కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీని సీబీఐ బుధవారం అరెస్టు చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. నరేంద్రమోదీ సర్కారు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకొని సాగిస్తున్న కక్షసాధింపు రాజకీయాలకు ఇది నిలువత్తు నిదర్శనమని ధ్వజమెత్తింది.
ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థ మనీలాండరింగ్ కేసులో 46 ఏళ్ల వ్యాపారవేత్త కార్తీని చెన్నై విమానాశ్రయంలో సీబీఐ బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నీమో(నీరవ్‌మోదీ), చోక్సీ, డీడీ జెవెల్లర్స్, రోటోమ్యాక్ ఇలా రోజుకొకటి చొప్పున బయటపడుతున్న భారీ కుంభకోణాలు, అవినీతిని దృష్టిని మరల్చేందుకు మోదీ సర్కారు సాగిస్తున్న కళాత్మక ప్రయత్నమే ఇదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. అయినా, కాంగ్రెస్ పార్టీ సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చే విషయంలో వెనుకకు తగ్గబోదని ఆయన వెల్లడించారు.
తన తండ్రి చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు కార్తీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో తన ప్రభావాన్ని ఉపయోగించి.. ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థకు మారిషస్‌కు చెందిన పెట్టుబడిదారుల నుంచి విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించేలా చూశాడని, రూ. 305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసి.. ముడుపులు పొందాడని ఆరోపిస్తూ కార్తీ మీద సీబీఐ కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment