ఇది తెలుగు జాతికి ఇచ్చిన పురస్కారం
హైదరాబాద్ :
కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి, దర్శకుడు కె. విశ్వనాథ్ను హైదరాబాద్లో కలిసి సత్కరించారు. చలన చిత్ర పరిశ్రమలో 6 దశాబ్దాలుగా ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించి, క్రమశిక్షణకు మారుపేరు అయిన విశ్వనాథ్ని కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేయడం ప్రతి తెలుగువారు గర్వంగా భావిస్తున్నారని కేతిరెడ్డి అన్నారు. ఈ అవార్డు తెలుగు జాతికి వచ్చిన అవార్డుగా ఆయన అభివర్ణించారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను తన సినిమాల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన కళాతపస్వికి గతంలో ఎన్నో పురస్కారాలు దక్కాయని కేతిరెడ్డి అన్నారు. ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఇవ్వడం తెలుగు వారందరికి దక్కిన గౌరవమని తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు మాత్రమే కాకుండా కుటుంబ విలువలు, మంచి సందేశాలు ఆయన చిత్రాల్లో ఉంటాయన్నారు. స్వయం కృషి, శుభలేఖ, జీవనజ్యోతి, సిరిసిరిమువ్వ, చిన్ననాటి స్నేహితులు లాంటి ఎన్నో చిత్రాలు అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన కళాతపస్వి విశ్వనాథ్ భూమి, ఆకాశం ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలిపారు.