ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయ వేడి రాజుకుంది. వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ టికెట్ ఆరుగురు టీడీపీ నేతలు ఎవరికి వారు ప్రచారం చేసుకుంటుంటే.. మరో వైపు ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం కొత్త వారిని తీసుకొచ్చేందుకు అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే తిరుపతి టీడీపీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని తెలిసింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆశావాహులు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
సాక్షి, తిరుపతి: తిరుపతి నియోజకర్గ టీడీపీ టికెట్ కోసం కొందరు ఆశావహులు అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరి కొందరు నారా లోకేష్ ద్వారా టికెట్ తెప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అమరావతిలో తిష్టవేసి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని ఎమ్మెల్యే సుగుణమ్మ ధీమాగా ఉన్నారు. తన అనుచరుల వద్ద టికెట్ తనకే వస్తుందని, సీఎం చంద్రబాబు మాట ఇచ్చారని చెబుతున్నారు. మరోవైపు తుడ చైర్మన్ నరసింహయాదవ్ కూడా వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి తానేనని ప్రచారం చేసుకుంటున్నారు.
నిన్నటి ఎన్నికల వరకు బలిజ సామాజిక వర్గం వారికే టికెట్ ఇచ్చారని, అయితే వచ్చే ఎన్నికల్లోమాత్రం యాదవ సామాజిక వర్గం వారికి అవకాశం కల్పిస్తానని సీఎం మాట ఇచ్చినట్లు అనుచరుల వద్ద ఆయన వెల్లడించినట్లు తెలిసింది. మరో వైపు రియల్టర్ ఊకా విజయకుమార్ టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ గల్లా జయదేవ్ ద్వారా తిరుపతి టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు జిల్లాకు వచ్చిన సమయంలోనూ.. అమరావతిలోనూ తరచూ కలుస్తున్నట్లు తెలిసింది. గల్లా వారు కూడా ఊకా విజయకుమార్‌కి గట్టిగా హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఈసారి టికెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్ ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని నేరుగా సీఎంని కలిసి అడిగినట్లు తెలిసింది. వైఎస్సార్ కడప జిల్లా ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, తిరుపతికి చెందిన డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఆశాలత తిరుపతి అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా ఒకరికి తెలియకుండా ఒకరు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, మంత్రులు, బంధువులు, కుమారుడు లోకేష్ ద్వారా ఒత్తిడి చేయిస్తున్నట్లు సమాచారం.
కొత్త వ్యక్తి కోసం బాబు వెతుకులాట
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి కొత్తవారిని దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు అమరావతి సమాచారం. ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న వారి గురించి సొంతంగా సర్వే చేయించుకున్నారు. ఆ సర్వేలో ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరికీ అనుకూలంగా లేదని తేలినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికలకు ప్రస్తుతం టికెట్లు ఆశిస్తున్న వారెవరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టలేరని స్పష్టమైనట్లు తెలిసింది. అందుకే బయటి వ్యక్తిని తీసుకొచ్చేందుకు వెతుకుతున్నట్లు తిరుపతిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే జరిగితే కొత్త వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లో మద్దతు తెలిపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఇన్నాళ్లుగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నామని, తమని కాదని వేరొకరికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని ఆశావహుల్లో ఓ నేత అనుచరుల వద్ద వాపోయినట్లు తెలిసింది. పార్టీ కోసం ఇప్పటికే భారీ ఎత్తున ఖర్చుచేశానని, పెద్దల అనుచరులను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా తాయిలాలు ముట్టజెప్పాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తవారికి టికెట్ ఇస్తే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందనే ఆలోచనతో అభ్యర్థి ఖరారు విషయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేయడం ఇందుకు నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment