టీడీపీకి ఎదురుగాలి వీస్తోందని అధికార పార్టీ నేతలు గ్రహించారా? సొంత సర్వేల్లో ఓడిపోతామని తేలడంతో పోటీకి వెనుకడుగు వేస్తున్నారా? గత ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో ఫలితాలు పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయనే అధిష్టానం సర్వేతో నేతలు పునరాలోచనలో పడ్డారా? అనంతపురం, హిందూపురం ఎంపీ స్థానాల్లో పోటీకి అభ్యర్థులే కరువయ్యారా? తాజా పరిణామాలను బేరీజు వేస్తే అవుననే సమాధానమే వస్తోంది. మరో పది రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుండగా టీడీపీ సిట్టింగ్‌లు ఇద్దరూ పోటీకి విముఖత చూపుతుండటం పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య అసమ్మతి జ్వాల రగులుతోంది. అభ్యర్థుల ప్రకటన సమయంలో ఎవరికి టిక్కెట్టు వస్తుందో? ఎవరికి రాదో? కోరుకున్న స్థానాలు దక్కకపోతే ఎంతమంది పోటీ నుంచి తప్పుకుంటారో? అనే గుబులు పార్టీ అధిష్టానాన్ని తికమక పెడుతోంది. ఇదే సమయంలో పార్లమెంట్ బరిలో నిలిచేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవడం చూస్తే దిగజారిన పార్టీ పరిస్థితి ఇట్టే అర్థమవుతోంది. అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను రాజకీయాల నుంచి తప్పుకుని వారసుడిగా తన కుమారుడు పవన్‌ను బరిలోకి దింపాలని భావించారు. ఆ మేరకు ఆయన కూడా తొలుత పోటీకి ఉత్సాహం కనబర్చారు. అయితే పవన్ సొంతంగా రెండు జాతీయ ఏజెన్సీలతో పాటు ఒక లోకల్ ఏజెన్సీతో సర్వే చేయించుకోగా మూడింటిలోనూ ఓటమి స్పష్టమైంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు బలహీనంగా ఉన్నారని, మార్చాలని చంద్రబాబు వద్దే జేసీ పదేపదే తన వాణి వినిపించారు.
అయినప్పటికీ ఆయన పెడచెవిన పెట్టడంతో మార్పు తనవల్ల కాదనే వాస్తవం జేసీకి బోధపడింది. ఈ నేపథ్యంలో అనంతపురంలో రైల్వే బ్రిడ్జి, పాతూరు రోడ్ల విస్తరణ అంశాలపై ఈనెల 15న హడావుడిగా అమరావతికి వెళ్లి సీఎంను కలిశారు. ఈ విషయంపై పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బెదిరించినప్పటికీ చంద్రబాబు తేలిగ్గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ పరిణామంతోటీడీపీలో ఆయన స్థానం, తన మాటకున్న విలువ స్పష్టమైంది. గతంలో గుంతకల్లు, అనంతపురం విషయంలో ఇద్దరు నేతలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరకపోవడంతో ఎంపీగా తాము పోటీ చేయలేమని, తాడిపత్రితో పాటు గుంతకల్లు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని విన్నవించారు. గుంతకల్లు వీలుకాని పక్షంలో అనంతపురం ఇవ్వాలని అభ్యర్థించినా రెండింటికీ బాబు ససేమిరా అన్నట్లు చర్చ జరుగుతోంది. కుమారుడిని రాజకీయ ఆరంగేట్రం చేయించి ఎంపీగా బరిలో నిలిపినా.. ఓడిపోతే ఐదేళ్లు జిల్లా రాజకీయాలను వదిలి సొంత వ్యవహారాలు చూసుకోవాల్సి వస్తుంది. దీంతో తాడిపత్రి నుంచి బరిలోకి దించాలని భావించారు. అయితే తాడిపత్రిలో కచ్చితంగా తన కుమారుడు అస్మిత్‌ను పోటీలో నిలుపుతానని, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని ప్రభాకర్‌రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో దివాకర్‌రెడ్డి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
‘పురం’ పార్లమెంట్‌కు అభ్యర్థి కరువేనా?
రెండు పార్లమెంట్‌ల పరిధిలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా స్థానాల్లో బోయ, కురుబ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. హిందూపురం పార్లమెంట్ పరిధిలో కురుబలు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ఓటమి తప్పదని భావించిన ఎంపీ నిమ్మల కిష్టప్ప, పెనుకొండ సీటు ఆశించారు. పార్థసారథి కురుబ కావడంతో ఎంపీగా బరిలోకి దించి అసెంబ్లీ తనకు ఇవ్వాలని కిష్టప్ప టీడీపీ అధిష్టానంతో విన్నవించారు. ఎంపీగా ఓటమి తప్పదని సర్వేల్లో వచ్చిందని, తాను వెళ్లనని బీకే తేల్చిచెప్పి, పెనుకొండే కావాలని పట్టుబట్టారు. దీంతో కిష్టప్ప పుట్టపర్తి టిక్కెట్ ఇవ్వాలని, తన కుమారున్ని బరిలోకి దించుతానని చెప్పుకొచ్చారు. దీనిపై ఇంకా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేదు. పుట్టపర్తిలో తనను మారుస్తారని సమాచారం ఉండటంతో పల్లె రఘునాథరెడ్డి టిక్కెట్ దక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో మైనార్టీ తరఫున అత్తార్‌చాంద్ బాషాను దించితే బాగుంటుందని నిమ్మల అధిష్టానానికి ఉచిత సలహా ఇచ్చారు. అత్తార్ కూడా ఎంపీగా ఓడిపోతానని, కదిరి సీటే కావాలని లోకేశ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు అనంతపురం, ఇటు హిందూపురం ఎంపీగా ఓటమి తప్పదని సిట్టింగ్‌లు తప్పించుకుంటున్న తీరుతో పార్టీ అధిష్టానం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై పూర్తిగా ఆత్మరక్షణలో పడింది.
అసెంబ్లీ సీట్ల పరిస్థితీ అంతే..
పల్లె రఘునాథరెడ్డి కూడా తన సర్వేలో ఓడిపోతారని తేలింది. టిక్కెట్టు మార్చాలనే నిర్ణయానికి పార్టీ వచ్చింది. దీంతో రఘునాథరెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యమని, అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వకపోతే, ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇవ్వండని అధిష్టానం ముందు మరో ఆప్షన్ పెట్టినట్లు తెలిసింది. కదిరి టిక్కెట్ తనకు కావల్సిందేనని మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పట్టుబడుతున్నారు. వైఎస్సార్‌సీపీలో గెలిచి చాంద్‌బాషా టీడీపీలోకి వచ్చారని, రేపు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే తిరిగి వెళ్లడని గ్యారెంటీ ఏంటని లోకేశ్‌తో తన వాణి విన్పించారు. ఇదిలా ఉంటే రాయదుర్గంలో కూడా ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ తనకు సహకరించరని, ఓటమి తప్పదని భావించిన మంత్రి కాలవ కూడా గుంతకల్లు సీటు ఆశిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఎంపీగా పోటీ చేస్తావా? అని అధిష్టానం అడగడంతో ఓడిపోయే సీటు తనకెందుకని తిరస్కరించినట్లు తెలిసింది. ‘దుర్గం’ నుంచి ఓటమి తప్పదు, ఎంపీగా అదే పరిస్థితి, ఏం చేయాలో దిక్కుతెలియక ఆయన డైలమాలో ఉన్నారు. దీంతో పాటు శింగనమల నుంచి యామినీ, శమంతకమణికి కాకుండా బండారు శ్రీవాణికి టిక్కెట్ ఇవ్వాలనే యోచనలో టీడీపీ ఉంది. ఇదే జరిగితే టీడీపీలో ఉండాల్సిన అవసరం లేదని శమంతకమణి గట్టిగానే తన వాదన వినిపించినట్లు సమాచారం.
కళ్యాణదుర్గంలో చౌదరికి అసమ్మతి సెగ
ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి అభ్యర్థులను ప్రకటించకముందే ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దీనిపై జెడ్పీటీసీ రామ్మోహన్‌చౌదరితో పాటు నారాయణ, మల్లికార్జున, వైటీ రమేశ్, లక్ష్మీనారాయణ, రమేశ్‌తో పాటు టిక్కెట్ ఆశిస్తున్న ఉమామహేశ్వరనాయుడు జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. ఆయన జోక్యం చేసుకొని ప్రచారానికి బ్రేక్ వేశారు. దీన్నిబట్టి చూస్తే తనకు టిక్కెట్టు ఇవ్వనట్లే కదా? అలాంటప్పుడు పార్టీలో ఎందుకుండాలని చౌదరి కూడా గట్టిగానే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో ‘దుర్గం’లో వర్గపోరు ఒక్కసారిగా భగ్గుమంది.
Comments
Please login to add a commentAdd a comment