సాక్షి, అమరావతి : చంద్రబాబు అమరావతి పర్యటనకు తరలించిన జనమంతా డబ్బులిచ్చి తరలించిన వారేనంటూ ఆ పార్టీ నేతలు స్వయంగా చంద్రబాబుకు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాజధాని పర్యటనలో తన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి చంద్రబాబు గురువారం బస్సులో బయల్దేరారు. ‘కార్యకర్తలకు టిఫిన్లు పెట్టారా?’ అంటూ బస్సులో తన ఎదురుగా ఉన్న ఒక టీడీపీ నేతను చంద్రబాబు ప్రశ్నించారు. ‘అంతా డబ్బులే’ అని ఆ నాయకుడు సమాధానమిచ్చారు.
డబ్బులు ఇవ్వకుండా ఎవరు వస్తున్నారు అని ఆ నాయకుడు పేర్కొనగా.. ‘అంతా పెయిడ్ ఆర్టిస్ట్‌లేగా’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత చంద్రబాబు ప్రతీ విషయంలో పెయిడ్ ఆర్టిస్ట్‌లను రంగంలోకి దింపి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తూ అభాసుపాలవుతున్న సంగతి తెలిసిందే.
చదవండి: రాజధానిలో రక్తికట్టని వీధి నాటకం
రాజధానిలో ఒక్క నిర్మాణమైనా పూర్తి చేశావా?
మరోవైపు చంద్రబాబు పర్యటనను రైతులు, కూలీలు, దళితులు అడుగడుగునా అడ్డుకున్నారు. నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. బంగారంలా పండే తమ భూముల్ని లాక్కుని నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారని నిలదీశారు. రాజధాని పేరుతో దగా చేశారని, బలవంతంగా భూములు తీసుకుని రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏడాదికి మూడు పంటలు పండే భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిస్తే వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు’ అంటూ దారిపొడవునా రైతులు ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నాలుగేళ్లలో అద్భుతాలు చేస్తానని మాయ మాటలతో మభ్యపెట్టి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాజధానిలో పర్యటిస్తారని చంద్రబాబును నిలదీశారు.
తమకు పంపిణీ చేసిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చూపించాకే రాజధాని ప్రాంతంలో పర్యటించాలంటూ దారిపొడవునా నినదించారు. ‘బాబూ.. నీ వల్ల మా బతుకులు బుగ్గిపాలయ్యాయి. మాకు తీవ్ర ద్రోహం చేసిన చంద్రబాబు ఈ ప్రాంతంలో పర్యటించవద్దు’ అంటూ వెనక్కివెళ్లిపోవాలని ఆందోళనకు దిగారు. నాలుగేళ్లలో గ్రాఫిక్స్ పేరుతో కాలయాపన చేశారు తప్పితే వాస్తవంగా అమరావతిలో ఒక్క నిర్మాణమైనా పూర్తి చేశారా? అని ఆందోళనలో పాల్గొన్న రైతులు ప్రశ్నించారు.
‘ఈ ప్రాంతంలో ఏం నిర్మించావని చూడడానికి వస్తున్నారు? రాజధాని ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్న హామీని ఎందుకు అమలుచేయలేదు? గ్రామకంఠాల సమస్యను ఎందుకు పరిష్కరించలేదు? యువత ఉపాధి కోసం ఇస్తానన్న రూ. 25 లక్షల వడ్డీలేని రుణం హామీ ఏమైంది? రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్లు ఎక్కడున్నాయి? మూడేళ్లలో అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసి ఇస్తానన్న ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు?’ అని నిలదీశారు. జీవో 41తో అసైన్డ్ భూములను సాగుచేస్తున్న దళితులకు అన్యాయం చేశారని, పట్టా భూములకు ఒక ప్యాకేజీ.. దళితుల అసైన్డ్ భూములకు మరో ప్యాకేజీ ఎందుకు ఇచ్చారని పలువురు దళిత రైతులు ప్రశ్నించారు. ‘చంద్రబాబు దళిత ద్రోహి. తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం, వారి ప్రయోజనాల కోసం రాజధానిపై రాజకీయాలు చేయొద్దు. మా జీవితాలతో ఆడుకోవద్దు’ అని చంద్రబాబు కాన్వాయ్ వెళ్లిన ప్రతిచోట దారిపొడవునా నిలబడి ఆందోళన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment