సాక్షి, హైదరాబాద్: ఇంట గెలిచి రచ్చ గెలవాల న్నది ఓ నానుడి. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇలాంటివి వర్తించవు. సొంత రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్న ఆయన.. పొరుగు రాష్ట్రంలో మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారు. అవసరానికి తగ్గట్టుగా ఎవరితోనైనా జతకట్టడం.. అవసరం తీరాక వారికి చేయివ్వడంలో ఆయన్ను మించినవారు లేరంటే అతిశయోక్తి లేదు. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో అవినీతి, అక్రమాలు ఎక్కువ కావడంతో అక్కడ అన్ని వర్గాల్లోనూ చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత గూడు కట్టుకుని ఉంది. ఈ సంగతిని ముందుగానే పసిగట్టిన ఆయన తన వైఫల్యాలను, తప్పిదాలను తెలివిగా ఎన్డీఏపై నెట్టేసి బయటకు వచ్చేశారు. (నేరుగా రాలేను.. ‘కూటమి’తో వచ్చా)
గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించిన చంద్రబాబు.. నాలుగేళ్ల తర్వాత వారికి చెయ్యిచ్చి, ప్రస్తుతం కాంగ్రెస్ చేయి అందుకున్నారు. ఏ కూటమిలో ఉన్నా తన సొంత ప్రయోజనాల కోసమే పనిచేసే టీడీపీ అధినేత.. ఇప్పుడు అదే కోవలో తెలంగాణ ఎన్నికలను తన సొంత ఎజెండా కోసం ఉపయోగించుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరవుతారన్న దానిపై బయట కు ఏం చెబుతున్నా.. తన సన్నిహితుల వద్ద సీఎంను నిర్ణయించేది తానేనని ప్రచారం చేసుకుంటున్నారు.
డబ్బులిస్తున్నామన్న ధీమాయే కారణమా?
టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్‌కు ముందే తన అసలు రూపాన్ని బయటపెట్టారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావిస్తుండగా, కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరన్నది తన అభీష్టం మేరకు జరుగుతుందని బాబు ప్రచారం చేసుకుంటుండడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కష్టపడి పార్టీని గెలిపిస్తే సీఎంగా అవకాశం దక్కుతుందని ఆశిస్తున్న టీపీసీసీ ముఖ్య నేతలు ఈ వ్యాఖ్యలతో కలవరపడుతున్నారు.
కూటమి అభ్యర్థుల కోసం భారీగా డబ్బులిస్తున్నామన్న ధీమాతో తాను చెప్పినట్టే జరుగుతుందన్న భావన మేరకే చంద్రబాబు ఆ ప్రచారం చేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై టీపీసీసీ ముఖ్య నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ విషయం మా దృష్టికి కూడా వచ్చింది. 13 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ నాయకుడు సీఎంగా నిర్ణయించాల్సిన పరిస్థితులు వస్తే అది నిజంగా మా స్వయంకృతాపరాధమే అవుతుంది. చంద్రబాబుతో డేంజర్ అని తెలిసినా అధిష్టానం ఆదేశాల మేరకు కలిసి వెళుతున్నాం. ఏం జరుగుతుందో.. ఈ బాబు ఏం చేస్తాడో అనే అనుమానం మాకు లేకపోలేదు. మా జాగ్రత్తలో మేముంటున్నాం. అయినా బాబు ఏదైనా చేయగలడు’అని వ్యాఖ్యానించారు.
ఎన్డీఏలో ఉన్నప్పుడూ తప్పుడు ప్రచారమే...
రాజకీయాల్లో అబద్ధాలకు, తప్పుడు ప్రచారాలకు పెట్టింది పేరుగా గుర్తింపు పొందిన చంద్రబాబు గత ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో కలిసి పనిచేశారు. ఏడాది క్రితం వరకు బీజేపీతో చెట్టపట్టాలు వేసుకుని తన అవసరాలను తీర్చుకున్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరారు. తన వ్యక్తిగత అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలను çపణంగా పెట్టిన బాబు.. ఎన్డీఏలో ఉన్నప్పుడే బీజేపీపై అబద్ధపు ప్రచారానికి తెరతీశారు. ఈ అబద్ధాలకు తెరలేపుతూనే కాంగ్రెస్‌తో స్నేహానికి బాటలు వేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం విషయంలో బీజేపీని నాలుగేళ్లపాటు వెనుకేసుకొచ్చిన బాబు అక్కడి ప్రజల ఆగ్రహావేశాలను గమనించి ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించారు. హోదా ఏమైనా సంజీవనా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. హోదా ఇవ్వకుండా బీజేపీ తమను మోసం చేసిందని బిల్డప్ ఇచ్చి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఎన్డీయేకు గుడ్‌బై చెప్పడానికి ముందే కాంగ్రెస్‌తో బేరం కుదుర్చుకున్న బాబు.. ఎన్నికల ఖర్చును భరిస్తానని చెప్పి ఆ పార్టీతో కలిసిపోయారనే చర్చ హస్తిన వర్గాల్లో అప్పట్లోనే జరిగింది. వాస్తవానికి, ఈ ఏడాది జనవరిలోనే కాంగ్రెస్, టీడీపీల స్నేహబంధం కుదిరిందని సమాచారం. ఇందుకు సంబంధించి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఎన్డీయేలో భాగంగా ఉన్నప్పుడే ‘సాక్షి’బయటపెట్టింది.
ఆ రెండింటి కోసమే...
దేశం కోసమే కాంగ్రెస్‌తో కలిశామని చెప్పుకుంటున్న చంద్రబాబు.. నిజంగా దేశం కోసం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసమేమీ ఈ నిర్ణయం తీసుకోలేదని జాతీయ, రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో ఉండి ఇంకా బీజేపీకి మద్దతిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహానికి గురై శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందనే అంచనా మేరకే ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చినా.. కాంగ్రెస్‌తో కలిసేందుకు మాత్రం రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్‌లో పాలన అవినీతిలో కూరుకుపోయింది.
జాతీయ స్థాయిలో ఏదో ఒక ప్రధాన పార్టీ మద్దతు లేకపోతే బాబు వ్యవహారాలపై విచారణ ఖాయం. అందుకే బీజేపీ వ్యతిరేక గూటికి చేరారు. ఇప్పుడు విచారణ జరిపినా తాను ఎన్డీఏను వీడి కాంగ్రెస్‌తో చేతులు కలిపినందుకే వేధిస్తున్నారని ప్రజలకు చెప్పుకోవాలనేది ఆయన ఆలోచన. ఏది జరిగినా తనకు అనుకూలంగా మార్చుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’అని ఓ రాజకీయ విశ్లేషకుడు వివరించారు. ఇది కాకుండా కాంగ్రెస్‌తో తెలంగాణలో కలిసి కూటమికి బాటలు వేసుకునేందుకు మరో ప్రధాన కారణం కూడా కనిపిస్తోంది. అదే ఓటుకు కోట్లు కేసు. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ అడ్డంగా దొరికిన చంద్రబాబు.. ఈ కేసుపై టీఆర్‌ఎస్ ఎక్కడ విచారణ జరుపుతుందోననే భయంతోనే కాంగ్రెస్‌తో చేతులు కలిపి టీఆర్‌ఎస్ ఓటమికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
టీఆర్‌ఎస్ ఓడిపోతే కాంగ్రెస్‌ను మేనేజ్ చేసుకుని ఓటుకు కోట్లు కేసు నుంచి ఎలాగైనా బయటపడొచ్చనే ఆలోచన, వ్యూహం ఇందులో దాగి ఉన్నాయని తెలుస్తోంది. ఈ రెండు కారణాలతోనే ఆయన బీజేపీని వదిలి కాంగ్రెస్ పంచన చేరారని, రేపు మళ్లీ ఇదే కాంగ్రెస్‌ను విమర్శించి.. లేదంటే నట్టేట ముంచి బీజేపీతోనో, ఇంకో పార్టీతోనే జతకట్టేందుకు బాబుకు రెండు సెకన్ల సమయం కూడా పట్టదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టీఆర్‌ఎస్ ఓటమే «ధ్యేయంగా బాబు తెలంగాణ ఎన్నికలలో విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని టీఆర్‌ఎస్ వర్గాలు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment