అమలాపురంలో బాలయోగి కుమారునికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటైన ఫ్లెక్సీ
అమలాపురం అసెంబ్లీ టికెట్ విషయంలో టీడీపీలో చరిత్ర పునరావృతం అవుతుందా? అమలాపురం (పాత అల్లవరం నియోజకవర్గంలో) టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యేకు.. ఆ తరువాత టికెట్ దక్కదన్న సెంటిమెంట్ నిజం కానుందా? అంటే అవునంటున్నాయి టీడీపీ వర్గాలు. సిటింగ్ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కించుకునే అవకాశాలు లేవంటున్నారు. దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్, పార్టీలో మరో సీనియర్ నాయకుడు పరమట శ్యామ్ రూపంలో ఆనందరావుకు టికెట్ విషయంలో అడ్డంకి ఏర్పడనుంది.
తూర్పుగోదావరి , అమలాపురం: రూ.కోట్లతో అభివృద్ధి చేశానని గొప్పలకు చెప్పుకుంటున్న అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావుకు గెలుపు అవకాశాలు లేవంటూ టీడీపీ సొంత సర్వే నివేదికలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో పార్టీకి దన్నుగా ఉన్న ఒక ప్రధాన సామాజిక వర్గం ఎమ్మెల్యే తీరుపై గుర్రుగా ఉండి పార్టీకి దూరంగా ఉంది. కొంతమంది పార్టీ కూడా మారుతున్నారు. ఇవి కూడా ఆయన టికెట్ పొందడానికి ప్రధాన అవరోధంగా ఉన్నాయంటున్నారు. దీంతో పార్టీ అధిష్టానం కొత్త అభ్యర్థుల అన్వేషణలో పడిందని కొన్ని నెలలుగా ప్రచారం సాగుతోంది. దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి వారసుడు హరీష్ అయితే బాగుంటుందనే ప్రచారం టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
పార్టీ సీనియర్ నాయకుడు, గత ఎన్నికల్లో పార్టీ టికెట్‌ను త్రుటిలో చేజార్చుకున్న పరమట శ్యామ్ పేరును మరో ప్రత్యామ్నాయంగా సూచిస్తున్నారు. అయితే బాలయోగి వారసుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, తిరిగి సిటింగ్ ఎమ్మెల్యే ఆనందరావుదే టికెట్ అంటూ ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో, సంక్రాంతి సందర్భంగా బాలయోగి అభిమానుల పేరుతో హరీష్ ఫ్లెక్సీలను అమలాపురం పట్టణంతోపాటు పలుచోట్ల ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. హరీష్ రాజకీయాల్లోకి వస్తాడన్న ప్రచారం జోరందుకుంది. హరీష్ రాకను ఉప ముఖ్యమంత్రి రాజప్ప వర్గం అంతర్గతంగా స్వాగతిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాజకీయ గురువు బాలయోగి తనయుడిని రంగంలోకి తీసుకురావడం ద్వారా ఆయన రుణం తీర్చుకోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో బలమైన పోటీదారుడిని రంగంలో నిలపాలన్న పార్టీ అధిష్టానం యోచనకు మార్గం ఏర్పడుతుందని రాజప్ప వర్గీయులు అంటున్నారు. అయితే హరీష్‌ను లోక్‌సభకు పంపుతారనే ప్రచారం కూడా సాగుతోంది.
మార్పు కోరుకుంటున్న రాజప్ప?
అమలాపురం నియోజకవర్గంలో ఈసారి అభ్యర్థిని మార్చాలని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప భావిస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. పార్టీపరంగా ఎమ్మెల్యే అయిన వ్యక్తికి రెండోసారి అవకాశం ఇచ్చేందుకు రాజప్ప అంగీకరించరనే సెంటిమెంట్ కూడా ఉంది. 1999 ఎన్నికల్లో అల్ల వరం సిటింగ్ ఎమ్మెల్యే ఏజేవీబీ మహేశ్వరావును కాదని చిల్లా జగదీశ్వరికి టికెట్ ఇప్పించారు. 2004 ఎన్నికల్లో ఆమెను కాదని పండు స్వరూపరాణిని నిలబెట్టారు. తాజాగా సిటింగ్ ఎమ్మెల్యేకు మొండిచేయి చూపుతారన్న ప్రచారం సాగుతోంది. శిష్యుడిగా భావించి ఆనందరావుకు టికెట్ ఇచ్చే విషయంలో రాజప్పతో ఇటీవల ఏర్పడిన అధిప్యత పోరే కారణమని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో రాజప్ప వర్గం పెత్తనం ఎమ్మెల్యే వర్గానికి మింగుడ పడడం లేదు. ఎమ్మెల్యే వర్గంలో కీలకంగా ఉన్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గునిశెట్టి చినబాబు రెండోసారి చైర్మన్ పదవి ఇవ్వలేదని రాజప్పపై అసంతృప్తితో ఉన్నారు. బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న ఆయను ఎమ్మెల్యే వారించకపోవడంపై రాజప్ప గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల వివాదంలో చిక్కుకున్న సోదరుడు జగ్గయ్యనాయుడిని ఎమ్మెల్యే వెనకేసుకు రాకపోవడం కూడా రాజప్ప వర్గం అసంతృప్తి ఉందంటున్నారు. అమలాపురం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఖరారవుతుం దన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment