అసెంబ్లీ ఎన్నికలు.. ఆ పార్టీకి కఠిన పరీక్షే..! | Congress Faces Massive Challenges Ahead of Maharashtra Polls | Sakshi
Sakshi News home page

కీలక ఎన్నికల ముందు పార్టీలో సంక్షోభం

Published Mon, Jul 8 2019 4:09 PM | Last Updated on Mon, Jul 8 2019 4:13 PM

Congress  Faces Massive Challenges Ahead of Maharashtra Polls - Sakshi

సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన కాంగ్రెస్‌ పార్టీకి.. మరో కఠిన పరీక్ష సవాలు విసురుతోంది. ఆ పార్టీకి కీలకమైన మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కీలక నేతల రాజీనామాలతో హస్తం పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికల వైఫల్యం అనంతరం.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  ఆయనకు మద్దతుగా దేశ వ్యాప్తంగా పీసీసీలు, కీలక పదవుల్లో ఉన్న సీనియర్లు కూడా పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామం పార్టీ శ్రేణులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది.

ముఖ్యంగా ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మహారాష్ట్రలో ఆ పార్టీ సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌ తన పదవికి రాజీనామా చేయడం.. మరికొంత మంది కీలక నేతలు పార్టీని వీడి అధికార బీజేపీలో చేరడం ఆ పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. దశాబ్దాల పాటు మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో చక్రం తిప్పిన రాష్ట్ర ప్రతిపక్ష నేత రాధాకృష్ణ ఊకే పాటీల్‌ ఇటీవల బీజేపీ చేరి.. ఏకంగా మంత్రి  పదవి దక్కించుకున్నారు. ఆయనతో పాటు పలువురు కీలక నేతలు కూడా ఆయన వెంట వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయం స్ఫూర్తితోనే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా  గెలుపొందాలని ఆపార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. దీని కోసం కేంద్ర హోంశాఖ మంత్రి, ఆ పార్టీ అధ్యక్షడు అమిత్‌ షా ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నారు. కాంగ్రెస్‌, ఎన్సీపీకి చెందిన కీలక నేతలను బీజేపీలోకి ఆహ్వానించాలని రాష్ట్ర శాఖను షా  ఆదేశించారు.

లోక్‌సభ ఎన్నికల ఓటమితో కుదేలయిన ఆపార్టీని ఫిరాయింపులతో మరింత దెబ్బతీయాలని కమళ దళం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్సీపీ, కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేతలు తమ పార్టీలో చేరనున్నారని మంత్రి గిరీష్‌ మహజన్‌ ఇటీవల స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే ఇతర పార్టీ నేతలతో మంతనాలు చేస్తున్నాట్లు ఆయన తెలిపారు.   అలాగే కీలకమైన ఎన్నికల ముందు రాష్ట్రానికి కొత్త సారథిని నియమించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా 48 లోక్‌సభ స్థానాలు గల మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి 41 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఎన్సీపీ 4 సీట్లను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్‌ కేవలం ఒకే స్థానానికి పరిమితమైంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమిత్‌ షా ఇటీవల  ప్రారంభించిన విషయం విధితమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement