మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం (ఫైల్)
సాక్షి, చెన్నై: మూర్ఖ ప్రభుత్వాలే దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను బయటపెడతాయని, మోదీ ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం నిప్పులు చెరిగారు. ‘ఉపగ్రహాలను కూల్చే సత్తాను భారత్ చాలా రోజుల క్రితమే సంపాదించింది. తెలివైన ప్రభుత్వాలు ఇలాంటి విషయాలను బయటపెట్టవు. కానీ వెర్రి ప్రభుత్వాలు మాత్రమే దేశ రక్షణకు సంబంధించిన ఇటువంటి అంశాలను బహిర్గతం చేసి, ద్రోహానికి పాల్పడుతాయి’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతరిక్షంలో ఉపగ్రహాలను కూల్చివేసే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి(ఏశాట్)ని గురువారం భారత శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించిన సంగతి విదితమే. ఈ విజయంతో ఏశాట్ సాంకేతికత కలిగిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ నిలిచింది. ఈ ప్రయోగానికి ‘మిషన్ శక్తి’ అని నామకరణం చేశారు.
‘మిషన్ శక్తి ప్రయోగాన్ని ఇప్పుడే ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నందున, లాభపడాలనే దుర్బుద్ధితోనే బీజేపీ ఈ ఎత్తుగడ వేసింద’ని మోదీని చిదంబరం విమర్శించారు. ఎన్నికల పోలింగ్‌కు తక్కువ సమయం ఉండటంతో మిషన్ శక్తి గురించి మోదీ చేసిన ప్రసంగాన్ని, కోడ్ ఉల్లంఘనగా చెప్తూ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎన్నికల కమిషన్ దర్యాప్తునకు ఆదేశిస్తూ, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని వేసింది.
Comments
Please login to add a commentAdd a comment