
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీరామ నవమి రోజున బిహార్ లోని కొన్ని ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. రాష్ట్రంలో జరిగిన ఘర్షణలకు ముఖ్యమంత్రే కారణమని, ఇక నితీష్ కుమార్ పని అయిపోయిందని ఆయన అన్నారు. గడ్డి స్కాం కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్న లాలూ ప్రసాద్‌ను అనారోగ్యం కారణంగా పోలీసులు బుధవారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రి బయట లాలూ మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంటలు పెట్టి మత ఘర్షణలను ప్రేరేపించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ పని ఇక అయిపోయిందని విమర్శించారు.
ఇది ఇలా ఉండగా శ్రీరామ నవమి పర్వదినం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఘర్షణలు జరుగుతునే ఉన్నాయి. ఔరంగాబాద్ జిల్లాలో ఎక్కువగా ఘర్షణలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 150 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణలపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. బీజేపీ-జేడీయూ కూటమి విఫలమైందని, బీజేపీ నాయకులు మత ఘర్షణలను ప్రోత్సాహిస్తూన్నారంటూ బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.