kethireddy jagadeeshwarreddy
-
సరిహద్దుల్లోని క్లబ్బులను మూసేయాలి: కేతిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలైన ఛతీస్‌గఢ్, భద్రాచలం దగ్గరలోని కుంట్ల, పుదుచ్చేరిలోని యానాంలో రిక్రియేషన్ క్లబ్బులను మూసేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో విపరీతంగా కొనసాగిన జూద క్లబ్బులను రిక్రియేషన్‌లో భాగంగా ఇప్పటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే మూసివేశాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దులో ఉండి.. తెలుగు రాష్ట్రాల ప్రజలను దోచుకుంటున్న ఈ క్లబులను వెంటనే మూసివేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రులను, హోం శాఖామాత్యులను కలిసి విన్నవించామన్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని క్లబ్బులను గతంలో మూసివేశారని, యానాంలోనూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న క్లబ్బులపై కలెక్టర్ దాడి చేసి సొసైటీని రద్దు చేసి సీజ్ చేశారని తెలిపారు. చెన్నై నగరంలో రిక్రియేషన్ పేరుతో నడిచే పేకట క్లబ్ ల గురించి కూడా త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దృష్టికి తీసుకెళతామన్నారు. -
సినిమా: ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయాలు తగవు
‘సినిమా టిక్కెట్ల ధరలు, తినుబండారాల ధరల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే.. పేదవారికి వినోదం భారం కాకూడదనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిగారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాజకీయాలు తగవు’ అని ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ‘‘సినిమా టిక్కెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచడం, తినుబండారాలను అధిక ధరలకు విక్రయించడం వల్ల పేదలకు వినోదం భారమవుతోంది. ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగానే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. రోజు మొత్తం సినిమాలను ప్రదర్శించే విధానానికి అడ్డుకట్ట వేయడం మంచి నిర్ణయం. ప్రభుత్వ నిబంధనలు ఏ ఒక్క సినిమాకో కాకుండా అన్నిటికీ వర్తిస్తాయని స్పష్టంగా పేర్కొన్నారు. దాన్ని రాజకీయ నిర్ణయంగా పరిగణించడం ఆ యా పార్టీ నాయకుల అజ్ఞానానికి నిదర్శనం’’ అని కేతిరెడ్డి పేర్కొన్నారు. -
‘ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయండి’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అఫ్ ఏపీ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. ఇందు కోసం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ఒక కమిటీ వేయాలన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక లేఖలో తెలిపారు. సినిమా పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా స్టూడియో నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌లో స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నిర్మాతలు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్‌లు, డబ్బింగ్‌లు, రీ రికార్డింగ్‌లు, విజువల్ ఎఫెక్టులకు సంబంధించిన పనులు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. చిత్ర పరిశ్రమ విశాఖపట్నంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని తెలిపారు. (వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణలు) తక్కువ బడ్జెట్ సినిమాలు కనీసం 16 వారాలు థియేటర్లలో ప్రదర్శించే విధంగా జీఓ అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. చిన్న నిర్మాతలను ప్రోత్సహించడంలో భాగంగా 5వ షో వెంటనే థియేటర్లలో అమలు చేయాలని కోరారు. ఐదో షో మధ్యాహ్నం 12 గంటల తరువాత ఉండాలని చెప్పారు. సినిమా టికెట్ల విధానంలో అవినీతిని పోగొట్టటం కోసం ఆన్లైన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయలన్నారు. చిన్న సినిమాలు బతకటం కోసం మినీ థియేటర్లను గవర్నమెంట్ బస్‌స్టాండ్, మున్సిపల్ కాంప్లెక్స్‌ల్లో కనీసం 200 థియేటర్లు కట్టించే ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి సినిమా థియేటర్లో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నట్టు బెంచ్ టికెట్ల విధానాన్ని అమలు చేయాలన్నారు. ఇక పైరసీ చేసిన వారికి స్టేషన్ బెయిల్ కాకుండా నాన్ బెయిలబుల్ కేసు వర్తించేలా చట్టం తీసుకురావాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. -
పద్మశ్రీకి ఏక్తా అర్హురాలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర కుమార్తె, నిర్మాత ఏక్తా కపూర్‌కి ఇటీవల పద్మశ్రీ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఆమెకు అభినందనలు తెలియజేశారు దర్శక–నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. ‘‘ఈ అవార్డుకి ఏక్తా అర్హురాలు. చిన్న వయసులో పద్మశ్రీ పురస్కారం అందుకోవడానికి ఆమె పట్టుదల, క్రమశిక్షణే కారణం’’ అన్నారు కేతిరెడ్డి. ఆయన తీస్తున్న ‘శశి లలిత’ (జయలలిత బయోపిక్) చిత్రానికి ఆశీస్సుల కోసం షిరిడీ సందర్శించారు కేతిరెడ్డి. -
50 శాతం షూటింగ్‌లు ఆంధ్రాలో జరపాలి
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మోహన్‌రెడ్డికి పలు సమ స్యలను విజ్ఞప్తి చేశారు. కేతిరెడ్డి మాట్లాడుతూ –‘‘తమిళనాడులోని తెలుగు విద్యార్థుల సమస్యలను అక్కడి ప్రభుత్వంతో సమాలోచన జరిపి తెలుగువారి సమస్యలను తీర్చాలి. ఒక బృందాన్ని తమిళనాడు పంపి వారి సమస్యలు తెలుసుకోవాలి. అలాగే తెలుగు సినిమాల షూటింగ్ 50 శాతం వరకూ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విధంగా చర్యలు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్న నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అన్ని రకాల వసతులు కల్పించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. -
ప్రత్యేక హోదాకు స్టాలిన్ మద్దతు
సాక్షి, చెన్నై: ప్రత్యేక హోదాకు మద్దుతివ్వాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ఏపీ స్పెషల్ స్టేటస్ కో ఆర్డినేటర్ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి సోమవారం డీఎంకే కార్యనిర్వాహాక అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌ను కలిశారు. ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతుందని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. అభివృధ్దిలో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు చాలా వెనెకబడి ఉన్నాయని ఈ వివక్షకు వ్యకతిరేకంగా తాము చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని వారికి వినతిపత్రం అందజేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి హోదా సాధించి తీరుతామని దానిలో భాగంగానే దక్షిణాదిలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు, సినీ ప్రముఖుల మద్దతు కోరుతున్నామని కేతిరెడ్డి తెలిపారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే దక్షిణాది రాష్ట్రాల్లో గోడవలు సృష్టిస్తుందని, ప్రత్యేకహోదా ఉద్యమం, కావేరి జలాల వివాదం, కేరళలో హత్యలు, కర్ణాటకలో మత సంఘర్షణలు దీనిలో భాగమేనని ఆరోపించారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో జాతీయ పార్టీల ప్రాతినిధ్యం చాలా తక్కువ కాబట్టే దక్షణాదిపై వివక్ష అని ఆరోపించారు. కాగా ప్రత్యేక హోదాకు స్టాలిన్ మద్ధతు తెలిపారని, త్వరలో విశాఖలో నిర్వహించనున్న 'సాగర తీరన హోదా ఉద్యమ కెరటం' కార్యక్రమానికి స్టాలిన్ హాజరవుతారని తెలిపారు. ఏపీ ప్రత్యేక హోదాకి మద్దతు కోరుతు ఇటీవల పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామిని కలిసి ఏఐసీసీ సమావేశంలో తీర్మానం చేయమని కోరామని, తీర్మానం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి కేతిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
ప్రేక్షకుడిని, పరిశ్రమను కాపాడాలి
‘చిత్ర పరిశ్రమ సమస్యలపై ముఖ్యమంత్రులు స్పందించి ఓ కమిటీను నియమించాలి’ అని అన్నారు నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. ప్రస్తుతం సినిమా పరిశ్రమలోని సమస్యలన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ ద్వారా ఆయన కోరినట్టు పేర్కొన్నారు. ‘‘డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు నిర్మాతలకు జరుగుతున్న వివాదం వల్ల సినిమాను అభిమానించే వారికి ఇబ్బందిగా మారింది. సినిమా తప్పితే వారికి వేరే వినోదం లేదు. 4 ఆటలతో పాటుగా 5వ ప్రదర్శనగా చిన్న సినిమాలు ఆడించి, ట్యాక్స్ లేకుండా ఓ జీవో తీసుకువచ్చి చిన్న సినిమాలను, నిర్మాతలను బతికించాలి. మేం ఇచ్చిన కంటెంట్‌తోనే కోట్లు ఆర్జిస్తున్న డిజిటల్ సర్వీస్ వాళ్లు మా సినిమాలను ఫ్రీగా ప్రదర్శించాలి. యూఎఫ్ఓ, క్యూబ్ రెండు మోనోపోలి ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వమే థియేటర్స్‌లో ప్రొజెక్టర్స్ బదులు ప్రొజెక్టర్స్ సరఫరా ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పరేషన్ ఏర్పాటు చేయాలి. టికెట్ బుక్కింగ్స్కు అదనంగా చార్జీలు పడుతున్నాయి, దాని కోసం ప్రభుత్వమే ఒక కొత్త పోర్టల్ ఏర్పాటు చేసి అందులో కొంత భాగం నిర్మాతకు ఇవ్వాలి. ఈ సమస్యలన్ని ఆలోచించి ప్రేక్షకులని, నిర్మాతలను కాపాడటం కోసం ఏదో పరిష్కారం ఆలోచించాలి’’ అని లేఖలో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. -
తమిళానాడులో ఘనంగా కేసీఆర్ పుట్టిన రోజు..
సాక్షి, చెన్నై: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల విద్యార్థులతో కలిసి పల్లిపట్టులో కేక్ కట్ చేశారు. అంతేకాక సీఎం కేసీఆర్ పేరు మీద తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంతో పూజలు చేసి, భక్తులకు ప్రసాదాలు పంచారు. కేతిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమ నేత కేసీఆర్ తెలుగు వాడి సత్తాను ఢిల్లీకి తెలిపారు. ‘కేంద్రం దిగివచ్చే వరకు తన పోరాటం సాగించారు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కల అయినా ప్రత్యేక రాష్ట్రంను సాధించారు. తమిళనాడులో నివశించే తెలుగు వారు తెలంగాణ వీరుడు కేసీఆర్ పుట్టినరోజును జరపడం ఒక బాధ్యత. ఎందుకంటే ఆయనలో ఉద్యమస్పూర్తి, తమిళనాడులో తెలుగును సాధించుటకు నిరంతరం పోరాటం చేస్తున్న మనకు ఆదర్శం. అన్న నందమూరి తారక రామారావు తర్వాత ఇటీవల హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలను కేసీఆర్ నిర్వహించారు. తెలుగు వారు ఏ రాష్ట్రంలో ఉన్నా మనమంతా ఒక్కటే అనే భావన ప్రజల్లోకి తీసుకపోవాలని ’ కేతిరెడ్డి పిలుపునిచ్చారు. మారుమూల గ్రామమైనా పల్లిపట్టులో కేసీఆర్ పుట్టిన రోజు జరపడం చాలా సంతోషంగా ఉందని కేతిరెడ్డి అన్నారు. అంతేకాక ఆయన పట్ల తెలుగు వారి ప్రేమే ఇందుకు కారణమని కేతిరెడ్డి తెలిపారు. -
'కత్తి మహేష్ - పవన్ కల్యాణ్ వ్యవహారం లో చిరంజీవి జోక్యం'
సాక్షి, చెన్నై : అటు అభిమానులను, ఇటు సినిమా రంగాన్ని కుదిపేస్తున్న.. నటుడు పవన్ కల్యాణ్, సినీ విమర్శకుడు కత్తి మహేష్ మధ్య వివాదం ఇంకెంత కాలం సాగుతుంది? ఈ వివాదానికి తక్షణం ముగింపు పలకాలని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరుతున్నారు. వీరిద్దరి మధ్య వివాదానికి తెరపడాలంటే ఈ వ్యవహారంలో చిరంజీవి జోక్యం చేసుకోవాలని ఆయన సూచించారు. చిరంజీవి పట్ల గతంలో సినీ నటుడు రాజశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇలాగే అభిమానులు దాడులకు దిగడం, ఆ సందర్భంలో పెద్ద మనసుతో రాజశేఖర్ ఇంటికెళ్లి పరామర్శించి ఒక మంచి సంస్కృతిని నెలకొల్పారాని ఆయన గుర్తు చేశారు. అదే తరహాలో పవన్ కల్యాణ్ - కత్తి మహేష్ ల వ్యవహారంలో కూడా ఒక పెద్ద మనిషిగా వివాదానికి తెరపడేలా ప్రయత్నించాలని సూచించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని పేర్కొంటూనే ఇలాంటి విషయాలను రాజకీయాలతో ముడిపెట్టకుండా విజ్ఞతతో వ్యవహరించాలని ఈ విషయాలను పవన్ కల్యాణ్ అభిమానులు గ్రహించాలని పేర్కొన్నారు. రాజకీయాలు వేరన్న విషయం పవన్ కల్యాణ్ అభిమానులు గ్రహించి ఆ నాయకుడికి మంచి పేరు తెచ్చిపెట్టేలా సమాజసేవలో నిమగ్నం కావాలని పవన్ అభిమానులను కేతిరెడ్డి కోరారు. కత్తి మహేష్ - పవన్ కల్యాణ్ అభిమానుల గొడవల కారణంగా ప్రజల్లో మీ కుటుంబం పట్ల ఉన్న గౌరవం సన్నగిల్లుతుందని, గోరుతో పొయ్యేదాన్ని గొడ్డలి వరకు తీసుకురావడం సమంజసం కాదని, మిమ్మల్ని అభిమానించే వారందరికీ బాధ కలిగిస్తుందని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవి కుటుంబాన్ని కొందరు పొగడుతూ, మరికొందరు దూషిస్తూ గౌరవాన్ని రోడ్డునకు ఈడ్చటం, దూషణలు చేయడం వంటి చెడు సంస్కృతి ఇరు వర్గాలకు మంచిది కాదన్నారు. సంక్రాంతి పండుగ వేళ చిరంజీవి జోక్యం చేసుకుని పవన్ కల్యాణ్ - కత్తి మహేష్ ల మధ్య తలెత్తిన వివాదానికి తెరపడేలా చేసి పండుగ సందర్భంగా సామాన్య పరిస్థితులు ఏర్పడేలా చిరంజీవి కృషి చేయాలని కేతిరెడ్డి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జయ, శశికళల కథతో ‘శశిలలిత’
దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మరో వివాదాస్పద చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న శశికళ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. శశిలలిత పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా విశేషాలను మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టుగా వెల్లడించారు. శశికళ.. జయలలితకు సేవకురాలిగా ఆమె జీవితంలోకి ప్రవేశించి రాజ్యాంగేతర శక్తిగా ఎలా ఎదిగారన్న ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందించనున్నట్టుగా తెలిపారు. యాదార్ధ సంఘటనల ఆధారాలతో నిర్మిస్తున్న ఈ సినిమాలో శశికళ, జయలలిత జీవితంలో ప్రవేశించిన దగ్గర నుంచి జయలలిత హాస్పిటల్ లో జరిగిన ప్రతి సంఘటనను ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగిన ప్రతి సంఘటన ఈ చిత్రం లో తెరకెక్కిస్తానని చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. అయితే కొందరు అనుకున్నట్టు శశికళ జీవితం ఆధారంగా సినిమా తీస్తే తమిళనాడుకు చెందిన శశికళ వర్గం అయిన మన్నర్ కుడి మాఫియా నా అంతుచూస్తారని బెదిరిస్తున్నారు అన్నారు. గతంలో జయలలిత బ్రతికుండగానే జయలలిత ను తెలుగు భాష కు తమిళనాడు లో జరుగుతున్న అన్నాయం పై ఎదిరించటం జరిగిందని, అప్పుడే తనను ఏ శక్తి ఏమీ చేయలేక పోయిందన్నారు. జయలలిత మరణం వెనుక కుట్ర ఉందని శశికళ పై సుప్రీంకోర్టు లో కేసు వేసిన నాడే తనను ఏమీ చేయలేదని , ఒక లక్ష్యం తో పనిచేసే వారిని ఏ శక్తి అడ్డుకోలేదని కేతిరెడ్డి తెలిపారు . త్వరలోనే శశికళ, జయలలిత పాత్రలకు నటీమణుల ఎంపిక చేసి ప్రకటిస్తానని తెలిపారు. -
‘మత్తు’ దిగుతుందా?
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ భూతాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. డ్రగ్స్‌తో సంబంధం ఉండి తప్పించుకు తిరుగుతున్న కొందరు సినీ ప్రముఖులకు ముచ్చమటలు పడుతున్నాయని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో పారదర్శకత లేదని, బృందంపై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని కేతిరెడ్డి ఆరోపించారు. సినీ ప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో ఉంటే వారిని బాధితులుగానే చూస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమీక్షలో అనడంతో ఈ కేసు నీరు గారిపోయిందని పేర్కొన్నారు. పలుకుబడి కలిగిన వారు డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నందున ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. అందుకే తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై సిట్ జరుపుతున్న దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నట్టు కేతిరెడ్డి స్పష్టం చేశారు. చాలా మంది విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలయ్యారని, ఇలాంటి పరిస్థితుల్లో కేసును తీవ్రంగా పరిగణించాల్సిందని పేర్కొన్నారు. పరిశ్రమకు చెందిన బడా నిర్మాతల పిల్లలు, హీరోలకు డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం ఉన్నా డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మరికొందరిని మాత్రమే విచారించడంపై ప్రజలు చర్చించుకుంటున్నారని కేతిరెడ్డి అన్నారు. అత్యున్నత న్యాయస్థానం సీబీఐతో విచాణకు ఆదేశిస్తే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లలో ప్రముఖులుగా చలామణి అవుతున్న చాలా మంది అసలు రంగు బయట పడుతుందని కేతిరెడ్డి అన్నారు. వీఐపీలు అంటే ప్రజలకు మంచి చేయాలని చూడాలే కానీ, చెడు చేయాలని చూసేవారు వీఐపీలు ఎలా అవుతారని మండిపడ్డారు. సినీరంగంలో పేరున్న వారు డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు వస్తే దాక్కోవడం కాకుండా నిర్భయంగా బయటకు వచ్చి డ్రగ్స్ టెస్టులు చేయించుకుని ఉంటే ప్రజల్లో అనుమానాలు నివృత్తి అయ్యేవన్నారు. అలా కాకుండా తమకున్న పలుకుబడితో ఈ కేసు నుంచి తప్పించుకోవడమే కాకుండా, ఏకంగా డ్రగ్స్ కేసునే నీరుగార్చేందుకు పావులు కదుపుతున్నారని కేతిరెడ్డి ధ్వజమెత్తారు. డ్రగ్స్ వ్యవహారంలో తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా చట్టం ముందు సమానమని త్వరలో తేలనుందన్నారు. డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్నట్టు తేలితే వారిని దేశ ద్రోహులుగా పరిగణించాలన్నారు. 'దేశంలో ఎక్కడైనా రూ.10 కోట్ల కన్నా ఎక్కువ విలువ చేసే డ్రగ్స్‌ను పట్టుకున్నప్పుడు, ఆ కేసుల్లో విదేశీయులు, పలుకుబడి కలిగిన ప్రముఖ వ్యక్తుల ప్రమేయం ఉన్నప్పుడు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలి. డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో గిరిజనులు బతుకు తెరువు కోసం గంజాయి పండిస్తున్నారు. వీరికి ప్రత్యామ్నాయాలు కల్పిస్తే గంజాయి సాగుకు అడ్డుకట్టపడుతుంది. సినిమాలు, టీవీలు, ఇంటర్నెట్లో డ్రగ్స్ వాడకం, సరఫరాను ఎక్కువ చేసి చూపకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న పబ్స్, స్వామీజీల ఆశ్రమాలపై కూడా నిఘా పెట్టాలి. దేశ వ్యాప్తంగా రోజుకు పది మంది ఈ డ్రగ్స్ వాడకం వల్ల చనిపోతున్నారు. సినిమా రంగానికి చెందిన వారిని అభిమానులు అనుకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి చలన చిత్రం పరిశ్రమలో డ్రగ్స్ మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ అమ్మేవాళ్లు జైలుకు వెళ్లినా సరే కొత్త అమ్మకందారులు పుట్టుకొని వస్తారు. కాబట్టి ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో వారిపై తల్లిదండ్రులు, ప్రభుత్వం కఠినంగా వ్యవహిరిస్తే తప్పితే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు' అని కేతిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. డ్రగ్స్ కేసులో కేసీఆర్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. కాగా, సెప్టెంబర్ 18న పిటిషనర్ తరఫున న్యాయవాది కె.శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు 2014లో బచ్పన్ బచావో ఆందోళన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన ఆదేశాలను కేంద్రం అమలుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ కారణంగా 25 వేల మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని, డ్రగ్స్‌ను అరికట్టేందుకు తగిన విధానం రూపొందించి అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కేంద్రం చర్యలు తీసుకోలేదని వివరించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, గోవా, పుదుచ్చేరి, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్ కారణంగా ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ 2014లో దేశంలో ఐదో స్థానంలో నిలిచిందని, ఆంధ్రప్రదేశ్ 2015లో ఐదో స్థానంలో నిలిచిందని వివరించారు. తెలంగాణలో వందలాది మంది చిన్నారులు, సినీ ప్రముఖులు డ్రగ్స్ బారిన పడ్డారని, ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసు విభాగం దర్యాప్తు కూడా జరుపుతోందని వివరించారు. ఈ మేరకు సుప్రీం ఆదేశాల అమలు, ఇతర అంశాలపై కేంద్రం తీసుకున్న చర్యలేవో చెప్పాలని ఆదేశిస్తూ నవంబర్ 20కి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. (తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఫైల్ ఫొటో) -
'అమ్మ' మృతికి కారణాలు నిగ్గుతేలాలి
చిత్తూరు : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించడంపై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం పళనిస్వామి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని తమిళనాడు ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. జయలలిత మృతిపై న్యాయవిచారణకు ఆదేశించినందుకు ఆయన శనివారం తిరుమలలో మొక్కులు సమర్పించారు. వెంకన్న స్వామి కరుణించినందువల్లే విచారణ ప్రారంభం కానుందని, అమ్మ మృతికి కారణాలు నిగ్గుతేలాలని ఆకాంక్షించారు. గతంలో జయ మరణంపై సీబీఐ విచారణ చేపట్టాలని చెన్నై నుంచి తిరుమల వరకు ర్యాలీ నిర్వహించి వెంకటేశ్వర స్వామికి వినతిపత్రం సమర్పించారు. జయలలిత నివాసమైన వేద నిలయంను ఆమె స్మృతి నిలయంగా నిర్ణయించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. జయలలిత మృతిపై ప్రధాని నరేంద్ర మోదీని గతంలో కలిసి సీబీఐ విచారణ కోసం విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. జయ మృతిపై గతంలో సీఎంగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం ఎలాంటి విచారణకు మొగ్గుచూపలేదని, పదవికి రాజీనామా చేసిన తర్వాత జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారని విమర్శించారు. దాంతో అమ్మ వీరవిధేయుడే ఆమె మృతిపై నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో అన్నాడీఎంకేపై ప్రజలు నమ్మకం కోల్పోయినట్లు కేతిరెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ మద్ధతుతోనే జయలలిత మరణంపై నెలకొన్న సందేహాలపై విచారణ జరపడానికి రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారన్నారు. అందుకు కారణమైన ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 70 రోజులకు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 5న హఠాత్తుగా జయ మృతి చెందగా, దీని వెనుక ఆమె సన్నిహితురాలు శశికళ కుట్ర జరిపి ఉండొచ్చన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జయకు ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించి, వీఐపీలను కలవనీయకపోవడం, అక్కడ సీసీటీవీలు లేకపోవడంపై ఆమె మృతిపై సందేహాలున్నాయని సీబీఐ విచారణ జరిపించాలని అదే నెల 14న సుప్రీంకోర్టులో కేతిరెడ్డి మొట్టమొదటిసారిగా పిటిషన్ దాఖలు చేశారు. ఆమె మృతిపై నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వంపై ఉన్నదని పేర్కొంటూ.. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో గతంలో ఆయన ధర్నా చేపట్టారు. సీబీఐ విచారణ కోసం మద్ధతు తెలపాలని కోరుతూ ఎంపీలందరికీ వినతిపత్రాలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో జయపై విష ప్రయోగం జరగడంపై, పోయెస్ గార్డెన్లో అమ్మపై కుట్రలు జరిగాయని పిటిషన్లో పేర్కొన్నారు. విష ప్రయోగం తర్వాత శశికళను జయ పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లగొట్టడం.. ఆపై కొన్ని రోజుల తర్వాత పథకం ప్రకారం పోయెస్ గార్డెన్లో శశికళ అడుగుపెట్టారని ఆరోపణలున్నాయి. జయలలిత జైలులో ఉండగా అన్నాడీఎంకే నేత నామినేషన్ పత్రాలపై వేసిన వేలిముద్రలు అమ్మవి కాదని, శశికళవని ఆయన పేర్కొన్నారు. అన్నాడీఎంకే అమ్మ శిబిరం ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకం చెల్లదంటూ ఇటీవల సీఎం పళనిస్వామి శిబిరం తేల్చడం, మరోవైపు అమ్మ మృతిపై రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించడంతో పార్టీ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. జగధీశ్వర రెడ్డితో పాటూ ఈ కార్యక్రమంలో డి. శివశంకర్ రెడ్డి, పి. నాగేశ్వర్ రావు, వర్ధన్, ఎస్. వెంకటేశ్వరరావు తదితరులతో పాటూ తిరుపతికి చెందిన యువకులు పాల్గొన్నారు. -
ఇది తెలుగు జాతికి ఇచ్చిన పురస్కారం
హైదరాబాద్ : కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, దర్శకుడు కె. విశ్వనాథ్‌ను హైదరాబాద్‌లో కలిసి సత్కరించారు. చలన చిత్ర పరిశ్రమలో 6 దశాబ్దాలుగా ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించి, క్రమశిక్షణకు మారుపేరు అయిన విశ్వనాథ్‌ని కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేయడం ప్రతి తెలుగువారు గర్వంగా భావిస్తున్నారని కేతిరెడ్డి అన్నారు. ఈ అవార్డు తెలుగు జాతికి వచ్చిన అవార్డుగా ఆయన అభివర్ణించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను తన సినిమాల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన కళాతపస్వికి గతంలో ఎన్నో పురస్కారాలు దక్కాయని కేతిరెడ్డి అన్నారు. ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఇవ్వడం తెలుగు వారందరికి దక్కిన గౌరవమని తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు మాత్రమే కాకుండా కుటుంబ విలువలు, మంచి సందేశాలు ఆయన చిత్రాల్లో ఉంటాయన్నారు. స్వయం కృషి, శుభలేఖ, జీవనజ్యోతి, సిరిసిరిమువ్వ, చిన్ననాటి స్నేహితులు లాంటి ఎన్నో చిత్రాలు అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన కళాతపస్వి విశ్వనాథ్ భూమి, ఆకాశం ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలిపారు.