సాక్షి, న్యూఢిల్లీ: టికెట్ ఎవరికి కేటాయించినా కలిసి పనిచేయాలని, భవిష్యత్తులో పార్టీ తగిన అవకాశాలు కల్పిస్తుందని అభ్యర్థిత్వం ఆశిస్తున్నవారిని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ, టీపీసీసీ నేతలు బుజ్జగించారు. తొలివిడతలో 57 స్థానాల అభ్యర్థులకు ఆమోదముద్ర పడగా.. మలివిడతగా మరో 38 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ జరుపుతున్న కసరత్తు మంగళవారం ఉదయం 11 నుంచి బుధవారం తెల్లవారుజామున 2 వరకు సాగింది. మళ్లీ బుధవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగింది. ఈ భేటీకి విజయశాంతి కూడా హాజరయ్యారు. ఒక్కో స్థానం నుం చి ఒకటి లేదా రెండు పేర్లతో ప్రాథమికంగా కసరత్తు పూర్తిచేసి, పోటీ ఎక్కువగా ఉన్న 20 నుంచి 25 స్థానా ల్లో ఆశావహులను ఢిల్లీకి రమ్మని బుధవారం హస్తిన నుంచి సందే శాలు వెళ్లాయి. 30–40 మంది ఆశావహులు హుటాహుటిన గురువారం ఢిల్లీ చేరుకున్నా రు.
వార్ రూంలో వీరందరితో తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు భక్తచరణ్‌దాస్, షర్మిష్టా ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్ తదితరులు సంప్రదింపులు జరిపారు. ఒక్కో స్థానంలోని ఆశావహులతో విడివిడిగా, ఉమ్మడిగా మాట్లాడారు. ‘టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసి పనిచేయాలి. పార్టీ భవిష్య త్తులో అధికారంలోకొచ్చాక ఎమ్మెల్సీగానో, నామినేటెడ్ పోస్టుల్లోనో అవకాశం కల్పిస్తుంది’ అని పేర్కొ న్నారు. అందరితోనూ ఇదే అంశాన్ని చర్చించినప్పటికీ కొందరికని ఇతర స్థానాల నుంచి పోటీ చేసే ఉద్దే శం ఉందా? అని కూడా ప్రశ్నించినట్టు సమాచారం.
రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి తప్పని పోటీ..
కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి కమిటీ నుంచి పిలుపొచ్చింది. ఆయన గతంలో సూర్యాపేట నుంచి పోటీ చేశారు. ఇక్కడ టీడీపీ నుం చి 2014లో పోటీచేసిన పటేల్ రమేశ్‌రెడ్డి ఇప్పుడు రేవంత్‌రెడ్డి వెంట కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆయన నుంచి దామోదర్‌రెడ్డికి టికెట్ విషయంలో గట్టిపోటీ ఎదురైంది. 2014లో దామోదర్‌రెడ్డికి 38,618 ఓట్లు రాగా, రమేశ్‌రెడ్డికి 38,171 ఓట్లు వచ్చాయి. వీరి ద్దరిలో ఒకరికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తామని, కలిసి పనిచేయాలని స్క్రీనింగ్ కమిటీ సూచించినట్టు సమాచారం. దామోదర్‌రెడ్డి సీనియర్ అయినందున ఆయనకే ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిం చాలని కూడా రమేశ్ చెప్పినట్టు తెలుస్తోంది. దామోదర్‌రెడ్డి తాను పార్టీలో భాగమని, తన సీనియారిటీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.
ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, మిర్యాలగూడ నుంచి పోరెటి స్రవంత్‌రెడ్డిలతోనూ కమిటీ సంప్రదింపులు జరిపింది. నకిరేకల్ నుంచి ధనమ్మతో కమిటీ మాట్లాడింది. మంచిర్యాలలో హోరాహోరీ పోటీ ఎదుర్కొంటున్న ప్రేమ్‌సాగర్‌రావు, అరవిందరెడ్డిలు ఇద్దరితో నూ కమిటీ చర్చించింది. తాను టీఆర్‌ఎస్‌ను కాదని కాంగ్రెస్‌లో చేరి మంచిర్యాల నియోజకవర్గం చూసుకుంటుండగా ప్రేమ్‌సాగర్‌రావు ఇందులో జోక్యం చేసుకోవడం ఎంత వరకు న్యాయమని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు వెలమలకు ఎలా ఇస్తారని అరవిందరెడ్డి ప్రశ్నించినట్టు సమాచారం. అలాగే ఆదిలాబాద్ నుంచి సి.రాంచంద్రారెడ్డి, గండ్రత్ సుజాత హాజరయ్యారు.
ముఖ్యనేతల సంప్రదింపులు..
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి డీకే అరుణ, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, సంభాని చంద్రశేఖర్ తదితరులు కూడా కమిటీతో సంప్రదింపులు జరిపి, తమపై ఉన్న ఒత్తిళ్లను ప్రస్తావించినట్టు సమాచారం.
పట్లోళ్ల రెబల్‌గా బరిలోకి దిగుతారా?
మెదక్ అసెంబ్లీ టికెట్ విజయశాంతికి ఇవ్వనున్నారన్న వార్తల నేపథ్యంలో అక్కడ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పి.శశిధర్‌రెడ్డి వర్గం నివ్వెరబోయింది. పద్మాదేవేందర్‌రెడ్డిపై పోటీకి శశిధర్‌రెడ్డి సరైన అభ్యర్థి అని, కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా, లేదా మెదక్ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించినా శశిధర్‌రెడ్డి స్వతంత్రుడిగా బరిలోకి దిగడం ఖాయమని ఆయన అనుచరులు తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ నుంచి పిలుపు వచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదని తెలుస్తోంది. ఇక నారాయణఖేడ్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కర్, సంజీవరెడ్డికి పిలుపొచ్చింది. ఇక్కడి నుంచి షెట్కర్‌కు టికెట్ ఖాయమైపోయినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నుంచి సురేందర్‌తోనూ స్క్రీనింగ్ కమిటీ సంప్రదింపులు జరిపింది.
మాజీ మేయర్‌కూ దక్కని స్పష్టత...
సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. ఆదం సంతోష్‌కుమార్ ఇదే సీటు కోరుతున్నారు. అయితే కార్తీకరెడ్డికి స్పష్టమైన హామీ దక్కలేదని సమాచారం. ఇక్కడ అకస్మాత్తుగా సంతోష్‌కుమార్ భార్య పేరు కూడా పరి శీలనకు వచ్చినట్టు తెలిసింది. కార్తీకరెడ్డిని, మరో ఆశావహుడు లక్ష్మణ్‌గౌడ్‌ను స్క్రీనింగ్ కమిటీ పిలిపించి ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేయాలని కమిటీ సూచించింది. అలాగే వికారాబాద్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న మాజీ మంత్రి చంద్రశేఖర్‌ను అదే జిల్లాలోని మరో స్థానం నుంచి పోటీ చేస్తారా అని అడిగినట్టు సమాచారం.
అయితే తాను వికారాబాద్ మినహా ఎక్కడి నుంచీ పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. రాజేంద్రనగర్ నుంచి బండ్ల గణేష్‌కు పిలుపొచ్చింది. ఇబ్రహీంపట్నం నుంచి క్యామ మల్లేష్, మల్‌రెడ్డి రంగారెడ్డిలను కమిటీ ఆహ్వానించి సామాజిక న్యాయం ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని, సహకరించాలని కోరినట్టు సమాచారం. మేడ్చల్ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, తోటకూరి జంగయ్య యాదవ్‌లకు పిలుపొచ్చింది. ఈ స్థానంలో యాదవ్ వైపే కమిటీ మొగ్గినట్టు తెలుస్తోంది. లక్ష్మారెడ్డికి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మధ్య సఖ్యత లేదని కూడా తెలుస్తోంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి..
ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి భారీ సంఖ్యలో ఆశావహులు ఉండగా వారిలో చాలా మందికి పిలుపొచ్చింది. నాగర్‌కర్నూలు నుంచి మణెమ్మ, మహబూబ్‌నగర్ నుంచి వెంకటేశ్, ఇబ్రహీం, ఒబేదుల్లా కొత్వాల్, సురేందర్‌రెడ్డిలకు, మక్తల్ నుంచి శ్రీహరి, నారాయణపేట్ నుంచి అమ్మకోలు శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర నుంచి పవన్‌రెడ్డి తదితరులతో కమిటీ మాట్లాడింది. అయితే ఒకే నేత అన్ని నియోజకవర్గాల్లో తమవారికే ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, పార్టీని నమ్ముకున్న వారిని కూడా చూడాలని కొందరు మహబూబ్‌నగర్ జిల్లా నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణలకూ పిలుపొచ్చింది. పాలేరు నుంచి గాయత్రి రవికి పిలుపొచ్చింది. ఇల్లెందు నుంచి ఊకె అబ్బయ్య, హరిప్రియ హాజరయ్యా రు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ములుగు నియోజకవర్గం ఉంచి పోడెం వీరయ్యను భద్రాచలం నుంచి పోటీ చేస్తారా? అని అడిగినట్టు సమాచారం. ఇందుకు ఆయన ములుగు నుంచి తప్ప ఎక్కడి నుంచీ పోటీ చేయనని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక్కడి నుంచి సీతక్కకు ఇదివరకే టికెట్ ఖరారైనట్టు సమాచారం. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కూడా స్క్రీనింగ్ కమిటీని కలిశారు. ఈ సీటును మిత్రపక్షాలకు వదిలిపెట్టడం సమంజసం కాదని ఆయన కమిటీకి నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment