PM Modi Security Breach ఢిల్లీ: ప్రధాని పర్యటనపై భద్రతా వైఫల్యంపై బుధవారం దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు లాయర్స్ వాయిస్ సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను రేపు (శుక్రవారం) ఉన్నత న్యాయస్థానం విచారించనుంది.
నిన్న (బుధవారం) ఫిరోజ్‌పూర్‌లో కొంత మంది నిరసనకారులు ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్‌ను ఫ్లైఓవర్‌పై 20 నిముషాలపాటు అడ్డుకోవడంతో ప్రధాని ర్యాలి రద్దయ్యింది. భటిండా విమానాశ్రయం నుంచి హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారక స్థూపం వద్దకు ప్రధాని మోదీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పంజాబ్‌లో ప్రధాని కాన్వాయ్‌కు భద్రతా వైఫల్యంపై అత్యున్నతస్థాయి విచారణ కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలయ్యింది. పంజాబ్ పాలకులు దురుద్దేశంతోనే భద్రతా వైఫల్యం సృష్టించారని, దేశ భద్రతకే ఇది తీవ్రమైన విఘాతమని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని కాన్వాయ్‌లో చీఫ్ సెక్రటరీ, డీజీపీ కూడా ఉండాలని, కానీ వారిద్దరూ లేరని అన్నారు. భద్రతా ఏర్పాట్లపై ఆధారాలను భఠిండా జిల్లా జడ్జి వద్ద ఉంచేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కేసు విచారణ తక్షణమే చేపట్టాల్సిందిగా సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.
పంజాబ్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ, క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారంటూ కేంద్ర హోం మంత్రిత్వ అమిత్ షా ఆరోపించారు. ప్రధాని ప్రయాణించే మార్గం గురించిన సమాచారం లీక్ అయిందా? అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఘటనపై విచారం వ్యక్తం చేసినప్పటికీ బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని కాన్వాయ్ రోడ్డు మార్గం గుండా వెళ్తున్నట్లు తమ ప్రభుత్వానికి సమాచారం అందలేదన్నారు.
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో జరిగిన పొరపాట్లపై విచారణకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ప్యానెల్‌ను ఆదేశించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు.
చదవండి: Inspirational Story: నా కొడుకుకు కళ్లులేకపోతేనేం.. నా కళ్లతో లోకాన్ని పరిచయం చేస్తా!
Comments
Please login to add a commentAdd a comment