బొమ్మనహళ్లి : మధ్య కర్ణాటకలోని ఏడు జిల్లాల్లో ఈసారి ఏ పార్టీని విజయం వరిస్తుందోననే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ జిల్లాల్లోని అధిక భాగాన్ని బయలు సీమగా పరిగణిస్తారు. దావణగెరె, చిత్రదుర్గ, తుమకూరు, చిక్కబళ్లాపురం, కోలారు, రామనగర, బెంగళూరు గ్రామీణ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో తొలి నుంచీ కాంగ్రెస్‌దే ఆధిపత్యం. దావణగెరె, చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల్లో మాత్రమే బీజేపీ, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తోంది. మిగిలిన జిల్లాల్లో ఆ పార్టీ ఉనికి నామమాత్రమే కనుక కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య అక్కడ ముఖాముఖి పోటీలు అనివార్యమవుతున్నాయి. మొత్తం 44 స్థానాలున్న ఈ ప్రాంతంలో అధికార కాంగ్రెస్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకత, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి లాంటి అంశాలు ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
దీనికి తోడు వీరశైవ–లింగాయతకు ప్రత్యేక మత హోదా కల్పించాలన్న సిఫార్సు కూడా ఆ పార్టీ పుట్టి ముంచేట్లు ఉన్నాయి. ముఖ్యంగా దావణగెరె, చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల్లో వీరశైవ–లింగాయత్‌లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. పుండు మీద కారం చల్లినట్లు ఈ జిల్లాల్లో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా పరిగణించే ఎస్‌సీ, ఎస్‌టీలు ఈ జిల్లాల్లో చెప్పుకోదగిన సంఖ్యలో ఉండడం ఆ పార్టీకి లాభించే అంశం. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నందున, ఎక్కువ నియోజక వర్గాల్లో కొత్త ముఖాలను పరిచయం చేసే దిశగా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. గత శాసన సభ ఎన్నికల్లో జేడీఎస్ ఇక్కడ గణనీయమైన ఫలితాలను సాధించింది. తుమకూరు జిల్లాలోని మొత్తం 11 స్థానాలకు గాను ఆరింటిని తన ఖాతాలో వేసుకుంది.
ఇదే జిల్లాలోని కొరటగెరె నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేపీసీసీ అధ్యక్షుడు జీ. పరమేశ్వర అనూహ్యంగా జేడీఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అలాగే కోలారు జిల్లాలోని మాలూరులో బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఎస్‌ఎన్. కృష్ణయ్య శెట్టి సైతం జేడీఎస్ అభ్యర్థి చేతిలో పరాభవం చెందారు. ఈ జిల్లాల్లోని అనేక నియోజకవర్గాలకు జేడీఎస్ ఇదివరకే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీకి 2013 ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కర్ణాటక జనతా పార్టీ పేరిట వేరు కుంపటి పెట్టుకోవడమే దీనికి ప్రధాన కారణం.
ఈసారి ఈ ప్రాంతంలో ఉత్తమ ఫలితాలను సాధించడానికి బీజేపీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. 2007లో ఏర్పడిన చిక్కబళ్లాపురం జిల్లాలో ఆ పార్టీ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు నియోజక వర్గం నుంచి బళ్లారి ఎంపీ బీ. శ్రీరాములును పోటీ చేయించడం ద్వారా ఎస్‌టీ ఓట్లను పార్టీ వైపునకు సంఘటిత పరచాలని బీజేపీ యోచిస్తోంది. ఇంకా రామనగర జిల్లాలో సీపీ.యోగీశ్వర్ (చన్నపట్టణ), బెంగళూరు గ్రామీణ జిల్లాలో బీఎన్. బచ్చేగౌడ (హొసకోటె), కోలారు జిల్లాలో కృష్ణయ్య శెట్టి లాంటి సీనియర్ నాయకుల నేతృత్వంలో పార్టీ వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకునే దిశగా పావులు కదుపుతోంది.
2013 ఎన్నికల్లో బెంగళూరు గ్రామీణ జిల్లాలో కాంగ్రెస్, జేడీఎస్‌లు రెండేసి స్థానాలను, కోలారు జిల్లాలో కాంగ్రెస్ మూడు, జేడీఎస్, ఇండిపెండెంట్ చెరొకటి, చిక్కబళ్లాపురం జిల్లాలో కాంగ్రెస్, జేడీఎస్‌లు రెండేసి, ఇండిపెండెంట్ ఒక చోట, రామనగర జిల్లాలో జేడీఎస్ రెండు చోట్ల, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు చెరో స్థానంలో, తుమకూరు జిల్లాలో కాంగ్రెస్ నాలుగు, జేడీఎస్ ఆరు, బీజేపీ ఒక స్థానంలో, చిత్రదుర్గ జిల్లాలో కాంగ్రెస్ నాలుగు, బీజేపీ, బీఎస్‌ఆర్ కాంగ్రెస్‌లు చెరో స్థానంలో, దావణగెరె జిల్లాలో కాంగ్రెస్ ఏడు, జేడీఎస్ ఒక చోట గెలుపొందాయి.
Comments
Please login to add a commentAdd a comment