రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి
సాక్షి, వికారాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎనిమిది ఎంపీ అభ్యర్థుల జాబితాలో గ్రేటర్ పరిధిలో రెండు నియోజకవర్గాలకు చోటు లభించింది. చేవెళ్ల లోక్‌సభ స్థానం అందరూ ఊహించినట్టుగానే సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కేటాయించగా, మల్కాజిగిరికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని అధిష్టానం అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇదిలా ఉండగా పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌కు కేటాయించింది. దీంతో జిల్లాలోని ముగ్గురు నేతలను ఎంపీ టికెట్లు వరించాయి. రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్ అభిమానులు సంబరాల్లో మునిగితేలారు.
2014 ఎన్నికల్లోనే టీడీపీ తరఫున రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపాడనే వార్తలొచ్చాయి. అయితే, అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కొడంగల్‌కే పరిమితమయ్యారు. ఆపై రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. పార్టీ ఆదేశిస్తే తాను మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమేనని ప్రకటించిన విషయం తెలిసిందే. అధిష్టానం కూడా ఆయనవైపే మొగ్గు చూపి మొదటి జాబితాలోనే అవకాశం కల్పించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీలకు అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. అజారుద్దీన్ ఈ రెండు నియోజకవర్గాల్లో ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment