టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ.. త్వరలో వీలినం? | Congress CLP Merge In TRS Soon In Telangana | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ.. త్వరలో వీలినం?

Published Wed, May 1 2019 1:37 AM | Last Updated on Wed, May 1 2019 10:28 AM

Congress CLP Merge In TRS Soon In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం విలీనానికి రంగం సిద్ధమైంది. మున్సిపల్, రెవెన్యూ కొత్త బిల్లుల ఆమోదం కోసం మే నెలలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లోపే టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనం పూర్తి కానుంది. మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరికపై వారం రోజుల్లోపే అధికారికంగా ప్రకటన వచ్చే చాన్సుంది. తర్వాత టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీన ప్రక్రియ వేగంగా పూర్తి కానుంది. దీనికి సంబంధించి అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. సీఎల్పీ విలీనానికి అవసరమైన న్యాయ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఈ విషయాన్ని ఇటీవలే ధ్రువీకరించారు. విలీనం ఖాయమని దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.

కాంగ్రెస్‌లో ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ మిగలరని చెప్పారు. కాగా.. కాంగ్రెస్‌ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరితే టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనానికి అవసరమైన అంశాలన్నీ పూర్తయినట్లేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే రాష్ట్రంలో కొత్త రాజకీయానికి తెరలేవనుంది. తెలంగాణ అసెంబ్లీలో మొదటిసారిగా మజ్లిస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించనుంది. హైదరాబాద్‌ నగరానికి పరిమితమైన పార్టీగా భావించే మజ్లిస్‌ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా కీలకపాత్ర పోషించనుంది. టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనం తర్వాత మజ్లిస్‌కు ఏడుగురు, కాంగ్రెస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు మిగలనున్నారు. సీఎల్పీ విలీనం తర్వాత కాంగ్రెస్‌ సభ్యుల బలం ఇంకా తగ్గే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు చెబుతున్నారు.

లెక్కలన్నీ పక్కాగా వేసుకుని
2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ ఆధిక్యంతో రెండోసారి అధికారం చేపట్టింది. టీఆర్‌ఎస్‌ 88, కాంగ్రెస్‌ 19, మజ్లిస్‌ 7, టీడీపీ 2, బీజేపీ 1, ఏఐఎఫ్‌బీ 1, స్వతంత్ర అభ్యర్థిæ ఒకచోట గెలిచారు. ఫలితాల అనంతరం ఏఐఎఫ్‌బీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ (రామగుండం), స్వతంత్ర ఎమ్మెల్యే లావుడ్య రాములునాయక్‌ (వైరా) టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు ఆసక్తి కనబరిచారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వలస మొదలైంది. కాంగ్రెస్‌ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, పట్లోళ్ల సబితారెడ్డి, బానోత్‌ హరిప్రియానాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రె రెడ్డి, బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, వనమా వెంకటేశ్వర్‌రావు, జాజుల సురేందర్, గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

మరో ఇద్దరు ఎమ్మెల్యే చేరికకు రంగంసిద్ధమైంది. నలుగురు ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉందని.. ప్రస్తుతం ఇద్దరు చేరతారని టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడిన వెంటనే టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనం ప్రక్రియ పూర్తి కానుంది. కాంగ్రెస్‌ను వీడుతున్న 13 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ విలీనంపై శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఉమ్మడిగా లేఖ ఇవ్వనున్నారు. వెంటనే దీనిపై స్పీకర్‌ ప్రకటన జారీ చేయనున్నారు. అనంతరం అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య ఆరుకు తగ్గనుంది. దీంతో సభలో ఏడుగురు సభ్యులున్న మజ్లిస్‌ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించనుంది. నిబంధనల ప్రకారం మజ్లిస్‌కు అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేకున్నా.. సంఖ్యా బలం ప్రకారం ప్రధాన ప్రతిపక్షంగా మారనుంది.

ఇంటర్‌ వివాదం నేపథ్యంలో
పరిషత్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు ముందే సీఎల్పీ విలీనం ప్రక్రియ పూర్తవుతుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తూ వచ్చారు. అయితే ఇంటర్మీడియట్‌ మార్కుల వివాదం నేపథ్యంలో రాజకీయ నిర్ణయాలను కొన్ని రోజులు వాయిదా వేయాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించింది. ఇంటర్మీడియట్‌ వివాదం విషయం సద్దుమణిగిన తర్వాతే సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తవుతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా అసెంబ్లీ సమావేశాలలోపే సీఎల్పీ విలీనం జరిగి.. అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరం కానుంది.  

టీడీపీ సైతం..
లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ శాసనసభాపక్షాన్ని సైతం టీఆర్‌ఎస్‌లో విలీనం దిశగా అధికార పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్‌రావు (అశ్వారావుపేట) ఎమ్మెల్యేలుగా గెలిచారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే ప్రకటించారు. లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా మరో ఎమ్మెల్యేను చేర్చుకునేలా టీఆర్‌ఎస్‌ ఏర్పా ట్లు చేస్తోంది. ఇద్దరు ఒకేసారి చేరడంతో టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసే అవకాశముంది. దీనికి అనుగుణంగానే సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికీ అధికారికంగా తమ పార్టీలో చేరలేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement