సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు వెలుగుచూసినప్పుడల్లా వాటిని కప్పిపుచ్చి ప్రజల దృష్టిని మరల్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త నాటకాలకు తెరతీయడం పరిపాటి! తాజాగా మట్టి పనులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.112.47 కోట్లను కాజేసినట్లు అంగీకరించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవడం.. స్పిల్‌వే పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని కేంద్ర నిపుణుల కమిటీ ఇటీవల స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలో వాటిని కప్పిపుచ్చుకోవడానికి పోలవరం హెడ్ వర్క్స్ (జలాశయం)లో స్పిల్ వే గ్యాలరీ పనులు కొలిక్కిరాగానే, ప్రాజెక్టు పూర్తయినట్లుగా ప్రజలను భ్రమిపంజేయాలనే లక్ష్యంతో బుధవారం ‘గ్యాలరీ వాక్’ పేరుతో చంద్రబాబు మరో డ్రామాకు తెరతీశారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్యాలరీ వాక్‌లో పాల్గొంటున్న చంద్రబాబు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సహా అందరినీ ఆహ్వానిస్తూ భారీఎత్తున పత్రికలు ముద్రించి పంపిణీ చేయడంపై అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి.
గ్యాలరీ అంటే..
వరద నీటిని దిగువకు విడుదల చేయడానికి వీలుగా నిర్మించే స్పిల్‌వే భద్రత కోసం స్పిల్‌వేకు దిగువన గ్యాలరీ నిర్మిస్తారు. జలాశయంలో నిల్వ ఉండే నీటి ఊర్ద్వపీడనం (ఒత్తిడి)ను స్పిల్‌వేపై పడకుండా చూడటం దీని ముఖ్య ఉద్దేశ్యం. జలాశయంలో నీటి నిల్వవల్ల స్పిల్‌వే కాంక్రీట్ నిర్మాణానికి చెమ్మ తగలడంవల్ల లీకయ్యే నీటిని ఎప్పటికప్పుడు బయటకు తోడేయడం.. జలాశయంలో నీటి నిల్వ, దిగువకు విడుదల చేసే ప్రవాహాన్ని కొలిచేందుకు యంత్రాలను అమర్చడం, స్పిల్‌వేలో ఏవైనా చీలికలు (గ్యాప్) ఏర్పడితే గ్రౌటింగ్ (అధిక ఒత్తిడితో సిమెంటు కాంక్రీట్ మిశ్రమాన్ని పంపడం) చేసి, వాటిని పూడ్చడం ద్వారా స్పిల్‌వే భద్రతను కాపాడటానికి గ్యాలరీ ఉపయోగపడుతుంది.
పోలవరం సిŠప్‌ల్‌వేకు దిగువన రెండు మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల ఎత్తుతో గ్యాలరీని నిర్మిస్తున్నారు. దీనిని చేరుకోవడానికి వీలుగా 2, 26, 51 బ్లాక్‌ల వద్ద లిఫ్ట్‌లు ఏర్పాటుచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. చిన్న జలాశయం నుంచి భారీ జలాశయం వరకూ అన్ని ప్రాజెక్టుల స్పిల్ వేలకు గ్యాలరీలను ఏర్పాటుచేయడం సర్వసాధారణం. గతంలో ఎప్పుడూ కూడా గ్యాలరీలు పూర్తయినప్పుడు గ్యాలరీ వాక్‌లతో అప్పటి పాలకులు హంగామా చేసిన దాఖలాల్లేవు. కానీ.. పోలవరం విషయంలో గ్యాలరీ నిర్మాణం కొలిక్కి రావడంతోనే ప్రాజెక్టు పూర్తయినట్లుగా సీఎం చంద్రబాబు చిత్రీకరించే యత్నం చేయడంపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు రక్తికట్టించిన ఘట్టాలు..
- పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రూ.1981.54 కోట్ల నిధులు విడుదల చేస్తూ చెక్ ఇచ్చిన సందర్భంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయిందనే రీతిలో బిల్డప్ ఇచ్చారు.
- డిసెంబర్ 30, 2016న పోలవరం హెడ్‌వర్క్స్ స్పిల్‌వేలో కాంక్రీట్ పనుల ప్రారంభోత్సవానికి శిలాఫలకం ఆవిష్కరణకూ పెద్ద షో నిర్వహించారు.
- పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల బాగోతంపై తీవ్ర విమర్శలు రావడంతో జూన్ 8, 2017న కాఫర్ డ్యామ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించారు. ఆ తర్వాత మరోసారి ఎగువ కాఫర్ డ్యామ్ పనులకు మరోసారి సీఎం శంకుస్థాపన చేశారు.
- 2018 నాటికి ప్రాజెక్టు పూర్తిచేస్తామన్న హామీ నీరుగారిపోయింది. దీనిపై ప్రజల దృష్టి మరల్చడానికి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పునాది (డయా ఫ్రమ్ వాల్)ని జూన్ 11, 2018న జాతికి అంకితం చేసి ప్రాజెక్టు పూర్తయినట్లు కలర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment