జయలలిత మరణంపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించడంపై కేతిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
చిత్తూరు :
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించడంపై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం పళనిస్వామి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని తమిళనాడు ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. జయలలిత మృతిపై న్యాయవిచారణకు ఆదేశించినందుకు ఆయన శనివారం తిరుమలలో మొక్కులు సమర్పించారు. వెంకన్న స్వామి కరుణించినందువల్లే విచారణ ప్రారంభం కానుందని, అమ్మ మృతికి కారణాలు నిగ్గుతేలాలని ఆకాంక్షించారు. గతంలో జయ మరణంపై సీబీఐ విచారణ చేపట్టాలని చెన్నై నుంచి తిరుమల వరకు ర్యాలీ నిర్వహించి వెంకటేశ్వర స్వామికి వినతిపత్రం సమర్పించారు. జయలలిత నివాసమైన వేద నిలయంను ఆమె స్మృతి నిలయంగా నిర్ణయించడం సంతోషదాయకమని పేర్కొన్నారు.
జయలలిత మృతిపై ప్రధాని నరేంద్ర మోదీని గతంలో కలిసి సీబీఐ విచారణ కోసం విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. జయ మృతిపై గతంలో సీఎంగా ఉన్న ఓ పన్నీర్ సెల్వం ఎలాంటి విచారణకు మొగ్గుచూపలేదని, పదవికి రాజీనామా చేసిన తర్వాత జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారని విమర్శించారు. దాంతో అమ్మ వీరవిధేయుడే ఆమె మృతిపై నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో అన్నాడీఎంకేపై ప్రజలు నమ్మకం కోల్పోయినట్లు కేతిరెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ మద్ధతుతోనే జయలలిత మరణంపై నెలకొన్న సందేహాలపై విచారణ జరపడానికి రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారన్నారు. అందుకు కారణమైన ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
దాదాపు 70 రోజులకు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 5న హఠాత్తుగా జయ మృతి చెందగా, దీని వెనుక ఆమె సన్నిహితురాలు శశికళ కుట్ర జరిపి ఉండొచ్చన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జయకు ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించి, వీఐపీలను కలవనీయకపోవడం, అక్కడ సీసీటీవీలు లేకపోవడంపై ఆమె మృతిపై సందేహాలున్నాయని సీబీఐ విచారణ జరిపించాలని అదే నెల 14న సుప్రీంకోర్టులో కేతిరెడ్డి మొట్టమొదటిసారిగా పిటిషన్ దాఖలు చేశారు. ఆమె మృతిపై నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వంపై ఉన్నదని పేర్కొంటూ.. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో గతంలో ఆయన ధర్నా చేపట్టారు. సీబీఐ విచారణ కోసం మద్ధతు తెలపాలని కోరుతూ ఎంపీలందరికీ వినతిపత్రాలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు.
గతంలో జయపై విష ప్రయోగం జరగడంపై, పోయెస్ గార్డెన్‌లో అమ్మపై కుట్రలు జరిగాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. విష ప్రయోగం తర్వాత శశికళను జయ పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లగొట్టడం.. ఆపై కొన్ని రోజుల తర్వాత పథకం ప్రకారం పోయెస్ గార్డెన్‌లో శశికళ అడుగుపెట్టారని ఆరోపణలున్నాయి. జయలలిత జైలులో ఉండగా అన్నాడీఎంకే నేత నామినేషన్ పత్రాలపై వేసిన వేలిముద్రలు అమ్మవి కాదని, శశికళవని ఆయన పేర్కొన్నారు. అన్నాడీఎంకే అమ్మ శిబిరం ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకం చెల్లదంటూ ఇటీవల సీఎం పళనిస్వామి శిబిరం తేల్చడం, మరోవైపు అమ్మ మృతిపై రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించడంతో పార్టీ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
జగధీశ్వర రెడ్డితో పాటూ ఈ కార్యక్రమంలో డి. శివశంకర్ రెడ్డి, పి. నాగేశ్వర్ రావు, వర్ధన్, ఎస్. వెంకటేశ్వరరావు తదితరులతో పాటూ తిరుపతికి చెందిన యువకులు పాల్గొన్నారు.