ్య నియామకం కింద వినోద్‌కుమార్ అనే వ్యక్తిని జమ్మలమడుగు సబ్ ట్రెజరీలో షరాప్గా నియమించిన విషయంలో ఆయన శ్రీముఖం అందుకున్నారు. ఈ సంఘటనలో ఆయన సీనియర్ అకౌంటెంట్ నుంచి జూనియర్ అకౌంటెంట్‌గా రివర్షన్ పొంది ముద్దనూరుకు బదిలీ అయ్యారు. ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్, మరికొంతమంది ఉద్యోగులపై అకారణంగా నిందలు మోపుతూ 2008 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన అనంతరం 2014 మార్చి 11వ తేదీ ఆయనకు ఒక ఇంక్రిమెంటు కట్ చేశారు. ఇలా పనిచేసిన ప్రతిచోట పలు అభియోగాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన తీరులో నేటికీ మార్పు రాకపోవడం పట్ల ట్రెజరీ ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నేను డబ్బులు తీసుకోవడం లేదు... అంతా అవాస్తవం సిద్దవటం ట్రెజరీలో ఎస్టీఓ విజయ్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ‘సాక్షి’ ప్రతినిధి ఫోన్లో వివరణ కోరగా, కేవలం ప్రజలకు ఇబ్బందులు లేకుండా వేగంగా పనులు జరగాలన్న ఉద్దేశంతోనే మిగతా కిందిస్థాయి ఉద్యోగులు లేనపుడు తాను బిల్లుల్లో పలుచోట్ల సైడ్ ఇన్సిల్, సంతకాలు చేయాల్సి వచ్చిందని తెలియజేశారు. కేవలం కొంతమంది సరిపోని వారు చేస్తున్న వ్యవహారం తప్ప మరేమీ లేదన్నారు. సిబ్బంది సెలవులో ఉన్నప్పుడు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాను సంతకాలు చేసి పంపించానన్నారు. అందులోనూ సిబ్బంది కొరత వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. తాను ఎప్పుడూ విధులకు ఎగ్గొట్టనని, ఆఫీసులో ఒక్కోసారి ఇంటర్నెట్ పనిచేయకపోవడం, కరెంటు లేకపోవడం తదితర సమస్యలతో కడప ఆఫీసుకు వెళ్లి పని చేసుకుని రావాల్సి వస్తుందని, ఈ నెపాన్ని చూసి ఆఫీసుకు ఎగనామం పెడుతున్నానని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. తాను ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదని, అలాంటి వారు ఎవరైనా ఉంటే తీసుకు రావాలని తెలిపారు. తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని చెప్పుకొచ్చారు.