సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కొందరు పెద్దల తీరుపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు కొంత ఆగ్రహానికి ప్రధాన కారణమైతే, నేతలు వ్యవహరిస్తున్న తీరు దానికి ఆజ్యం పోస్తోంది. టీటీడీపీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి తోడు క్యాడర్ లేని కొన్ని అసెంబ్లీ స్థానాలను పొత్తుల్లో కోరడం మరింత రెచ్చగొట్టేలా చేస్తోంది. ఇటు టీడీపీ తెలంగాణ తమ్ముళ్లు, అటు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు సైతం ఈ నలుగురి వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నారు. అసలు వారిది త్యాగమా..లేక పలాయనమా అని ప్రశ్నిస్తున్నారు. వీరి చర్యల వల్ల ఎవరికి లాభం చేకూరుతోందని నిలదీస్తున్నారు.
అనుచరుల వాదన ఇలా..?
కోరుట్లలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పోటీచేస్తారని మహాకూటమి ఏర్పాటు కొత్తలో ప్రతిపాదిం చారు. తాను పోటీచేయడంలేదని,ఆ సీటు కూటమి గెలుపు కోసం త్యాగం చేస్తున్నట్టు రమణ ప్రకటించడం జగిత్యాల, కోరుట్లలో ఉన్న రమణ అనుచరులు, కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. దీనికి తోడు ఆ సీటుపై ఇప్పటివరకు కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీచేస్తారో తేలకపోవడం రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ కలిగిస్తోంది. ఇటు జగిత్యాలలో జీవన్‌రెడ్డికి మద్దతు తెలపడం పైనా తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. రమణ వెంట ఉన్న ప్రధాన సామాజిక వర్గం నేతల్లోనూ గందరగోళం నెలకొంది. ఇదే రీతిలో నిజామాబాద్ రూరల్ నుంచి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పోటీచేస్తారని తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేసుకున్నారు. తీరా ఆ టికెట్ టీఆర్‌ఎస్ మాజీ నేత, ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దీనితో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారం రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.
తాను హుజూరాబాద్‌లో పోటీచేయలేనని, కూకట్‌పల్లిలో పోటీచేస్తానని ప్రకటించుకున్న పెద్దిరెడ్డికి పార్టీ ఏ టికెట్ కేటాయించలేదు. ఇక కూకట్‌పల్లినుంచి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దింపారు. పెద్దిరెడ్డి హుజూరాబాద్‌నుంచి పోటీకి ఒప్పుకుంటే ఈ పాటికి ప్రచారంలో ముం దుండే వాళ్లమని ఇప్పుడు ఎటూకాని స్థితిలో ఉండిపోయామని ఆ కార్యకర్తలు అంటున్నారు. అదే రీతిలో మహబూబ్‌నగర్ చెందిన టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి సైతం పోటీచేయకుండా సాగదీత తంతు నడిపిస్తుండటంతో వనపర్తిలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిలో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నలుగురు టీడీపీ పెద్దలు పోటీలో ఉండి ఉంటే పార్టీకి మేలు జరిగేదనీ, వారు బరిలో లేకపోవడం వల్ల క్యాడర్ పక్కచూపులు చూడాల్సి వస్తోందని టీటీడీపీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.
ఆ సీట్లు మనకెందుకు?
టీడీపీ లెక్క ప్రకారం ఖమ్మంలోని కొన్ని నియోజకవర్గాలు, హైదరాబాద్, రంగారెడ్డిలోని కొన్ని, నిజామాబాద్‌లో రెండు, మహబూబ్‌నగర్‌లో రెండింటిలో బలంగా ఉన్నట్టు చెప్పుకుంటోంది. అయితే ఉద్యమ ప్రాంతంగా ఉన్న వరంగల్ జిల్లాలో అదికూడా యూనివర్సిటీ, ఉద్యోగులు ఎక్కువగా ఉన్న వరంగల్ వెస్ట్‌లో టీడీపీ పోటీచేయడం సొంత పార్టీ నేతలకే రుచించడం లేదు.తన నియోజకవర్గం కాకుండా వెస్ట్‌లో రేవూరి ప్రకాశ్‌రెడ్డి పోటీచేయడం ఏమిటని ఆయన అనుచరులే అంటున్నారు. ఇక ఎల్బీనగర్ సీటు కోసం పట్టుబడతారని భావిస్తే ఏమాత్రం క్యాడర్‌లేని ఇబ్రహీంపట్నం తీసుకోవడంపైనా వారు ఆశ్చర్యపోతున్నారు. నిజామాబాద్ రూరల్ లేదా బాల్కొండ తీసుకోవాలని నేతలు కోరినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదన్న ఆరోపణ వినిపిస్తోంది.
కాంగ్రెస్ నేతల్లో మరో వాదన...
తమ పార్టీ గెలుస్తుందని భావించిన స్థానాల్లో టీడీపీ అనవసరంగా 14 టికెట్లు అని డిమాండ్ పెట్టి నష్టపరిచిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రమణ, మండవ, పెద్దిరెడ్డి, రావులతో పాటు మరో ఆరుగురు పోటీచేస్తే సరిపోయేదని, అసలు నేతలే పక్కకు జరిగి బలంలేని వారిని పోటీలో పెట్టి కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చారని, దీనిపై అనేక అనుమానాలున్నాయని వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీని చూసి తెలంగాణ జనసమితి సైతం 8 నుంచి 12 సీట్లు డిమాండ్ పెట్టిందనీ. మిర్యాలగూడ, వరంగల్ వెస్ట్‌లో కనీసం టీజేఎస్‌కు నాయకులే లేరని కాంగ్రెస్ మదనపడుతోంది. మహబూబ్‌నగర్‌లో టీడీపీ మరో నియోజకవర్గ నేతను తెచ్చి పోటీలో పెట్టడం వెనుక టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ రెండుపార్టీల్లో పరిస్థితి ఎన్నికల వేళ ఎలాంటి సునామీకి దారితీస్తుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment