
సాక్షి, అమరావతి: ఈఎస్‌ఐలో జరిగిన వ్యవహారంతో అచ్చెన్నాయుడుకి సంబంధం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. కేటాయింపుల్లో మంత్రి ఎక్కడా ఉండడని, అధికారులే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి చంద్రబాబు శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
► ఈఎస్‌ఐ కుంభకోణం కల్పితం. విజిలెన్స్ నివేదికలో ఎక్కడా అచ్చెన్నాయుడి పేరు లేదు. ఐఎంఎస్ డైరెక్టర్లు రవికుమార్, రమేశ్, విజయ్ పేర్లు మాత్రమే ఉన్నాయి. అచ్చెన్నాయుడు అరెస్టు దుర్మార్గం. ఇంట్లోకి వెళ్లి ఎత్తుకొస్తారా? భార్యకు చెప్పి వస్తానన్నా వినరా? ఆయన ఏమైనా టెర్రరిస్టా, డెకాయిటా? ఆయనకి రెండ్రోజుల కిందట పైల్స్ ఆపరేషన్ జరిగింది. ఓ ప్రజాప్రతినిధి పట్ల ప్రభుత్వం ప్రవర్తించిన తీరు గర్హనీయం.
► వర్చువల్ పోరాటాలు చేయండి. అచ్చెన్నాయుడికి మేమున్నాం అనే ఫ్లకార్డులను శనివారం అందరూ ప్రదర్శించి నిరసన తెలపాలి.
► ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలను లాక్కుంటారా? మా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తారా? దీని గురించి అన్ని ప్రతిపక్షాలు ఆలోచించాలి. ప్రధాన ప్రతిపక్షంపైనే ఇలా చేస్తుంటే మీ దాకా వస్తే ఏంటో చూసుకోండి.
► మీరు (ప్రభుత్వం) ఏం చేయలేరు.. నేను టెర్రరిస్టులకే భయపడలేదు.
అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారు
తమ పార్టీ నేత అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారనే వార్త తెలియగానే శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
► అచ్చెన్నాయుడిని మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదు. వారి కుటుంబ సభ్యులు, నేను ఫోన్‌లో కాంటాక్ట్ చేసినా ఫోన్ అందుబాటులో లేకుండా చేశారు.
► ఇది జగన్ అరాచకం, ఉన్మాదం తప్ప మరేమీ కాదు. మోసాలు, అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో వస్తున్న అసంతృప్తి ఫ్రస్ట్రేషన్‌గా మారి ఇలా ఉన్మాద చర్యలకు ఒడిగడుతున్నారు.
అవినీతి అంకానికి కులం ముసుగు.. బాబు తీరుపై సర్వత్రా విస్మయం
సాక్షి, అమరావతి: ఈఎస్‌ఐ ఆస్పత్రులకు మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల కుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పాత్రపై ఆ పార్టీ మౌనం పాటించడం, తన హయాంలో రూ.150 కోట్లకుపైగా ప్రజాధనం స్వాహాపై చంద్రబాబు స్పందించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అవినీతి కేసులో అరెస్టు వ్యవహారాన్ని చంద్రబాబు కిడ్నాప్‌గా అభివర్ణించడంపై అంతా విస్తుపోతున్నారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన విషయాన్ని ధృవీకరిస్తూ పోలీసులు ఆయన కుటుంబానికి లేఖ ఇచ్చినా కిడ్నాప్‌గా పేర్కొనటంపై పార్టీ నేతల్లోనే అసహనం వ్యక్తమవుతోంది.
కుల రాజకీయాలతో గట్టెక్కే యత్నాలు..
ఈఎస్‌ఐ కుంభకోణం గురించి నోరెత్తకుండా అందులో మంత్రి పాత్ర లేదని, జరిగిన దానికి ఆయన జవాబుదారీ కాదని పేర్కొనడం ద్వారా అక్రమాలు చోటుచేసుకున్నట్లు తామే ఒప్పకున్నట్లైందని కొందరు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. బీసీ నాయకుడిని అరెస్టు చేశారంటూ అవినీతి వ్యవహారానికి కులం రంగు పులమడానికి చంద్రబాబు, ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేశారు. బీసీలైతే అవినీతి చేయవచ్చా? అన్న ప్రశ్నకు ఆన్‌లైన్ మీడియా సమావేశంలో చంద్రబాబు జవాబు చెప్పలేదు. ఈ స్కాంలో అచ్చెన్నాయుడి పాత్ర గురించి నోరు మెదపకుండా అరెస్టుకు కులం రంగు పులిమి ఈ వ్యవహారం నుంచి గట్టెక్కేందుకు చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment