
చిత్తూరు, సాక్షి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కూడా తనకు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ తన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన అంగీకరించారు. కుప్పంలో గురువారం నిర్వహించిన 6వ విడత జన్మభూమి సభలో చంద్రబాబు మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా తాను చేసిన మంచి పనులకు ప్రజలు కూలి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని, తనను ఆశీర్వదించాలని కోరారు.
కుప్పం ప్రజలకు తాను అందుబాటులో ఉండనని, ఇక్కడ అభివృద్ధి కొంత మేర కుంటుపడటం వాస్తవమేనని అంగీకరించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందడం లేదని ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్నారు. తెలంగాణా సీఎం కేసీఆర్ తనను ఎంత తిట్టినా ప్రజల కోసం భరిస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉండకూడదనే దుర్భుద్ధితో కేసీఆర్ పని చేస్తున్నారని ఆరోపించారు. ఇది తనకు పరీక్షా సమయమని, ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరారు.
పెద్ద నోట్ల రద్దు పనికిమాలిన చర్య..
రాష్ట్రం, దేశం ప్రయోజనాల కోసమే తాను కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా మోదీ మొండిచెయ్యి చూపిస్తున్నారన్నారు. పెద్దనోట్ల రద్దు పనికిమాలిన చర్య అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment