జీవన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, జగిత్యాల: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా కాకుండా అప్పుల నిలయంగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారని సీఎల్పీ ఉపనేత టి. జీవన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ 5 ఏళ్ల పాలనలో 56 వేల కోట్లు అప్పు చేస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలోనే లక్షా నలభై వేల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరగొట్టిన కేసీఆర్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 12 వేల ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన ఏ హామీ సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు.
అసాధ్యమైన హామీలివ్వడం కేసీఆర్‌కు అలవాటేనని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని సవాల్ చేశారు. రైతు బంధు పథకం పేదల కన్నా వందల ఎకరాలు ఉన్న పెద్ద రైతులకే మేలు చేస్తోందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 62 శాతం మంది రైతులు 45 గుంటల కన్నా తక్కువ భూమి కలిగిన వాళ్లేనని, పెట్టుబడి సాయంతో బక్క రైతు బాగు పడేదెప్పుడని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment