సాక్షి, హైదరాబాద్ : ఐటీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకుంట మునుస్వామి రమేష్ (సీఎం రమేష్) ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. సోదాల నేపథ్యంలో ఐటీ అధికారులు ఆయనను హైదరాబాద్ రావాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. రెండురోజులుగా సీఎం రమేష్‌కు చెందిన కంపెనీలు, పలుచోట్ల ఉన్న ఇళ్లు, కార్యాలయాలలో ఆదాయ పన్ను శాఖ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రమేష్ వేలిముద్రల ఆధారంగా ఆయన ఇంట్లోని కొన్ని లాకర్లు తెరవాల్సి ఉండటంతో.. వాటిని తెరిచేందుకు ఐటీ అధికారులు ఆయనను హైదరాబాద్ రావాల్సిందిగా పిలిచారు. దీంతో ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చారు.
శుక్రవారం ఉదయం నుంచి సుమారు 90 నుంచి 100 మంది ఐటీ అధికారులు సీఎం రమేష్‌కు చెందిన హైదరాబాద్, వైఎస్సార్ జిల్లా పోట్లదుర్తిలో ఉన్న ఇళ్లతో పాటు రిత్విక్ ప్రాపర్టీస్, అనుబంధ కంపెనీల్లో సోదాలు జరిపారు. ఇంజనీరింగ్ కాంట్రాక్టులు, మైనింగ్ విద్యుత్తు తదితర రంగాల్లో ఉన్న సీఎం రమేష్ వ్యాపార సామ్రాజ్యం గత మూడేళ్లలో అనూహ్యంగా పెరిగింది. అయితే దానికి తగ్గట్టుగా ఆదాయ పన్ను చెల్లింపులు పెరగకపోవడం, ఖాతాల నుంచి నగదు రూపంలో లావాదేవీలు భారీగా జరుగుతుండటం ఐటీ సోదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment