సాక్షి, అమరావతి: స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల డేటాను ప్రైవేటు కంపెనీకిచ్చి నిండా మునిగిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నేరం నుంచి బయటపడేందుకు ఎదురుదాడి, పక్కదారి మార్గాలను ఎంచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టీఆర్‌ఎస్‌తో లింకు పెట్టి ఎదురు దాడి చేయాలని, విషయాన్ని పక్కదారి పట్టించేలా రకరకాల ప్రచారాలు, ఆరోపణల్ని తెరపైకి తేవాలని నిర్ణయించింది. సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో ఈ అంశంపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. దీని నుంచి ఎలా గట్టెక్కాలో చెప్పాలని చంద్రబాబు మంత్రులను కోరినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, పార్టీ ఇబ్బందుల్లో పడినా మంత్రులు పట్టించుకోవడంలేదని, పార్టీ వాదనను సరిగా వివరించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న వ్యవహారంగా ప్రజలు భావించేలా మాట్లాడాలని, జగన్‌కు మేలు చేసేందుకు టీఆర్‌ఎస్ దీన్ని వాడుకుంటోందనే ప్రచారాన్ని ముమ్మరం చేయాలని, టీవీల్లో ఇదే విషయాన్ని హోరెత్తించాలని దిశానిర్దేశం చేశారు. (సర్వం దోచేశారు)
ఏపీ ప్రభుత్వంపై కేసులు పెడతామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలను పెద్దవిగా చేసి ఒక అధికారి ఇలా ఎలా మాట్లాడతారనే అంశాన్ని లేవనెత్తి వివాదం చేయాలని సూచించారు. ఏపీ డేటాను చోరీ చేసి కప్పిపుచ్చుకునేందుకు దుష్ప్రచారం చేస్తున్నారనే వాదన జనంలోకి వెళ్లకపోతే ఇబ్బంది పడతామనే అభిప్రాయాన్ని పలువురు మంత్రులు వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదనను ఇంకా గట్టిగా తిప్పికొట్టాలని, ఆ పార్టీయే టీడీపీ ఓట్లు తొలగిస్తోందని ఎదురుదాడి చేయాలని చంద్రబాబు సూచించారు. తమ ఓట్లను వైఎస్సార్‌సీపీ పార్టీ తొలగించిందని, మంత్రులు, ఎమ్మెల్యేలు కలెక్టర్లు, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని, ప్రశాంత్ కిషోర్ బృందాలపై కేసులు పెట్టించాలని, సర్వేల పేరుతో వారే ఓట్లు తొలగిస్తున్నారని ప్రత్యారోపణలు చేయాలని చెప్పారు. మరోవైపు తెలంగాణతో ఉన్న విభేదాలను తెరపైకి తెచ్చి వాటిపై ఆరోపణలు గుప్పించాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. ఉమ్మడి ఆస్తుల విభజన, షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై కోర్టుకెళ్లే అంశాలను పరిశీలించి వెంటనే రంగంలోకి దిగాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై కోర్టుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.(‘రియల్ టైమ్’తో కాజేశారు)
తెలంగాణ పోలీసులను ఎదుర్కునేదెలా?
అదే సమయంలో తెలంగాణ పోలీసులు ఎటువంటి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఆపడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ డేటా చోరీకి సంబంధించిన విషయాలపై సాంకేతిక అంశాలను ఐటీ కార్యదర్శి విజయానంద్, ఆర్టీజీఎస్ సీఈఓ అహ్మద్‌బాబు తదితరులు మంత్రులకు వివరించారు. మంత్రివర్గ సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కాల్వ శ్రీనివాసులు ఐటీ గ్రిడ్స్ సంస్థకు, ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏమిటనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ఐటీ కార్యదర్శి విజయానంద్ మాత్రం ఆ కంపెనీ తమ సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment