
సాక్షి, రాయచోటి: మాజీమంత్రి నారా లోకేష్ కంటే టీడీపీ ఆఫీస్ బాయ్‌లకే ఎక్కువ జ్ఞానం ఉంటే వారితోనైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో కుప్పం ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ అందిన సంక్షేమ ఫలాల మీద చర్చకు రావాల్సిందిగా చంద్రబాబు, లేదా ఆయన కొడుకుని కుప్పం రావాల్సిందిగా నేను కోరాను. ఇందుకు సమాధానంగా బోండా ఉమ తమ తరఫు నుంచి టీడీపీ ఆఫీసు బాయ్‌లను పంపుతాం అన్నారు. ఆఫీసు బాయ్‌లైనా, రోజు కూలీలైనా మరెవరైనా వారందరి మీదా మాకు గౌరవం ఉంది. (‘చర్చకు బాబు రాకుంటే లోకేష్ను పంపండి’)
డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను గౌరవించే వ్యక్తులం. నేను మరోసారి చంద్రబాబును అడుగుతున్నాను. ఆయన ఐదేళ్ళ పాలనకన్నా.. మా ఏడాది పాలనలో పేదలకు, రైతులకు, మహిళలకు, అన్ని సామాజిక వర్గాలకు మెరుగైన న్యాయం జరిగిందని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మీరు కుప్పం రమ్మంటే వస్తా. లేదంటే మీ వాడు ఓడిన మంగళగిరిలో అయినా మీ తనయుడితో చర్చకు వస్తా. ప్రభుత్వ చీఫ్ విప్‌ని అయినా.. ఒక సామాన్యుడ్ని కాబట్టి ఎమ్మెల్యేగా ఓడిన మీ తనయుడితో కూడా చర్చకు రావటానికి నేను సిద్ధంగా ఉన్నాను. విషయం మీద అవగాహన, నారా లోకేష్ కంటే మీ ఆఫీసు బాయ్‌లకే ఎక్కువ ఉందని మీరు ప్రకటిస్తే.. వారితోనైనా చర్చకు నేను సిద్ధం’ అని స్పష్టం చేశారు. (మై డియర్ పప్పూ అండ్ తుప్పూ!)
Comments
Please login to add a commentAdd a comment