న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం(ఈసీ)ని కోరింది. మోదీ, అమిత్ షా విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, సైనిక బలగాలను రాజకీయ ప్రచారానికి వాడుకున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ‘బీజేపీ నేతల ఉల్లంఘనలపై గడిచిన నాలుగు వారాల్లో తమ పార్టీ అన్ని ఆధారాలతో 40 ఫిర్యాదులు అందజేసినా ఉదాసీనంగా ఉంది.
ఈసీ తీరు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరపాలన్న రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించడమే. నిబంధనలను పట్టించుకోని బీజేపీ నేతలపై చర్యలు తీసుకునేలా ఈసీని ఆదేశించండి’అని ఆమె కోరారు. గుజరాత్‌లో ఏప్రిల్ 23వ తేదీన ఎన్నికల రోజున కూడా ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఆరోపించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. పిటిషనర్ పేర్కొన్న ఆరోపణలపై అవసరమైన చర్యలు తీసుకునే స్వేచ్ఛను ఈసీకే వదిలివేసింది. ఈసీ వివరణ అందాక గురువారం ఉదయం 10 గంటలకు ఈ అంశంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
మోదీకి ఈసీ క్లీన్‌చిట్
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేయడంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం(ఈసీ) మోదీకి క్లీన్‌చిట్ ఇచ్చింది. ఎన్నికల నియమాల ఉల్లంఘన జరగలేదని నిర్ధారించామని ఈసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఏప్రిల్ ఒకటిన మహారాష్ట్రలోని వార్ధాలో ఎన్నికల ప్రచారసభలో మోదీ మాట్లాడారు. ‘హిందువులను కాంగ్రెస్ అవమానించింది. కాంగ్రెస్‌ను శిక్షించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకే, హిందువులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు భయపడుతున్న ఆ పార్టీ నేతలు మైనారిటీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వలసపోతున్నారు’ అని మోదీ ఆ సభలో అన్నారు. దీంతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్న మోదీపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీని కాంగ్రెస్ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment