హైదరాబాద్:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ భూతాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. డ్రగ్స్‌తో సంబంధం ఉండి తప్పించుకు తిరుగుతున్న కొందరు సినీ ప్రముఖులకు ముచ్చమటలు పడుతున్నాయని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో పారదర్శకత లేదని, బృందంపై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని కేతిరెడ్డి ఆరోపించారు. సినీ ప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో ఉంటే వారిని బాధితులుగానే చూస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమీక్షలో అనడంతో ఈ కేసు నీరు గారిపోయిందని పేర్కొన్నారు.
పలుకుబడి కలిగిన వారు డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నందున ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. అందుకే తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై సిట్ జరుపుతున్న దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నట్టు కేతిరెడ్డి స్పష్టం చేశారు. చాలా మంది విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలయ్యారని, ఇలాంటి పరిస్థితుల్లో కేసును తీవ్రంగా పరిగణించాల్సిందని పేర్కొన్నారు. పరిశ్రమకు చెందిన బడా నిర్మాతల పిల్లలు, హీరోలకు డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం ఉన్నా డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మరికొందరిని మాత్రమే విచారించడంపై ప్రజలు చర్చించుకుంటున్నారని కేతిరెడ్డి అన్నారు.
అత్యున్నత న్యాయస్థానం సీబీఐతో విచాణకు ఆదేశిస్తే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లలో ప్రముఖులుగా చలామణి అవుతున్న చాలా మంది అసలు రంగు బయట పడుతుందని కేతిరెడ్డి అన్నారు. వీఐపీలు అంటే ప్రజలకు మంచి చేయాలని చూడాలే కానీ, చెడు చేయాలని చూసేవారు వీఐపీలు ఎలా అవుతారని మండిపడ్డారు. సినీరంగంలో పేరున్న వారు డ్రగ్స్ వాడినట్టు ఆరోపణలు వస్తే దాక్కోవడం కాకుండా నిర్భయంగా బయటకు వచ్చి డ్రగ్స్ టెస్టులు చేయించుకుని ఉంటే ప్రజల్లో అనుమానాలు నివృత్తి అయ్యేవన్నారు. అలా కాకుండా తమకున్న పలుకుబడితో ఈ కేసు నుంచి తప్పించుకోవడమే కాకుండా, ఏకంగా డ్రగ్స్ కేసునే నీరుగార్చేందుకు పావులు కదుపుతున్నారని కేతిరెడ్డి ధ్వజమెత్తారు. డ్రగ్స్ వ్యవహారంలో తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా చట్టం ముందు సమానమని త్వరలో తేలనుందన్నారు. డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్నట్టు తేలితే వారిని దేశ ద్రోహులుగా పరిగణించాలన్నారు.
'దేశంలో ఎక్కడైనా రూ.10 కోట్ల కన్నా ఎక్కువ విలువ చేసే డ్రగ్స్‌ను పట్టుకున్నప్పుడు, ఆ కేసుల్లో విదేశీయులు, పలుకుబడి కలిగిన ప్రముఖ వ్యక్తుల ప్రమేయం ఉన్నప్పుడు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలి. డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో గిరిజనులు బతుకు తెరువు కోసం గంజాయి పండిస్తున్నారు. వీరికి ప్రత్యామ్నాయాలు కల్పిస్తే గంజాయి సాగుకు అడ్డుకట్టపడుతుంది. సినిమాలు, టీవీలు, ఇంటర్‌నెట్‌లో డ్రగ్స్ వాడకం, సరఫరాను ఎక్కువ చేసి చూపకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న పబ్స్, స్వామీజీల ఆశ్రమాలపై కూడా నిఘా పెట్టాలి. దేశ వ్యాప్తంగా రోజుకు పది మంది ఈ డ్రగ్స్ వాడకం వల్ల చనిపోతున్నారు. సినిమా రంగానికి చెందిన వారిని అభిమానులు అనుకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి చలన చిత్రం పరిశ్రమలో డ్రగ్స్ మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ అమ్మేవాళ్లు జైలుకు వెళ్లినా సరే కొత్త అమ్మకందారులు పుట్టుకొని వస్తారు. కాబట్టి ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో వారిపై తల్లిదండ్రులు, ప్రభుత్వం కఠినంగా వ్యవహిరిస్తే తప్పితే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు' అని కేతిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. డ్రగ్స్ కేసులో కేసీఆర్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు.
కాగా, సెప్టెంబర్ 18న పిటిషనర్ తరఫున న్యాయవాది కె.శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు 2014లో బచ్‌పన్ బచావో ఆందోళన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన ఆదేశాలను కేంద్రం అమలుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ కారణంగా 25 వేల మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని, డ్రగ్స్‌ను అరికట్టేందుకు తగిన విధానం రూపొందించి అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ కేంద్రం చర్యలు తీసుకోలేదని వివరించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, గోవా, పుదుచ్చేరి, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్ కారణంగా ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ 2014లో దేశంలో ఐదో స్థానంలో నిలిచిందని, ఆంధ్రప్రదేశ్ 2015లో ఐదో స్థానంలో నిలిచిందని వివరించారు. తెలంగాణలో వందలాది మంది చిన్నారులు, సినీ ప్రముఖులు డ్రగ్స్ బారిన పడ్డారని, ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసు విభాగం దర్యాప్తు కూడా జరుపుతోందని వివరించారు. ఈ మేరకు సుప్రీం ఆదేశాల అమలు, ఇతర అంశాలపై కేంద్రం తీసుకున్న చర్యలేవో చెప్పాలని ఆదేశిస్తూ నవంబర్ 20కి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
(తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఫైల్ ఫొటో)