సాక్షి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌పై సీఎం పళనిస్వామి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన పుణ్యమా అని ఓ ఎమ్మెల్యేను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. వద్దంటున్నా, ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ఇప్పుడు ఒకరి ద్వారా మరొకరికి వైరస్ వ్యాప్తి పెరిగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కోయంబత్తూరు అధికారుల పనితీరు అభినందనీయమని కొనియాడారు. మెజిస్ట్రేట్ విచారణ నివేదిక మేరకు సాత్తాన్ కులంలో తండ్రి, కుమారుడి మరణంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం పళనిస్వామి గురువారం కోయంబత్తూరులో పర్యటించారు. రూ.238 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధిపనుల్ని ప్రారంభించారు.
స్మార్ట్ సిటీ పనులు, వంతెనల నిర్మాణాలు, భారీ ఫ్‌లైఓవర్ల పనులు, అత్తికడవు అవినాశి ఉమ్మడి నీటి పథకం పనుల పరిశీలన అంటూ పలు పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే, రూ. 779 కోట్లతో చేపట్టనున్న పిల్లూరు తాగునీటి పథకం, సొరంగం తవ్వకాల పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజామణి, మంత్రి ఎస్పీ వేలుమణి, డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి జయరామన్‌లతో కలిసి కరోనా నివారణ చర్యల మీద సమీక్షించారు. అలాగే, చిన్న ,మధ్యతరహా, భారీ పరిశ్రమల యాజమాన్యాలు, ప్రతినిధులతో భేటీ అయ్యారు. స్వయం సహాయక బృందాలు, మహిళా సంఘాలతో సమావేశం అయ్యారు. సాయంత్రం మూడు గంటలకు మీడియా ముందుకు సీఎం వచ్చారు.
కోయంబత్తూరు భేష్..
కోయంబత్తూరులో చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ముందుగా సీఎం పళనిస్వామి వివరించారు. కరోనా నివారణ చర్యలను గుర్తు చేస్తూ, వైరస్ కట్టడిలో అధికారుల పనితీరు అభినందనీయమని కొనియాడారు. ఇక్కడ వైరస్ అన్నది కట్టడిలో ఉందని, ప్రస్తుతం 112 మంది మాత్రమే చికిత్సలో ఉన్నట్టు వివరించారు. ఇక్కడున్న పరిశ్రమల్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం ద్వారా రూ. 761 కోట్ల మేరకు రుణాల్ని ఇప్పించామని తెలిపారు. గత 90 రోజులుగా రాష్ట్రంలోని ప్రతి అధికారి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు, వైద్యుల నుంచి నర్సులు, వార్డుబాయ్‌ల వరకు రేయింబవళ్లు కరోనా నివారణ, కట్టడి, బా«ధితుల సేవలో ఉన్నారని వివరించారు. వీరందరికి తాను ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. అయితే, రోగాన్ని అడ్డం పెట్టుకుని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చేస్తున్న రాజకీయం జూస్తుంటే, తీవ్ర ఆవేదన , ఆగ్రహం కల్గుతోందన్నారు.
ఓ ఎమ్మెల్యేను కోల్పోయాం..
కరోనా కట్టడి లక్ష్యంగా అందరూ రేయింబవళ్లు శ్రమిస్తుంటే, ప్రభుత్వం చేతులెత్తేసిందని, సీఎంకు మానవత్వం లేదని, అధికారులు అసమర్థులు అన్నట్టుగా స్టాలిన్ వ్యాఖ్యలు చేస్తుండడం విచారకరంగా పేర్కొన్నారు. వాస్తవానికి స్టాలిన్ ఇచ్చిన ఆలోచనల్ని తాను అనుసరించి ఉంటే, ఈ పాటికి రాష్ట్రంలో కరోనా విలయతాండవం, మరణమృదంగం మార్మోగి ఉండేదేమో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే నేతృత్వంలో కరోనా నివారణ చర్యలు, కట్టడి, బాధితులకు సాయం అన్న ప్రకటన చేయగానే, తొలుత ఆక్షేపణను తానే తెలియజేసినట్టు తెలిపారు. ఇందుకు కారణం, వైద్య నిపుణులు, పరిశోధకులు ఇచ్చిన నివేదికేనని వివరించారు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా సేవల్లో నిమగ్నమైన పక్షంలో కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని ఆ నివేదికలో హెచ్చరించారన్నారు.
అందుకే తాను అడ్డుకోవడం జరిగిందని, అయితే, కోర్టు ద్వారా వారు సేవల్ని కొనసాగించారన్నారు. ఇందుకు మూల్యంగా ఓ ఎమ్మెల్యేను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల్ని విస్మరించి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో భౌతిక దూరాలు, సామాజిక బాధ్యతల్ని మరిచి ప్రజలు సహాయకాల కోసం తరలివచ్చారని, ఇప్పుడు అదే జనం వైరస్ బారిన పడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ ఒకరి ద్వారా మరొకరికి సంక్రమించినట్టు తాజా నివేదిక స్పష్టం చేసిందని, అయితే, సమాజంలోకి ఇది వ్యాపించ లేదన్నారు. ఇష్టానుసారంగా సేవలు అంటూ దూకుడుగా ముందుకు సాగి వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణం కావడమే కాకుండా, ఓ ఎమ్మెల్యేను కోల్పోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరో అన్నది ప్రజలు గుర్తెరగాలని పిలుపునిచ్చారు. తానో జాతీయ నేతను అని స్టాలిన్ గొప్పలు చెప్పుకుంటున్నారని, అలాంటప్పుడు ముంబై, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో పెరుగుతున్న కేసుల విషయంగా ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు.
కరోనా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న విషయాన్ని పసిగట్టి, ఏదో ఒక రూపంలో బురద చల్లడం లక్ష్యంగా వ్యక్తిగత ప్రచారం కోసం రోజుకో ప్రకటనలు ఇచ్చుకోవడం ఆయనకు అలవాటుగా మారి ందని మండిపడ్డారు. కాగా, సాత్తాన్ కులం తండ్రి, కుమారుల మరణం గురించి ప్రశ్నించగా, మెజి్రస్టేట్ విచారణ కోర్టు పర్యవేక్షణలో సాగుతున్నదని, మదురై ధర్మాసనం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా తప్పు చేసి ఉంటే, వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment