సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు రోజురోజుకూ అన్ని నియోజకవర్గాలకూ పాకుతున్నాయి. రెండేళ్లుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఆపార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నా అధికారపార్టీ కావడంతో బయటపడలేక మదనపడిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీ ముఖ్యనేతల నుంచి సామాన్య కార్యకర్తల వరకూ బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. నిన్నమొన్నటి వరకూ ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు ఉన్న నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్న వినుకొండలో సైతం అసమ్మతి సెగ రాజుకుంది. మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు పార్టీని వీడి జనసేనలో చేరడంతో నియోజకవర్గానికి సంబంధం లేని ఐదుగురు నేతలను మండల ఇన్‌ఛార్జిలుగా నియమించడంతో ద్వితీయ శ్రేణి నేతలు మండిపడుతున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జిలకు టికెట్‌లు ఇవ్వ వద్దంటూ నేరుగా అధిష్టానం వద్దే పంచాయితీలు పెడుతుండటంతో టీడీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే...
టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుకు వ్యతిరేకంగా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎం.ఎస్. ప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు సోమవారం లోకేష్‌ను కలిసి ఎమ్మెల్యే జీవీపై ఫిర్యాదు చేయడం జిల్లాలో మాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలో అసంతృప్తి నేతలను బుజ్జగించాల్సిన జిల్లా అధ్యక్షుడే గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీకి నష్టం చేకూరుస్తున్నారంటూ ఫిర్యాదు చేయడం టీడీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. జిల్లాలో రాజధాని నిర్మాణం జరుగుతున్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో టీడీపీ అసమ్మతి నేతలు బాహాబాహీకి దిగుతూ తన్నులాడుకుంటున్నారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా జెడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు వర్గీయులు సమావేశాలు పెట్టి ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా మరో వర్గం మంగళవారం టీడీపీ కార్యాలయానికి వచ్చి బాలరాజుకు తాడికొండ టికెట్ కేటాయించాలని వినతిపత్రం ఇవ్వడంతో నియోజకవర్గ టీడీపీలోని విభేదాలు మరోసారి బయటపడినట్‌లైంది. బాలరాజు ఎక్సైజ్ సీఐగా పనిచేస్తూ దీర్ఘకాలిక సెలవు పెట్టి టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మాజీమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు నియోజకవర్గంలో అధికారపార్టీ సామాజిక వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతల దాష్టికాలను తట్టుకోలేక పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ మారిన తరువాత ప్రత్తిపాడు నియోజకవర్గంతో సంబంధం లేని దాసరి రాజామాస్టారు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాయపాటి రంగారావు, గుంటుపల్లి నాగేశ్వరరావు, ఇక్కుర్తి సాంబశివరావులకు మండలి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంపై టీడీపీ స్థానిక నేతలు భగ్గుమంటున్నారు. సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసిన ప్రతిసారీ ఒకరిపై ఒకరు ధూషణలకు దిగుతూనే ఉన్నారు. మంగళగిరిలో సైతం ఇన్‌చార్జిగా ఉన్న గంజి చిరంజీవిపై అసమ్మతి పెరిగింది. మాచర్ల, పెదకూరపాడు, నర్సరావుపేట, బాపట్ల వంటి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోయి తన్నుకుంటున్నారు.
గుంటూరు నగరంలోని గుంటూరు వెస్ట్, ఈస్ట్ నియోజకవర్గాల్లో టీడీపీలో ఒకరంటే ఒకరికి పడక ద్వితీయశ్రేణి నేతలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల గ్రూపులుగా విడిపోయి బాహాబాహీకి దిగుతున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రితోపాటు స్థానిక మంత్రులు, ఎంపీలు, ముఖ్యనేతలు సైతం గ్రూపులను ప్రోత్సహిస్తూ తమ ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నగర టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment