
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ సీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారమిక్కడ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. కళంకిత సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలుస్తారని వ్యాఖ్యానించారు. ‘ప్రత్యేక హోదాపై పలుమార్లు యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మరోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకూ ఎంపీల రాజీనామాలకు సై అన్న బాబు నేడు నై అంటున్నారు. విచ్చలవిడి అవినీతి, కేసుల భయంతోనే చంద్రబాబు హోదాపై యూటర్న్ తీసుకున్నారు. ఎంపీల రాజీనామా అంటేనే చంద్రబాబుకు భయం పట్టుకుంది. దీంతో హోదా సాధనపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో తేలిపోయింది. ఎంపీల రాజీనామాలపై కలిసి రమ్మంటే వెనకడుగు ఎందుకు?. రాష్ట్రంలోని 25మంది ఎంపీలు ఏకతాటిపైకి వచ్చి రాజీనామా చేస్తే కేంద్రం దిగివచ్చేది కదా. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేస్తున్నాం అని కలరింగ్ ఇచ్చే మీరు, మీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయరో చంద్రబాబు చెప్పాలి.
బాబు ఓటుకు కోట్లు కేసు వల్ల భయపడుతున్నావా లేక పోలవరంలో మీ అవినీతి బయటపడుతుందన్న భయమా?. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఐదుకోట్ల మంది ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం సరికాదు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అన్ని రంగాలను అవినీతిమయం చేసిన చంద్రబాబు ఆ అవినీతిపై ఎక్కడ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తుందోనని బయపడుతున్నట్లు ఉన్నారు. రాష్ట్ర హక్కులను కేంద్రం వద్ద ఫణంగా పెట్టే అధికారాన్ని చంద్రబాబుకు ఎవరిచ్చారు?. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుపొందిన చంద్రబాబు..ముఖ్యమంత్రి పదవికి కళంకం తెచ్చారు. దేశంలోనే కళంకిత సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. అందర్నీ ఆర్థిక నేరస్తులు అంటున్న ఆయన తనపై ఉన్న అభియోగాలపై సీబీఐ విచారణ చేయించుకునే దమ్ముందా?.’ అని నిలదీశారు.
వైఎస్ జగన్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి....
కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిపై బీవై రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. ‘వైఎస్ జగన్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి, గోడ దూకిన నువ్వు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావ్. కనీస రాజకీయ పరిజ్ఞానం లేని నువ్వ ఎమ్మెల్యేగా ఎలా అర్హుడివో చెప్పాలి. పార్టీ మారి ప్రజాస్వామ్యంలో జీవచ్చవాలుగా మారిన మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.
ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైఎస్ జగన్ అవిశ్రాంత పోరాటం చేస్తున్నది కళ్లకు కనిపించడం లేదా?. చంద్రబాబు మెప్పు కోసం విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అభివృద్ధి పేరుతో పార్టీ మారిన అవినీతి సొమ్ముతో మీరు ఎంత అభివృద్ధి చెందారో అందరికీ తెలుసు. అతి త్వరలో మీ అవినీతిపై మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. హోదాపై మీ ముఖ్యమంత్రికే మొహం చెల్లడం లేదు. మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి. దమ్ము, సిగ్గు, శరం ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.’ అని డిమాండ్ చేశారు.