చిరంజీవి, పవన్ కళ్యాణ్ (ఫైల్)
బొమ్మనహళ్లి: వచ్చే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో వివిధ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రముఖ సినిమా నటులతో ప్రచారం చేయించి ఓట్లు దండుకో వాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామి వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమకు మద్దతుగా తెలుగు హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారని మీడియాకు ఇదివరకే ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ పెద్దలు సైతం తెలుగు మెగాస్టార్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరంజీవితో ప్రచారం చేయించాలని పథకాలు వేస్తోంది. సీఎం సిద్ధరామయ్య ఈ బాధ్యతలను మాజీ మంత్రి, కన్నడ రెబల్‌స్టార్ అంబరీష్‌కు అప్పజెప్పినట్లు తెలుస్తుంది. తాను చిరంజీవిని తీసుకుని వచ్చి ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తానని సీఎంకి అంబి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
హంగూ ఆర్భాటం
పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ రెండు పార్టీలకు మద్దతుగా ప్రచారం చేస్తే ఎలా ఉంటుందోనన్న ఉత్సుకత నెలకొంది. ఈ ఇద్దరికి కర్ణాటకలో బెంగళూరుతో పాటు కోలారు, చిక్కబళ్ళాపురం, రాయచూరు, హైదరాబాద్ కర్ణాటక లాంటి ప్రాంతాల్లో అభిమానులు ఉన్నారు. వీరి ప్రచారం వల ఓట్లు పడినా పడకపోయినా తమ ప్రచారానికి హంగు ఆర్భాటం వస్తుందని కూడా పార్టీలు ఉత్సాహంగా ఉన్నాయి. 2013 శాసనసభ ఎన్నికల్లో చిరంజీవి బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment