చంద్రబాబు, కరువు.. కవలలు | Chandrababu Naidu And Drought Are Twins Says YSRCP Leaders | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 30 2018 3:01 AM | Last Updated on Fri, Nov 30 2018 3:01 AM

Chandrababu Naidu And Drought Are Twins Says YSRCP Leaders - Sakshi

పల్నాడు గర్జన సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆనం. చిత్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు 

సాక్షి, గుంటూరు: చంద్రబాబు నాయుడు, కరువు.. కవల పిల్లలని, ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువుతో రాష్ట్రం అల్లాడిపోతుందని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. కృష్ణానది ఒడ్డునే ఉన్న పల్నాడు ప్రాంతంలో కరువు విలయ తాండవం చేస్తున్నా బాబు సర్కారు పట్టించుకోలేదని మండిపడ్డారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి అధ్యక్షత దాచేపల్లిలో గురువారం జరిగిన ‘పల్నాడు గర్జన’ సభలో ఆనం ప్రసంగించారు. కృష్ణా నదిలో నీరు ఉన్నప్పటికీ పంటలకు ప్రభుత్వం నీరు విడుదల చేయక పోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టాలపాలై అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు నవనిర్మాణ దీక్ష, ధర్మ పోరాటమంటూ దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు జత కట్టడం చూసి ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోందన్నారు. సీఎం రమేష్, సుజన చౌదరిలు వేల కోట్లు దోచుకున్నట్లు ఐటీ, ఈడీ సోదాల్లో తేలితే వారిపై కక్ష సాధింపుగానే దాడులు జరిగాయంటూ చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల నుంచి లోకేశ్‌కు కమీషన్‌లు ఇప్పించే బ్రోకర్‌లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  
 
పల్నాడును అవినీతి మయం చేసిన యరపతినేని 
పౌరుషాల పురిటిగడ్డ పల్నాడును యరపతినేని అవినీతిమయంగా మార్చారని వైఎస్సార్‌ సీపీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే అంటే దోపిడీ దొంగలనే మాదిరిగా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపిస్తే చంద్రబాబు రాహుల్‌ను చంకన పెట్టుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పంటలు వేసుకోండి.. నీరిస్తామని పల్నాడు రైతులకు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నిండా ముంచారని మండిపడ్డారు. హైకోర్టు విచారణకు ఆదేశించగానే తెల్లరాయిని దోచేసిన యరపతినేని తప్పుకొని.. డ్రైవర్లు, పాలేర్లను కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో అక్రమ మైనింగ్, పేకాట క్లబ్‌లు, గంజాయి సరఫరా, క్రికెట్‌ బెట్టింగ్‌లు, అనేక అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా చివరకు లైంగిక దాడులకు నిలయంగా మార్చేశారని మండిపడ్డారు. లైమ్‌సిటీగా ఉన్న పిడుగురాళ్లను క్రైమ్‌ సిటీ మార్చేశారన్నారు. దేశంలో పంటలకు సెలవు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు.  
 
అధికారులు, పోలీసుల అండతో అక్రమాలు 
అధికారులు, పోలీసులను అడ్డు పెట్టుకుని యరపతినేని వందల కోట్లు దోచుకున్నారని వైఎస్సార్‌సీపీ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. యరపతినేనికి దమ్ముంటే కాసు బ్రహ్మనందరెడ్డి మనవడు కాసు మహేష్‌రెడ్డిపై గెలవాలని సవాల్‌ చేశారు. బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పల్నాడు ప్రాంత ప్రజలు తమపై ఎప్పుడు ఎలాంటి దాడులు జరుగుతాయో, ఎక్కడ అక్రమ కేసుల్లో ఇరికిస్తారోననే భయాందోళనలో జీవిస్తున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడు పల్లెల్లో యరపతినేని చిచ్చుపెట్టే కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబుకు పల్నాడు ప్రాంత రైతులు గుర్తుకు వచ్చారని, పక్కనే ఉన్న కృష్ణానది నీరు ఇవ్వలేని దద్దమ్మ.. ఎక్కడో ఉన్న గోదావరి నీరు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, విడదల రజని, మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి తదితరులు ప్రసంగించారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, యనుమల మురళీధర్‌రెడ్డి, దేవళ్ల రేవతి, జంగా కోటయ్య, జెడ్పిటీసీ సభ్యులు, ఎంపీపీలు, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement