సాక్షి, అమరావతి : వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేందుకు పెద్ద కుట్రే జరుగుతోంది. చంద్రబాబు డైరెక్షన్‌లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ యాక్షన్ నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దొడ్డి దారిన దెబ్బతీసేందుకు వ్యూహం పన్నిన చంద్రబాబు.. ఓటర్లను గందరగోళపరిచేందుకు దిగజారుడు ఎత్తుగడ వేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే.. ఏపీలో పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లతో సరిపోలిన అభ్యర్థులను ప్రజాశాంతి పార్టీ సిద్ధం చేసింది.
నామినేషన్‌కు చివరిరోజున ఒక్క అనంతపురంలో జిల్లాలోనే ఏకంగా 8 నియోజకవర్గాల్లో కుట్ర పన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో కేఏ పాల్ అభ్యర్థుల పేర్ల గిమ్మిక్కుకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లతో వున్న వ్యక్తులను తమ పార్టీ అభ్యర్థులుగా పోటీలోకి దించారు. రాయదుర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డికి పోటీగా ఉండాల రామచంద్రారెడ్డిని, ఉరవకొండ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డికి పోటీగా విశ్వనాథరెడ్డిని, కల్యాణదుర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఉషాశ్రీచరణ్‌కు పోటీగా ఉషారాణిని కేఏ పాల్ బరిలోకి దింపారు. అలాగే, రాప్తాడులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశరెడ్డికి పోటీగా డి. ప్రకాష్‌ను, పెనుకొండలో పార్టీ అభ్యర్థి ఎం శంకరనారాయణకు పోటీగా ఎస్ శంకరనారాయణను, ధర్మవరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి పోటీగా పెద్దిరెడ్డిగారి వెంకటరామిరెడ్డిని, కదిరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సిద్ధారెడ్డికి పోటీగా నన్నక సిద్ధారెడ్డిని.. ప్రజాశాంతి పార్టీ నిలబెట్టింది. అంతేకాదు, అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి పగడి వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్ వేశారు. అతను రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడే గాక తెలుగు దేశం పార్టీ నేత కావడం గమనార్హం. టీడీపీ, ప్రజాశాంతి పార్టీ మధ్య ఉన్న అంతర్గత బంధం ఏమిటో ఈ ఘటన రుజువు చేస్తోంది. ఈ పేర్ల కుట్ర వెనుక చంద్రబాబు హస్తమందని స్పష్టం చేస్తోంది.
ప్రకాశం జిల్లాలోనూ అదే జరిగింది. పర్చూరు నియోజకవర్గంనుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు పోటీ చేస్తున్నారు. ఆయన విజయావకాశాలను దెబ్బకొట్టేందుకు పెద్ద కుట్ర పన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరావు పేరుతోనే వున్న ఒంగోలు సమీపంలోని పెళ్లకూరుకు చెందిన ఒక వ్యక్తిని ప్రజాశాంతి పార్టీ పర్చూరునుంచి పోటీ చేయిస్తోంది. గుంటూరు జిల్లాలోనూ అదే జరిగింది. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నంబూరు శంకరరావు పోటీ చేస్తున్నారు. దాదాపు అదే పేరుతో వున్న నంబూరి శంకరరావును ప్రజాశాంతి పార్టీ తమ అభ్యర్థిగా నిల్చోబెట్టి... ఓటర్లను గందరగోళ పరిచే ఎత్తుగడకు పూనుకుంది.
అంతేకాదు, ఈవీఎంల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ సీలింగ్ ఫ్యాన్, ప్రజాశాంతి పార్టీ సింబల్ హెలికాప్టర్ గుర్తులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా పక్కా ప్లాన్ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో జరిగినట్లుగానే ఏపీ ఎన్నికల్లోనూ కుట్రకు తెరదీశారు. టీడీపీ కార్యాలయం నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే కేఎల్ పాల్ నడుస్తున్నారని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు టీడీపీ, జనసేన ఆడుతున్న గేమ్‌లో కేఏ పాల్ కూడా పాత్రధారని జరుగుతున్న పరిణామాలే స్పష్టం చేస్తున్నాయి. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ రెక్కలు, వైఎస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌తో పోలి ఉందని.. ఆ గుర్తును మార్చాలని విజయసాయిరెడ్డి ఎలక్షన్ కమిషన్‌ను కోరారు. ప్రజాశాంతి పార్టీ కండువా కూడా తమ పార్టీ జెండాను పోలి ఉందన్నారు. కేఏ పాల్, చంద్రబాబు కలిసి మోసానికి పాల్పడుతున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు.
చదవండి: పాల్‘ట్రిక్స్’ : ప్రజాశాంతి పార్టీ పేర్ల గిమ్మిక్కు
Comments
Please login to add a commentAdd a comment