త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ‘మేనిఫెస్టో’లను కీలక ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఇందుకోసం ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల వారీగా ప్రత్యేక మేనిఫెస్టోలను రూపొందించే కసరత్తు చేస్తోంది. ఈ మేనిఫెస్టోల్లో రాష్ట్ర స్థాయిలో అధికార టీఆర్‌ఎస్ వైఫల్యాలతో పాటు ఎక్కడికక్కడ మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన సమస్యలను ఫోకస్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం స్థానికంగా సామాజిక అవగాహన ఉన్న తటస్తులతో కమిటీలు ఏర్పాటుచేసి పక్కా ‘మేనిఫెస్టో’లతో ముందుకెళ్లే కసరత్తును ప్రారంభించింది. దీనికి తోడు రాష్ట్రస్థాయిలో పురపాలక శాఖ పరిధిలోని అంశాలపై ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ రూపొందిస్తోంది. ఇందుకోసం 11 మంది సభ్యులతో కూడిన కమిటీని కూడా నియమించింది.
వైఫల్యాలే ఎజెండా
గత ఆరేళ్లలో పట్టణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ చేపట్టలేకపోయిన కార్యక్రమాలను ఫోకస్ చేస్తూ మేనిఫెస్టోలను రూపొందించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. టీఆర్‌ఎస్ ఏం చెప్పింది... ఏం చేయలేకపోయిందనే అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించాలని నిర్ణయించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, బీసీలకు ఉపాధి రుణాలు, కేంద్ర నుంచి వచ్చే నిధులను వినియోగించడంలో టీఆర్‌ఎస్ విఫలమయిందనే విషయాన్ని రాష్ట్రస్థాయి మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పనున్నారు.
కనీసం ఫైనాన్స్ కమిషన్ నిధులను ఇవ్వలేదని, నాన్‌ప్లాన్, న్యూప్లాన్ గ్రాంట్లను కూడా ఇవ్వకుండా పట్టణ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన అంశాలను ప్రస్తావించనున్నారు. వీటితో పాటు స్థానిక మేనిఫెస్టోల్లో తమను గెలిపిస్తే ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తామనే అంశాలను ఫోకస్ చేయాలని టీపీసీసీ నేతలు నిర్ణయించారు.
ఎన్నికల ఇన్‌చార్జుల నియామకం
దీంతో పాటు జిల్లాల వారీగా ఎన్నికల ఇన్‌చార్జులను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పలువురికి బాధ్యతలు అప్పగించారు. ఆయా జిల్లాల ఇన్‌చార్జులు మున్సిపల్ ఎన్నికలు ముగిసేంతవరకు అక్కడే బస చేసి పార్టీ నేతల మధ్య సమన్వయం, ఎన్నికల వ్యూహాల అమలు, స్థానిక నేతలతో కలిసి అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను నిర్వహిస్తారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఎన్నికల ఇన్‌చార్జుల నేతృత్వంలో ఈనెల 4న అన్ని జిల్లాల్లో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా, పార్టీ తరఫున పోటీ చేసేందుకు అవసరమైన ఏ–ఫారం, బీ–ఫారంల ఇన్‌చార్జిగా పార్టీ సీనియర్ నేత, పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్‌కు బాధ్యతలు అప్పగించారు. సంబంధిత ఫారాలను అభ్యర్థులకు అందజేసే బాధ్యతలను నిరంజన్‌కు అప్పగిస్తూ ఉత్తమ్ గురువారమే ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరేళ్లలో ఒక్క కొత్త పథకం రాలేదు
‘టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరేళ్లలో పట్టణ ప్రాంతాలకు ఒక్క కొత్త పథకం రాలేదు. కేంద్రం ఇచ్చే నిధులను కూడా మున్సిపాలిటీలకు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు. ఐదేళ్ల పాటు రోడ్ల గురించి పట్టించుకోకుండా ఎన్నికలు వస్తున్నాయని అంతర్గత రోడ్లు వేశారు. అడ్డగోలుగా ఓటర్ల జాబితాలు మార్చేశారు. అందుకే స్థానిక అంశాలను ఫోకస్ చేసుకుని ఎన్నికలను ఎదుర్కొంటాం. టీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజలకు స్పష్టంగా చెప్పి ఓట్లడుగుతాం.’ – బుర్రి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ నేత, నల్లగొండ మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment