సాక్షి, గచ్చిబౌలి : ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓటర్లకు నేరుగా డబ్బులు పంచుతున్న ఓ కీలకమైన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అనుకూలంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్న సందీప్‌రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని ఎస్‌ఎల్‌ఎన్ టవర్స్‌లో తాజాగా సోదాలు నిర్వహించిన పోలీసులు.. సందీప్ రెడ్డి దగ్గర కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
కొండాకు అనుకూలంగా చేవెళ్ల నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 కోట్ల రూపాయల నగదును ఓట్ల కోసం పంపిణీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చిందీ.. కోడ్ రూపంలో సందీప్ రెడ్డి రాసిపెట్టుకున్నారు. ఈ కోడ్ భాషలో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కోడ్‌లో ఉన్న వివరాలను డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. సందీప్ వ్యవహారంపై ఇప్పటికే ఐటీ అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు రూ. 15 కోట్ల పైచిలుకు నగదును కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి కలిసి పంచినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల సమాచారంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు.. మంగళవారం సాయంత్రం కొన్ని గంటలపాటు సందీప్ రెడ్డిని ప్రశ్నించారు.
మరోసారి తమ ముందు హాజరు కావాలని అతన్ని ఐటీ అధికారులు ఆదేశించారు. 2008 నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వద్ద సందీప్ రెడ్డి పనిచేస్తున్నాడు. అంతేకాకుండా ఆయనకు సమీప బంధువు కూడా. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆర్థిక వ్యవహారాలను కూడా సందీప్ రెడ్డి చూస్తాడని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment