సాక్షి, చెన్నై : అటు అభిమానులను, ఇటు సినిమా రంగాన్ని కుదిపేస్తున్న.. నటుడు పవన్ కల్యాణ్, సినీ విమర్శకుడు కత్తి మహేష్ మధ్య వివాదం ఇంకెంత కాలం సాగుతుంది? ఈ వివాదానికి తక్షణం ముగింపు పలకాలని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరుతున్నారు. వీరిద్దరి మధ్య వివాదానికి తెరపడాలంటే ఈ వ్యవహారంలో చిరంజీవి జోక్యం చేసుకోవాలని ఆయన సూచించారు.
చిరంజీవి పట్ల గతంలో సినీ నటుడు రాజశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇలాగే అభిమానులు దాడులకు దిగడం, ఆ సందర్భంలో పెద్ద మనసుతో రాజశేఖర్ ఇంటికెళ్లి పరామర్శించి ఒక మంచి సంస్కృతిని నెలకొల్పారాని ఆయన గుర్తు చేశారు. అదే తరహాలో పవన్ కల్యాణ్ - కత్తి మహేష్ ల వ్యవహారంలో కూడా ఒక పెద్ద మనిషిగా వివాదానికి తెరపడేలా ప్రయత్నించాలని సూచించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని పేర్కొంటూనే ఇలాంటి విషయాలను రాజకీయాలతో ముడిపెట్టకుండా విజ్ఞతతో వ్యవహరించాలని ఈ విషయాలను పవన్ కల్యాణ్ అభిమానులు గ్రహించాలని పేర్కొన్నారు. రాజకీయాలు వేరన్న విషయం పవన్ కల్యాణ్ అభిమానులు గ్రహించి ఆ నాయకుడికి మంచి పేరు తెచ్చిపెట్టేలా సమాజసేవలో నిమగ్నం కావాలని పవన్ అభిమానులను కేతిరెడ్డి కోరారు.
కత్తి మహేష్ - పవన్ కల్యాణ్ అభిమానుల గొడవల కారణంగా ప్రజల్లో మీ కుటుంబం పట్ల ఉన్న గౌరవం సన్నగిల్లుతుందని, గోరుతో పొయ్యేదాన్ని గొడ్డలి వరకు తీసుకురావడం సమంజసం కాదని, మిమ్మల్ని అభిమానించే వారందరికీ బాధ కలిగిస్తుందని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవి కుటుంబాన్ని కొందరు పొగడుతూ, మరికొందరు దూషిస్తూ గౌరవాన్ని రోడ్డునకు ఈడ్చటం, దూషణలు చేయడం వంటి చెడు సంస్కృతి ఇరు వర్గాలకు మంచిది కాదన్నారు. సంక్రాంతి పండుగ వేళ చిరంజీవి జోక్యం చేసుకుని పవన్ కల్యాణ్ - కత్తి మహేష్ ల మధ్య తలెత్తిన వివాదానికి తెరపడేలా చేసి పండుగ సందర్భంగా సామాన్య పరిస్థితులు ఏర్పడేలా చిరంజీవి కృషి చేయాలని కేతిరెడ్డి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment